labours problems
-
అగమ్యగోచరంగా ‘భగీరథ’ లైన్మెన్లు.. ఉద్యోగ భద్రత లేక ఆందోళన
కుల్కచర్ల: మిషన్ భగీరథ పథకం అమల్లో ముఖ్య భూమిక వాటర్ లైన్మెన్లదే.. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రజలకు తాగునీటి సరఫరాలో నిమగ్నమవుతారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడినా తక్షణం స్పందిస్తారు. అయితే ఇలాంటి వారికి ఉద్యోగ భద్రత లేకపోవడం ఆందోళన కలిగించే అంశమే.. కనీస వేతనం అమలు కాక కుటుంబ పోషణ కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా గుర్తింపు లేదు కుల్కచర్ల, చౌడాపూర్ మండలాల్లో మిషన్ భగీరథ పథకం కింద 25మంది వాటర్ లైన్మెన్లు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 260మంది పనిచేస్తున్నారు. వీరు లేబర్ కాంట్రాక్టర్లకు అనుబంధంగా తాత్కాలిక పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. సంవత్సరాల తరబడి పని చేస్తున్నా సరైన గుర్తింపు లేదని ఆవేదనకు గురవుతున్నారు. ఉద్యోగ భద్రత లేక తమ పరిస్థితి గాలిలో దీపంలా మారిందని వాపోతున్నారు. విధి నిర్వహణలో తమకు ఒక సమయం అంటూ లేదని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు.. ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి పోవాల్సి వస్తోందని తెలిపారు. నామమాత్రపు జీతాలు మిషన్ భగీరథ లైన్మెన్లను లేబర్ కంపెనీల ఆధ్వర్యంలో నియమించారు. దీంతో వారికి ఎలాంటి అలవెన్స్ అందడం లేదు. విధి నిర్వహణకు ఒక సమయమంటూ లేకుండా పోయింది. సంబంధిత కాంట్రాక్టర్‌కు నచ్చితే ఉద్యోగం.. లేకుంటే మరో పని వెతుక్కోవాల్సిందేనని ఆవేదన చెందుతున్నారు. ఒక్కో లైన్మెన్కు నెలకు రూ. 9వేలు జీతం చెల్లిస్తున్నారు. ఈ డబ్బు తమ ఖర్చులు, ఇంటి అవసరాలకు మాత్రమే సరిపోతోందని, పిల్లల చదువులు, భవిష్యత్ అవసరాలకు ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని తెలిపారు. ఇక అనారోగ్య సమస్యలు ఎదురైతే అప్పులు చేయాల్సిందేనని చెప్పారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు తమ ఇబ్బందులను గుర్తించి ఉద్యోగ భద్రత తోపాటు కనీసవేతం, విధుల సమయం కేటాయించాలని వారు కోరుతున్నారు. -
జీతాల కోసం రోడ్డెక్కిన కేశినేని ట్రావెల్స్ కార్మికులు
సాక్షి, విజయవాడ : కొంత కాలంగా కేశినేని ట్రావెల్స్ యాజమాన్యం కార్మికులకు జీతాలు చెల్లించడం లేదని కార్మికులు లెనిన్ సెంటర్లో నిరసన చేపట్టారు. కార్మికులకు ఎగవేసిన జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి దోనెపూడి శంకర్ మాట్లాడుతూ.. మూడు సంవత్సరాల నుంచి కేశినేని ట్రావెల్స్ బాధితులు లేబర్ కోర్టులో పోరాడుతుంటే, అధికారం అడ్డం పెట్టుకొని లేబర్ ఆఫీసర్‌ను సైతం తమ వైపు తిప్పుకున్నారని విమర్శించారు. కార్మికులక చెల్లించాల్సిన ఎనిమిది నెలల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 600 కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఎన్నికల అఫిడవిట్లో సైతం కార్మికులకు జీతాలు చెల్లించాలని పేర్కొన్నారని