ఇంటి ముంగిటకు ‘భగీరథ’
♦ ఆగస్టు 7న ముహూర్తం
♦ ఆ రోజు నుంచి ‘గజ్వేల్’లో ఇంటింటికీ నీళ్లు
♦ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం
♦ 5 నెలల్లోనే పనులు పూర్తి చేయడం రికార్డు
♦ ఏడో తేదీనే సుదర్శనయాగం మంత్రి హరీశ్‌రావు వెల్లడి
గజ్వేల్: ‘మిషన్ భగీరథ’ ద్వారా ఇంటింటికి నల్లా నీటిని అందించే ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 7న గజ్వేల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభిస్తారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. అదేరోజు సుదర్శనయాగం చేపడుతారన్నారు. మంగళవారం ఆయన గజ్వేల్ నియోజక వర్గంలో హరితహారంలో పాల్గొన్నారు. అనంతరం గజ్వేల్ మండలం బంగ్ల వెంకటాపూర్‌లోని అటవీశాఖ నర్సరీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేవలం ఐదు నెలల కాలంలోనే ‘మిషన్ భగీరథ’ ద్వారా 67,551 నల్లా కనెక్షన్లు ఇవ్వడం జాతీయ రికార్డుగా పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లోగల 243 గ్రామాలకుగాను 231గ్రామాల్లో ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేయగా... 144 గ్రామాల్లో ప్రజలు ప్రస్తుతం నీటిని తాగుతున్నారన్నారు. 78గ్రామాల్లో వందశాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. నియోజకవర్గంలో 150 ఓవర్‌హెడ్ ట్యాంకులకుగాను 120 ట్యాంకుల నిర్మాణం పూర్తయినట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవ, అధికారుల కృషి ఫలితంగానే ఈ రికార్డు సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. డిసెంబర్ నాటికి దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లోనూ ‘మిషన్ భగీరథ’ ద్వారా పూర్తి స్థాయిలో నల్లా నీటిని అందిస్తామన్నారు.
హైదరాబాద్‌తోపాటు గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు మంచినీటిని అందిస్తున్న ఎల్లంపల్లి రిజర్వాయర్ ఇప్పటికే నిండుతోందని చెప్పారు. గతేడాది 9టీఎంసీలు మాత్రమే రిజర్వాయర్‌ను నింపడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఈ రిజర్వాయర్‌లోకి 20టీఎంసీల నీరు రాబోతుందన్నారు. కొద్దిరోజుల్లోనే ఈ జలాశయం పూర్తిగా నిండే అవకాశముందని వెల్లడించారు. ఫలితంగా మంచినీటి సరఫరాకు ఎలాంటి ఢోకా ఉండబోదన్నారు. విలేకరుల సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, వాటర్‌గ్రిడ్ ఎస్‌ఈ విజయప్రకాశ్, ఈఈ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.