పైప్‌లైన్ లీకేజీకి మరమ్మతులు చేస్తున్న మిషన్ భగీరథ సిబ్బంది
కుల్కచర్ల: మిషన్ భగీరథ పథకం అమల్లో ముఖ్య భూమిక వాటర్ లైన్‌మెన్లదే.. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రజలకు తాగునీటి సరఫరాలో నిమగ్నమవుతారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడినా తక్షణం స్పందిస్తారు. అయితే ఇలాంటి వారికి ఉద్యోగ భద్రత లేకపోవడం ఆందోళన కలిగించే అంశమే.. కనీస వేతనం అమలు కాక కుటుంబ పోషణ కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏళ్ల తరబడి పనిచేస్తున్నా గుర్తింపు లేదు
కుల్కచర్ల, చౌడాపూర్ మండలాల్లో మిషన్ భగీరథ పథకం కింద 25మంది వాటర్ లైన్‌మెన్లు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 260మంది పనిచేస్తున్నారు. వీరు లేబర్ కాంట్రాక్టర్లకు అనుబంధంగా తాత్కాలిక పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. సంవత్సరాల తరబడి పని చేస్తున్నా సరైన గుర్తింపు లేదని ఆవేదనకు గురవుతున్నారు. ఉద్యోగ భద్రత లేక తమ పరిస్థితి గాలిలో దీపంలా మారిందని వాపోతున్నారు. విధి నిర్వహణలో తమకు ఒక సమయం అంటూ లేదని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు.. ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి పోవాల్సి వస్తోందని తెలిపారు.
నామమాత్రపు జీతాలు
మిషన్ భగీరథ లైన్‌మెన్లను లేబర్ కంపెనీల ఆధ్వర్యంలో నియమించారు. దీంతో వారికి ఎలాంటి అలవెన్స్ అందడం లేదు. విధి నిర్వహణకు ఒక సమయమంటూ లేకుండా పోయింది. సంబంధిత కాంట్రాక్టర్‌కు నచ్చితే ఉద్యోగం.. లేకుంటే మరో పని వెతుక్కోవాల్సిందేనని ఆవేదన చెందుతున్నారు. ఒక్కో లైన్‌మెన్‌కు నెలకు రూ. 9వేలు జీతం చెల్లిస్తున్నారు. ఈ డబ్బు తమ ఖర్చులు, ఇంటి అవసరాలకు మాత్రమే సరిపోతోందని, పిల్లల చదువులు, భవిష్యత్ అవసరాలకు ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని తెలిపారు. ఇక అనారోగ్య సమస్యలు ఎదురైతే అప్పులు చేయాల్సిందేనని చెప్పారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు తమ ఇబ్బందులను గుర్తించి ఉద్యోగ భద్రత తోపాటు కనీసవేతం, విధుల సమయం కేటాయించాలని వారు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment