
చెన్నై: తమిళనాడు, కేరళకు భారీ వర్ష సూచన ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. వారం పాటు నిర్వరామంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు చేసింది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో ఎనిమిది జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ను ప్రకటించింది.
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఇప్పటికే భారీ వర్షం కురవగా.. కన్యాకుమారి, రామనాథపురం, తిరునల్వేళి, తూత్తుకూడి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. చెన్నైలో మాత్రం సాధారణ వర్షపాతం నమోదైతుందని వెల్లడించింది.
కేరళలోని అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, కోజికోడ్ జిల్లాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. తమిళనాడులోని తిరువారూరు జిల్లాలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అతి భారీ వర్ష సూచనతో విపత్తు నిర్వహణ అధికారులు అప్రమత్తమయ్యారు. తమిళనాడులోని నాలుగు జిల్లాల్లో 400 మందితో విపత్తు నిర్వహణ బృందాలను ఏర్పాటు చేశారు. రెస్క్యూ ఆపేషన్ కోసం చెన్నైలో మరో 200 మంది సిబ్బందిని నిలిపి ఉంచారు.
ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు చేరడంతో జనం పలు అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల చెట్లు కూలడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
ఇదీ చదవండి: 80 వేల కిలోల గంటను బిగిస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి
Comments
Please login to add a commentAdd a comment