స్పష్టం చేశారు. కేశినేని ట్రావెల్స్ బాధితుడు రంగారావు మాట్లాడుతూ.. బకాయి పడిన జీతాల కోసం మూడు సంవత్సరాలుగా తిరుగుతూనే ఉన్నామని, కోర్టును ఆశ్రయించిన సత్వర న్యాయం జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులో కేసు విచారణలో ఉన్నప్పటికీ నాని మనుషులు బెదిరిస్తున్నారని, కొంతమంది కార్మికులను సైతం భయపెట్టి, దాడులు చేసి తమ వైపు తిప్పుకున్నారన్నారని ఆందోళన చెందుతున్నారు. సంవత్సరాల తరబడి పనిచేస్తున్నా, ఇచ్చింది తీసుకోవలని తమ కార్యకర్తలతో కొట్టించారన్నారు. ఒక్కో కార్మికుడికి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు జీతాలు రావాల్సి ఉందని, పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎంపీ హోదాలో ఉండి కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. -
వలస కూలీలకూ..హక్కులు
మహబూబ్‌నగర్ : ఉన్న ఊర్లో సరైన పనులు దొరకక.. ఉపాధి వేటలో పలువురు గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారు. అయితే, అక్కడి చట్టాలపై అవగాహన లేక, కంపెనీ యాజమాన్యాల మోసాలతో దోపిడీకి గురవుతున్నారు. స్వదేశానికి రాలేక.. అక్కడ బతకలేక నానా అగచాట్లు పడుతున్నారు. కొందరు ఎడారి దేశాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. గల్ఫ్‌కు వెళ్లే వారికి అవగాహన కల్పించడంతో పాటు ఆ దేశాల్లోని కార్మికులకు న్యాయం జరిగేలా పోరాడుతోంది ‘మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్’. ఈ సంస్థ అధ్యక్షుడు, మహబూబ్‌నగర్‌కు చెందిన పి.నారాయణస్వామి తమ కౌన్సిల్ తరఫున చేస్తున్న ప్రయత్నాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.... ఉపాధి కోసం గల్ఫ్ దేశాల్లో పనిచేయడానికి వెళ్లిన కొందరు భారతీయుల బతుకులు దుర్భరంగా ఉంటున్నాయి. డబ్బు బాగా సం పాదించాలనే ఆశతో చాలా మంది గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. కానీ, అది అంత సులువు కాదు. గల్ఫ్ దేశాలైన కువైట్, యూఏఈ, సౌదీ, ఖతార్, బహ్రెయిన్, ఒమన్ దేశాల్లో పనులు చేయడానికి వెళ్లే వారిలో తెలంగాణతోపాటు కేరళ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నారు. ఇటీవలి కాలంలో బిహార్, ఉత్తరప్రదేశ్ వారు ఎక్కువగా వెళ్తున్నారు. గల్ఫ్‌లో నిర్మాణ రంగం, పెట్రోల్ పంపుల్లో ఎక్కువగా భారతీయులే ఉంటారు. మొదటగా అక్కడికి వెళ్లగానే కంపెనీ యాజమాన్యం పాస్‌పోర్టు తీసేసుకుంటుంది. పాస్‌పోర్టు లేకపోతే ఏమీ చేయలేము. పాస్ పోర్టు గడువు తీరడం లేదా పోగొట్టుకుని అక్కడే ఉంటే ఖల్లివెళ్లి(చట్టవ్యతిరేకంగా నివాసం) వల్ల జైళ్లలో వేస్తున్నారు. పాస్‌పోర్టు లేకపోవడంతో ఏళ్లు గడుస్తున్నా ఇండియాకు రాలేకపోతున్నారు. షార్జాలోని రోలా ప్రాంతంలో దాదాపు 10 సంవత్సరాలుగా ఉన్న వారు వందల సంఖ్యలో కనిపిస్తారు. స్పందించని ప్రభుత్వాలు.. చట్టవ్యతిరేకంగా నివసించే వారిని పంపించడం కోసం అక్కడి ప్రభుత్వాలు తరచుగా ఆమ్నెస్టీ (క్షమాబిక్ష) ప్రకటిస్తుంటాయి. అయితే అమ్నెస్టీ సందర్భంగా భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం స్పందించడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే భారత ప్రభుత్వానికి విదేశీ కార్మికుల పాలసీయే లేదు. హోంశాఖ, విదేశాంగ శాఖల మధ్య సమన్వయం లేదు. ఇతర దేశాల్లో మన పౌరులకు కలిగే ఇబ్బందుల విషయంలో భారత ఎంబసీలు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇలా ంటి నేపథ్యంలో ‘మైగ్రేంట్స్ రైట్స్ కౌన్సిల్’ తరఫున మానవహక్కుల కమిషన్, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పిటీషన్లు వేశాం. మా కౌన్సిల్ తరఫున చేసే పోరాటం వల్ల కాస్తలో కాస్తయినా ఆమ్నెస్టీ ద్వారా మన దేశస్తులను తీసుకురాగలుగుతున్నాం. ఖైదీలబదిలీ ఒప్పందాలు అమలు కావడం లేదు.. తెలిసీ, తెలియక చేసిన చిన్న తప్పులకు తోడు పాస్‌పోర్టు లేకపోవడం తదితర కారణాల వల్ల వేలాది మంది జైళ్లలో మగ్గుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 72 దేశాల్లో 6,290 మంది భారతీయులు ఖైదీలుగా మగ్గుతున్నట్లు పార్లమెంట్లో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్రం వెల్లడించింది. వీటిలో ఒక్క గల్ఫ్ దేశాల్లోనే 2,909 మంది ఉన్నారు. అత్యధికంగా సౌదీలో 1,508, యూఏఈలో 785, కువైట్‌లో 290, బహ్రెయిన్‌లో 106, ఖతార్‌లో 96, ఒమన్‌లో 75 మంది ఖైదీలు జైళ్లలో మగ్గుతున్నారు. అయితే భారత్, యూఏఈ, ఖతార్ దేశాల మధ్య ఖైదీల బదిలీ ఒప్పందం కుదిరింది. అంటే అక్కడ జైళ్లలో ఉన్న ఖైదీలు ఇక్కడి జైళ్లలో శిక్ష అనుభవించవచ్చు. అయితే ఇంత వరకు ఆ దిశగా ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవడం లేదు. సిరిసిల్ల జిల్లావారిది అదే పరిస్థితి... నేపాల్ దేశస్తుడి మృతికేసులో నిందితులకు దుబాయ్ న్యాయస్థానం శిక్ష విధించింది. శిక్ష పడిన వారిలో ఐదుగురు సిరిసిల్ల జిల్లాకు చెందిన వారు ఉన్నారు. షరియత్ లా ప్రకారం ‘బ్లడ్‌మనీ’ (దియా) అంటే చనిపోయిన వారి కుటుంబీకులకు పరిహారం చెల్లించే ప్రక్రియ. దుబాయి జైల్లో మగ్గుతున్న వారి విడుదల కోసం ’బ్లడ్ మనీ’ పరిహారాన్ని సిహెచ్.రాజశేఖర్ అనే దాత ఇచ్చిన రూ.15 లక్షల చెక్కును 2013 మే 24న నేపాల్‌లోని ఇండియన్ ఎంబసీ వద్ద మృతుని భార్యకు అప్పటి ఎమ్మెల్యే కేటీఆర్ అందజేశారు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఆ కేసు ఫాలోఅప్ లేక ఆ ఐదుగురు జైలు నుంచి విడుదల కావడం లేదు. మా వల్లే సాధ్యమైంది ప్రతీ ఏటా కేంద్రం ప్రవాస భారత దివస్ (పీబీడీ) నిర్వహిస్తుంది. జాతిపిత మçహాత్మా గాంధీ సౌతా ఫ్రికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన రోజును పురస్కరించుకుని జనవరి 7, 8, 9 తేదీల్లో పీబీడీ నిర్వహిస్తుంది. అయితే ఆ సమావేశాల్లో కేవలం వివిధ దేశా ల్లో బాగా స్థిరపడిన వారి అంశాలు మాత్రమే చర్చకు వచ్చేవి. మా కౌన్సిల్ మొదటిసారిగా ఈ సమావేశాల్లో వలస కూలీల అంశాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చింది. 