‘ఖేడ్’ అభివృద్ధి బాధ్యత నాదే
♦ నియోజకవర్గ ప్రజల విశ్వాసాన్ని కాపాడుకుంటాం: మంత్రి హరీశ్
♦ ప్రత్యేక ప్యాకేజీతో సాగు, తాగునీటి కష్టాలు తీరుస్తా
♦ విపక్షాలు ఇకనైనా మారాలి.. అభివృద్ధికి కృషి చేయాలి
♦ మార్చి రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
♦ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన భూపాల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘‘నారాయణ ఖేడ్ ప్రజల విశ్వాసాన్ని కాపాడుకుంటాం. నియోజకవర్గం అభివృద్ధికి పూర్తిగా నాదే బాధ్యత. ఆ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తా. సీఎం వద్ద ప్రత్యేక ప్యాకేజీ సాధించి సాగు, తాగునీరు, విద్య, వైద్యం, రోడ్ల నిర్మాణం వంటి మౌలిక సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటా...’’ అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు పేర్కొన్నారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన భూపాల్‌రెడ్డి ఆదివారం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. స్పీకర్ ఎస్.మధుసూదనాచారి.. భూపాల్‌రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి తదితరులు హజరయ్యారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. సీఎం అందిస్తున్న సుపరిపాలన వల్లే ఖేడ్‌లో విజయం సాధ్యమైంద న్నారు.
ప్రతిపక్షాలు ఆత్మవిమర్శ చేసుకోవాలి
ప్రతిపక్షాలు ఎంత దివాలాకోరు ప్రచారం చేసినా ప్రజలు తిప్పికొట్టారని, అభివృద్ధి, సంక్షేమానికే జై కొట్టారని హరీశ్ అన్నారు. తెలంగాణ కోసం ఎలా కలిసి కొట్లాడామో, అభివృద్ధి కోసం కూడాఅలాగే కలిసి కృషి చేద్దామని విపక్షాలకు హితవు పలికారు. విపక్షాలు ఇకనైనా, ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. దేశంలోనే అత్యంత ఆదరణ కలిగిన సీఎంగా కేసీఆర్ అని ‘ఇండియా టుడే’ ప్రకటించిందని, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆ పత్రికకు కనిపించినా, ఇక్కడి ప్రతిపక్షాలకు మాత్రం కనిపించకపోవడం విచారకరమని పేర్కొన్నారు. తమిళనాడు వంటి రాష్ట్రాలే కరెంటు కష్టాల నుంచి బయటపడలేక పోతున్నాయని, తెలంగాణ ఇంత తక్కువ కాలంలో కరెంటు సమస్యను ఎలా అధిగమించిందో విపక్షాలు ఆలోచించాలని సూచించారు. మిషన్ భగీరథ తరహా పథకాన్ని తాము కూడా అమలు చేస్తామని యూపీ, బిహార్, ఒడిశా వంటి రాష్ట్రాలు ముందుకు వస్తున్నాయని, మిషన్ కాకతీయ పథకానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని చెప్పారు. విలేకరుల సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
జల విధానంపై అర్థవంతమైన చర్చ జరగాలి
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 2వ వారంలో నిర్వహించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈ సమావేశాలు వేదికగా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం రూపొందించిన సమగ్ర జల విధానాన్ని సీఎం సభలో చర్చకు పెడతారని చెప్పారు. ప్రభుత్వం అర్థవంతమైన చర్చ కోరుకుంటోందన్నారు.
ఖేడ్ ప్రజల రుణం తీర్చుకుంటా: భూపాల్‌రెడ్డి
నారాయణ ఖేడ్ నియోజకవర్గ ప్రజలకు తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటానని ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడి ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు.