. బాలుడి ప్రాణం బలిగొన్న కుళాయి గుంత
బాలుడిని మింగిన కుళాయి గుంత
Published Wed, Oct 19 2016 9:38 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
– ఆడుకుంటూ గుంతలో పడిపోయిన బాలుడు
- శోకసంద్రంలో కుటంబసభ్యులు
బోయ రామాంజనేయు, జయలక్ష్మి దంపతులకు ఒకే ఒక సంతానం. ఆ బిడ్డకు రెండేళ్లు. వాడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.తాము కష్టపడి బిడ్డను బాగా చదివించాలని కలలుగన్నారు. అయితే, విధి చిన్నచూపుచూసిందని కుళాయిగుంత రూపంలో తమ ఆశల దీపాన్ని ఆర్పేస్తుందని వారు ఊహించలేకపోయారు. వివరాల్లోకి వెళితే..
ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని సోగనూరు గ్రామానికి బోయ రామాంజనేయులు పట్టణంలో హమాలీ. భార్య జయలక్ష్మి ఇంటి వద్దే ఉంటుంది. ఈ దంపతులకు వివాహమైన రెండేళ్లకు మొదటి సంతానంగా బాబు పుట్టాడు. వాడికి ధనుంజనేయులు(2)అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. ఎప్పటిలాగే రామంజనేయులు ఉదయం పనికి పోయాడు. తల్లి వద్ద ఉన్న ధనుంజయులు ఆడుకుంటూ రోడ్డు మీదకు వచ్చాడు. పక్కన ఉన్న కుళాయి గుంతలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. అందులో నీళ్లు ఉండటంతో మునిగిపోయాడు. కొద్దిసేపటికి కుళాయి నీటి కోసం వచ్చిన మహిళ నీటిలో మునిగి ఉన్న చిన్నారిని చూసి కేకలు వేసింది. వెంటనే చిన్నారి తల్లి, ఇరుగుపొరుగువారు వచ్చి గుంతలో నుంచి బయటకు తీశారు. ప్రాణాలతో ఉన్నాడేమోననే ఆశతో కుటుంబ సభ్యులు స్కూటర్‌పై పట్టణంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు కుళాయి గుంతలో పడి ప్రాణాలు వదలడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
కుళాయిలకు వాల్ ఏర్పాటు చేయకపోవడంతోనే..
గుంతల్లో ఏర్పాటు చేస్తున్న మంచినీటి కుళాయిలకు వాల్స్ అమర్చడం అధికారులు మరచిపోతున్నారు. దీంతో నీరు వృథాగా పోయి గుంత నిండిపోతుంది. సోగనూరులో జరిగిందీదే. అదే వాల్ ఉండి ఉంటే గుంతలో నీళ్లు ఆగేవి కావు..చిన్నారి ప్రాణాలు పోయేవి కావని గ్రామస్తులు పేర్కొంటున్నారు. దీనికంతటికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు.
Advertisement
Advertisement