2014లో హైకోర్టులో పిల్ వేయడం కారణంగా గల్ఫ్ లేబర్ గురించి సెషన్ నిర్వహించారు. ఇటీవలి కాలంలో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక పీబీడీ సమావేశాలకు రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తోంది. 2017లో బెంగళూరులో జరిగిన సమావేశంలో కూడా గల్ఫ్ సమస్యలను ప్రస్తావనకు తీసుకొచ్చాం. నిత్యం పది మరణాలు... గల్ఫ్ దేశాల్లో అనేక కారణాల వల్ల భారతదేశానికి చెందిన వారు రోజుకు పది మంది చనిపోతున్నారు. మృతదేహాలను తరలించడంలో అక్కడి చట్టాల ప్రకారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఖల్లివెళ్లి(చట్టవ్యతిరేకంగా నివసించే) వారి మృతదేహాలు తీసుకు రావడం చాలా కష్టతరం. అలాంటి వారి మృ తదేహాలను తీసుకురావడానికి కనీసం 45 రోజుల నుంచి రెండు నెలల సమయం పడుతుంది. ఒక వేళ యజమాని దగ్గర లీగల్‌గా పనిచేస్తూ చనిపోయినట్లయితే పది రోజుల వ్య వధిలో సదరు యాజమాన్యం పంపిస్తుంది. కనీస అవగాహన ఉండడం లేదు.. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే వారిలో చాలా మందికి అక్కడి చట్టాలపై కనీస అవగాహన ఉండడం లేదు. దుబాయి వెళ్తున్నాం... అంటారే తప్ప ఏజెంట్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏ పనిచేయిస్తున్నారనే విషయం వాళ్లకు ఏ మాత్రం తెలియదు. గల్ఫ్ దేశాల్లో నిషేధిత వస్తువులపై అవగాహన అవసరం. అక్కడ గసగసాలు కూడా నిషేధం. గసగసాలు కలిగి ఉండడాన్ని కూడా అక్కడి చట్టాల ప్రకారం మాదకద్రవ్యాలుగా భావిస్తారు. ఎవరైనా వాడితే జైలులో వేస్తారు. అలాగే పెనడాల్ ట్యాబ్లెట్(నొప్పుల నివారణ కోసం) లను వాడితే చట్ట ప్రకారం శిక్షకు గురవుతారు. కనుక ఇలాంటి అంశాలపై ఏ మాత్రం అవగాహన లేకుండా గల్ఫ్ దేశాలకు వెళ్తుండడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. -
పొట్ట నింపని ‘ఉపాధి’
- పనులు చేసినా గిట్టుబాటుకాని కూలి – సగటు వేతనం రూ.116 మాత్రమే – ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి.. – కొన్ని చోట్ల రోజు కూలి రూ.50 లోపే! – వలసలే శరణ్యమంటున్న కూలీలు అనంతపురం టౌన్ : కరువు కోరల్లో చిక్కుకున్న ‘అనంత’లో కూలీలకు ఆసరాగా నిలవాల్సిన ఉపాధి హామీ పథకం వారి కడుపు మాడుస్తోంది. మండే ఎండల్లో.. కాలే కడుపులతో పనులు చేయాల్సిన దారుణ పరిస్థితి ఉంది. గట్టిపడిన నేలలో చేతులు బొబ్బలు ఎక్కేలా పని చేస్తున్నా గిట్టుబాటు కూలి అందడం లేదు. ప్రభుత్వం కనీస వేతనం రూ.194 ఇస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. కొందరు కూలీలకు వారం రోజులు పని చేసినా రూ.500 కూడా రావడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం 30 శాతం అలవెన్స్‌గా ఇస్తున్నా కూలీల జీవనోపాధి కష్టంగా మారుతోంది. అందువల్లే వలసలు అనివార్యంగా మారాయి. జిల్లాలో 7,77,830 జాబ్‌కార్డులు జారీ చేశారు. 48,243 శ్రమశక్తి సంఘాల్లో 7,68,709 మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రోజుకు 2 లక్షల మంది వరకు ఉపాధి పనులకు వెళ్తున్నారు. అయితే కూలి మాత్రం గిట్టుబాటు కావడం లేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు 3.13 లక్షల మందికి ఉపాధి కల్పించారు. మామూలు రోజుల్లో చేసినట్లుగా వేసవిలో ఉపాధి పనులను కూలీలు చేయలేరు. ఎండవేడిమికి కూలి గిట్టుబాటు కాక పూటగడవని పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం వేసవిలో అదనపు కూలిని ముందుగానే ప్రకటించింది. ఉపాధి కింద రోజువారీ వేతనం రూ.194 ఉండగా అదనపు కూలి కింద ఈ ఏడాది ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్/మే నెలల్లో 30 శాతం అందించారు. ఇక జూన్‌లో 20 శాతం అందించనున్నారు. అంటే ఒక్క రోజు కూలి కింద రూ. 235 నుంచి రూ.280 వరకు రావాల్సి ఉంది. అయితే చాలా గ్రామాల్లో గిట్టుబాటు కూలి అందడం లేదు. గుమ్మఘట్ట మండలం కలుగోడులో ఈనెల 1వ తేదీ(గురువారం) ఏకంగా ఉపాధి పనులనే బహిష్కరించారు. ఇక్కడ సగటున రోజు కూలి రూ.50లోపే వస్తోంది. ఉపాధి హామీ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చూసుకున్నా సగటు వేతనం రూ.116 మాత్రమే ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉపాధి పనులకు కోసం వలస బాట పట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే కదిరి, పుట్టపర్తి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, హిందూపురం, గుంతకల్లు, తాడిపత్రి తదితర నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున బెంగళూరు, తమిళనాడు, తెలంగాణకు వలస వెళ్లారు. గత ఏడాది అధికారులు కేవలం సేద్యపు కుంటలతోనే నెట్టుకు వచ్చారు. ఈ ఏడాది ఇతర పనులు కూడా కల్పిస్తామని చెబుతున్నా కూలి గిట్టుబాటు కావడం లేదు. ప్రధానంగా క్షేత్రస్థాయిలో కొలతల విషయంలో అధికారుల నిర్లక్ష్యం కూడా ఉన్నట్లు కూలీలు ఆరోపిస్తున్నారు. ఉపాధి వేతనం సగటు ఇలా.. ఏడాది సరాసరి వేతనం 2010–11 రూ.102.24 2011–12 రూ.106.43 2012–13 రూ.118.42 2013–14 రూ.118.72 2014–15 రూ.130.89 2015–16 రూ.139.42 2016–17 రూ.158.26 ఆరు రోజులు చేస్తే రూ.280 ఎంపీటీసీ సభ్యురాలిగా ఉన్నా... అందరితో కలిసి ఉపాధి పనులకు వెళ్తున్నా. చాలా మంది కూలీలు ఆరు రోజులు పనులు చేస్తే రూ.260 నుంచి రూ.280లోపే పడింది. రోజుకు సగటున రూ.50 లోపు కూలి వస్తే ఎలా బతకాలి? ప్రభుత్వం చెప్పేదొకటి.. ఇక్కడ జరుగుతుందొకటి. ఈ విషయంపై అధికారులతో చర్చించినా ఫలితం లేదు. అందుకే గురువారం (ఈనెల 1న) అందరం కలిసి ఉపాధి పనులను బహిష్కరించాం. గిట్టుబాటు కూలి, మెత్తటి నేలలో పనులిస్తేనే ఉపాధికి వెళ్తాం. - టి.సుకన్య, కలుగోడు ఎంపీటీసీ సభ్యురాలు, గుమ్మఘట్ట మండలం చేతులు బొబ్బలెక్కుతున్నాయ్ డగౌట్ పాండ్స్ పనులు చేస్తున్నాం. పైన ఒక అడుగు వరకు మెత్తగా వచ్చినా ఆ తర్వాత గునపం దింపాలంటే కష్టమే. చేతులు బొబ్బలెక్కుతున్నాయి. పోనీ చేసిన కష్టానికి ప్రతిఫలం ఉంటుందా అంటే అదీ లేదు. ఆరు రోజులకు గాను రూ.300లోపే కూలి పడింది. పేరుకే వేసవి అలవెన్సులు. మా కష్టానికి తగ్గ గిట్టుబాటు కూలి రావడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే పనులకు వెళ్లేది లేదు. వలసలే శరణ్యం. - తిప్పేస్వామి, ఉపాధి కూలీ, కలుగోడు