'అత్యవసరమైతే తప్ప మొబైల్ వాడకండి'
లక్నో: మీకు అత్యవసరమైతే తప్ప మొబైల్ ఫోన్లు వాడకండీ అని సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తమ పార్టీ నాయకులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం లక్నోలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ములాయం మాట్లాడుతూ.. తాను మొబైల్ ఫోన్ను ఎంతో అత్యవసరమైతేనే, వేరే ప్రత్యామ్నాయం లేనప్పుడు మాత్రమే వాడుతానని వెల్లడించారు.
మొబైల్లో సంభాషనలను ట్యాపింగ్ చేసి తరువాత వాటితో బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. సాంకేతిక పరిఙ్ఞానాన్ని తప్పుగా వాడే అవకాశం ఉందన్న ఆయన.. మీ సంభాషనలు ట్యాపింగ్కు గురికావచ్చు జాగ్రత్తగా ఉండాలని పార్టీ నాయకులకు సూచించారు. గతంలో సస్పెండైన ఐపీఎస్ ఆఫీసర్ అమితాబ్ ఠాకూర్ ఫోన్లో తనను వేధించారని ఆరోపించడంతో ములాయం ఈ వ్యాఖ్యలు చేశారు.