నాంపల్లి: అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం రెడ్‌హిల్స్‌లోని ఫెడరేషన్ హౌస్‌లో ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విజన్ తెలంగాణ’ ఇంటరాక్టివ్ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిన గుజరాత్, కేరళ రాష్ట్రాలు సైతం తెలంగాణ వైపు చూస్తున్నాయన్నారు. మొన్న ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబంధు వంటి పథకాలను తీసుకువస్తామని మేనిఫెస్టోలో పార్టీలు పేర్కొనడం జరిగిందని గుర్తు చేశారు. ఐదేళ్లలోనే కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని ప్రజలు గమనిస్తున్నారని, మిషన్ భగీరథ అద్భుత ఫలితాలను ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
టీఎస్ ఐపాస్ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పథం లో పయనింపజేస్తున్నట్లు వివరించారు. మిషన్ భగీరథ కింద 1.70 లక్షల పైపులైన్లు వేసి ఇంటింటికి తాగేందుకు మంచినీరు అందిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమల ప్రోత్సాహానికి మంత్రి కేటీఆర్ నిత్యం తనపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, పరిశ్రమల స్థాపనతో ఉపాధి, ఉత్పత్తులను పెంపొందించుకోవడానికి వీలుంటుందని పదే పదే చర్చిస్తున్నారని వివరించారు. భూసేకరణతో వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయ నున్న టెక్స్‌టైల్ పార్కు ఆలస్యమవుతోందని, ఈ సమస్యను సత్వరమే పరిష్కరించి కొద్ది నెలల్లోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తామన్నారు. ఆర్థిక మాంద్యాన్ని అధిగమించడానికి ప్రభుత్వానికి పారిశ్రామిక వేత్తలు సూచనలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌టీసీసీఐ అధ్య క్షుడు కరుణేంద్ర జాస్తి, సీనియర్ ఉపాధ్యక్షుడు రమకాంత్ ఇనానీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment