వలస కూలీలకూ..హక్కులు      | Rights To Immigrant laborers | Sakshi
Sakshi News home page

వలస కూలీలకూ..హక్కులు     

Published Fri, Jul 13 2018 9:32 AM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

Rights To Immigrant laborers - Sakshi

పి.నారాయణస్వామి 

మహబూబ్‌నగర్‌ : ఉన్న ఊర్లో సరైన పనులు దొరకక.. ఉపాధి వేటలో పలువురు గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్తున్నారు. అయితే, అక్కడి చట్టాలపై అవగాహన లేక, కంపెనీ యాజమాన్యాల మోసాలతో దోపిడీకి గురవుతున్నారు. స్వదేశానికి రాలేక.. అక్కడ బతకలేక నానా అగచాట్లు పడుతున్నారు. కొందరు ఎడారి దేశాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు.

గల్ఫ్‌కు వెళ్లే వారికి అవగాహన కల్పించడంతో పాటు ఆ దేశాల్లోని కార్మికులకు న్యాయం జరిగేలా పోరాడుతోంది ‘మైగ్రెంట్స్‌ రైట్స్‌ కౌన్సిల్‌’. ఈ సంస్థ అధ్యక్షుడు, మహబూబ్‌నగర్‌కు చెందిన పి.నారాయణస్వామి తమ కౌన్సిల్‌ తరఫున చేస్తున్న ప్రయత్నాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే....

ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాల్లో పనిచేయడానికి వెళ్లిన కొందరు భారతీయుల బతుకులు దుర్భరంగా ఉంటున్నాయి. డబ్బు బాగా సం పాదించాలనే ఆశతో చాలా మంది గల్ఫ్‌ దేశాలకు వెళ్తున్నారు. కానీ, అది అంత సులువు కాదు. గల్ఫ్‌ దేశాలైన కువైట్, యూఏఈ, సౌదీ, ఖతార్, బహ్రెయిన్, ఒమన్‌ దేశాల్లో పనులు చేయడానికి వెళ్లే వారిలో తెలంగాణతోపాటు కేరళ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నారు.

ఇటీవలి కాలంలో బిహార్, ఉత్తరప్రదేశ్‌ వారు ఎక్కువగా వెళ్తున్నారు. గల్ఫ్‌లో నిర్మాణ రంగం, పెట్రోల్‌ పంపుల్లో ఎక్కువగా భారతీయులే ఉంటారు. మొదటగా అక్కడికి వెళ్లగానే కంపెనీ యాజమాన్యం పాస్‌పోర్టు తీసేసుకుంటుంది. పాస్‌పోర్టు లేకపోతే ఏమీ చేయలేము. పాస్‌ పోర్టు గడువు తీరడం లేదా పోగొట్టుకుని అక్కడే ఉంటే ఖల్లివెళ్లి(చట్టవ్యతిరేకంగా నివాసం) వల్ల జైళ్లలో వేస్తున్నారు. పాస్‌పోర్టు లేకపోవడంతో ఏళ్లు గడుస్తున్నా ఇండియాకు రాలేకపోతున్నారు. షార్జాలోని రోలా ప్రాంతంలో దాదాపు 10 సంవత్సరాలుగా  ఉన్న వారు వందల సంఖ్యలో కనిపిస్తారు. 

స్పందించని ప్రభుత్వాలు.. 

చట్టవ్యతిరేకంగా నివసించే వారిని పంపించడం కోసం అక్కడి ప్రభుత్వాలు తరచుగా ఆమ్నెస్టీ (క్షమాబిక్ష) ప్రకటిస్తుంటాయి. అయితే అమ్నెస్టీ సందర్భంగా భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం స్పందించడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే భారత ప్రభుత్వానికి విదేశీ కార్మికుల పాలసీయే లేదు.

హోంశాఖ, విదేశాంగ శాఖల మధ్య సమన్వయం లేదు. ఇతర దేశాల్లో మన పౌరులకు కలిగే ఇబ్బందుల విషయంలో భారత ఎంబసీలు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇలా ంటి నేపథ్యంలో ‘మైగ్రేంట్స్‌ రైట్స్‌ కౌన్సిల్‌’ తరఫున మానవహక్కుల కమిషన్, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పిటీషన్లు వేశాం. మా కౌన్సిల్‌ తరఫున చేసే పోరాటం వల్ల కాస్తలో కాస్తయినా ఆమ్నెస్టీ ద్వారా మన దేశస్తులను తీసుకురాగలుగుతున్నాం.   

ఖైదీలబదిలీ ఒప్పందాలు అమలు కావడం లేదు.. 

తెలిసీ, తెలియక చేసిన చిన్న తప్పులకు తోడు పాస్‌పోర్టు లేకపోవడం తదితర కారణాల వల్ల వేలాది మంది జైళ్లలో మగ్గుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 72 దేశాల్లో 6,290 మంది భారతీయులు ఖైదీలుగా మగ్గుతున్నట్లు పార్లమెంట్‌లో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్రం వెల్లడించింది. వీటిలో ఒక్క గల్ఫ్‌ దేశాల్లోనే 2,909 మంది ఉన్నారు.

అత్యధికంగా సౌదీలో 1,508, యూఏఈలో 785, కువైట్‌లో 290, బహ్రెయిన్‌లో 106, ఖతార్‌లో 96, ఒమన్‌లో 75 మంది ఖైదీలు జైళ్లలో మగ్గుతున్నారు. అయితే భారత్, యూఏఈ, ఖతార్‌ దేశాల మధ్య ఖైదీల బదిలీ ఒప్పందం కుదిరింది. అంటే అక్కడ జైళ్లలో ఉన్న ఖైదీలు ఇక్కడి జైళ్లలో శిక్ష అనుభవించవచ్చు. అయితే ఇంత వరకు ఆ దిశగా ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవడం లేదు.  

సిరిసిల్ల జిల్లావారిది అదే పరిస్థితి... 

నేపాల్‌ దేశస్తుడి మృతికేసులో నిందితులకు దుబాయ్‌ న్యాయస్థానం శిక్ష విధించింది. శిక్ష పడిన వారిలో ఐదుగురు సిరిసిల్ల జిల్లాకు చెందిన వారు ఉన్నారు. షరియత్‌ లా ప్రకారం ‘బ్లడ్‌మనీ’ (దియా) అంటే చనిపోయిన వారి కుటుంబీకులకు పరిహారం చెల్లించే ప్రక్రియ. దుబాయి జైల్లో మగ్గుతున్న వారి విడుదల కోసం ’బ్లడ్‌ మనీ’  పరిహారాన్ని సిహెచ్‌.రాజశేఖర్‌ అనే దాత ఇచ్చిన రూ.15 లక్షల చెక్కును 2013 మే 24న నేపాల్‌లోని ఇండియన్‌ ఎంబసీ వద్ద మృతుని భార్యకు అప్పటి ఎమ్మెల్యే కేటీఆర్‌ అందజేశారు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఆ కేసు ఫాలోఅప్‌ లేక ఆ ఐదుగురు జైలు నుంచి విడుదల కావడం లేదు. 

మా వల్లే సాధ్యమైంది 

ప్రతీ ఏటా కేంద్రం ప్రవాస భారత దివస్‌ (పీబీడీ) నిర్వహిస్తుంది. జాతిపిత మçహాత్మా గాంధీ సౌతా ఫ్రికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన రోజును పురస్కరించుకుని జనవరి 7, 8, 9 తేదీల్లో పీబీడీ నిర్వహిస్తుంది. అయితే ఆ సమావేశాల్లో కేవలం వివిధ దేశా ల్లో బాగా స్థిరపడిన వారి అంశాలు మాత్రమే చర్చకు వచ్చేవి. మా కౌన్సిల్‌  మొదటిసారిగా ఈ సమావేశాల్లో వలస కూలీల అంశాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చింది.

2014లో హైకోర్టులో పిల్‌ వేయడం కారణంగా గల్ఫ్‌ లేబర్‌ గురించి సెషన్‌ నిర్వహించారు. ఇటీవలి కాలంలో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక పీబీడీ సమావేశాలకు రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తోంది. 2017లో బెంగళూరులో జరిగిన సమావేశంలో కూడా గల్ఫ్‌ సమస్యలను ప్రస్తావనకు తీసుకొచ్చాం.

నిత్యం పది మరణాలు... 

గల్ఫ్‌ దేశాల్లో అనేక కారణాల వల్ల భారతదేశానికి చెందిన వారు రోజుకు పది మంది చనిపోతున్నారు. మృతదేహాలను తరలించడంలో అక్కడి చట్టాల ప్రకారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఖల్లివెళ్లి(చట్టవ్యతిరేకంగా నివసించే) వారి మృతదేహాలు తీసుకు రావడం చాలా కష్టతరం. అలాంటి వారి మృ తదేహాలను తీసుకురావడానికి కనీసం 45 రోజుల నుంచి రెండు నెలల సమయం పడుతుంది.

ఒక వేళ యజమాని దగ్గర లీగల్‌గా పనిచేస్తూ చనిపోయినట్లయితే పది రోజుల వ్య వధిలో సదరు యాజమాన్యం పంపిస్తుంది. కనీస అవగాహన ఉండడం లేదు.. 
ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లే వారిలో చాలా మందికి అక్కడి చట్టాలపై కనీస అవగాహన ఉండడం లేదు. దుబాయి వెళ్తున్నాం... అంటారే తప్ప ఏజెంట్‌ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏ పనిచేయిస్తున్నారనే విషయం వాళ్లకు ఏ మాత్రం తెలియదు.

గల్ఫ్‌ దేశాల్లో నిషేధిత వస్తువులపై అవగాహన అవసరం. అక్కడ గసగసాలు కూడా నిషేధం. గసగసాలు కలిగి ఉండడాన్ని కూడా అక్కడి చట్టాల ప్రకారం మాదకద్రవ్యాలుగా భావిస్తారు. ఎవరైనా వాడితే జైలులో వేస్తారు. అలాగే పెనడాల్‌ ట్యాబ్లెట్‌(నొప్పుల నివారణ కోసం) లను వాడితే చట్ట ప్రకారం శిక్షకు గురవుతారు. కనుక ఇలాంటి అంశాలపై ఏ మాత్రం అవగాహన లేకుండా గల్ఫ్‌ దేశాలకు వెళ్తుండడంతో ఇబ్బందులకు గురవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement