న్యూస్‌లైన్, కామారెడ్డి : గల్ఫ్‌కు వెళ్లిన వారిలో చాలా మంది ఒత్తిళ్లకు లోనవుతున్నారు. పని ఒత్తిడి, అప్పుల కుంపటి వారి ని వేదనకు గురి చేస్తున్నాయి. కొన్ని కంపెనీల్లో అడ్డగోలు పనులు చేయించుకునే యాజమాన్యాలు.. సరై న వేతనాలు ఇవ్వకపోవడం, వేతనాన్ని సక్రమంగా చెల్లించకపోవడంతో వలస జీవులు ఆర్థికంగా సతమతమవుతున్నారు. అప్పులు తీరకముందే ఇంటికి వెళితే అప్పులవాళ్లకు ఏమని సమాధానం చెప్పేదని మనోవ్యథకు గురవుతున్నారు.
దీనికి తోడు కుటుం బానికి దూరంగా ఉండాల్సి రావడంతో ఒత్తిడి తీవ్ర మై అనారోగ్యం పాలవుతున్నారు. వైద్యం చేయించుకునేందుకు చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. పలువురు మృత్యువాత పడుతున్నారు. ఉపాధి కోసం వలస వెళ్లి విదేశాల్లో గతేడాది 50 మందికిపైగా మరణించారు. వీరిలో ఎక్కువ మంది గుండెపోటుతోనో.. అనారోగ్యంతోనో మృత్యువాతపడ్డారని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఇంకొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మరణవార్త చేరిన తర్వాత కడసారి చూపుకోసం అయినవారు నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. వారు మరోవైపు అప్పులు ఇచ్చినవారి నుంచి వేధింపులను ఎదుర్కోవాల్సిన దుస్థితి. దీంతో వారూ నలిగిపోతున్నారు.
2013లో అనారోగ్యంతో విదేశాల్లో మరణించిన వారి వివరాలు..
మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లెకు చెందిన మహబూబ్(33) జనవరి 19న గుండెపోటుతో సౌదీలో మరణించారు.
భీమ్‌గల్‌కు చెందిన గంగాధర్(50) జనవరి 24న దుబాయిలో గుండెపోటుతో మృతి చెందారు.
నిజామాబాద్ మండలం తిర్మన్‌పల్లికి చెందిన ఇస్మాయిల్ ఫిబ్రవరి 1న గుండెపోటుతో ఒమన్‌లో మరణించారు.
కమ్మర్‌పల్లి మండలం చౌటుప్పల్‌కు చెందిన సుభాష్ అనారోగ్యంతో ఫిబ్రవరి 9 బహ్రెయిన్‌లో మరణించారు.
కామారెడ్డి మండలం కొటాల్‌పల్లికి చెందిన సిద్దరాములు గుండెపోటుతో సౌదీలో మరణించారు. ఆయన మృతదేహం నెలరోజుల తర్వాత ఫిబ్రవరి 14న స్వగ్రామం చేరింది.
జక్రాన్‌పల్లి మండలం పడకల్‌కు చెందిన ఈర్ల లింగన్న(45) మార్చి 8న గుండెపోటుతో దుబాయిలో మరణించారు.
దోమకొండకు చెందిన దాసరి సిద్దరాములు (41) మార్చి 16న అనారోగ్యంతో దుబాయిలో మరణించారు.
బాల్కొండ మండలం రెంజర్లకు చెందిన శ్రీనివాస్(35) ఏప్రిల్ 18న గుండెపోటుతో దుబాయిలో మరణించారు.
కమ్మర్‌పల్లికి చెందిన గంగాధర్(45) జూన్ 21న దుబాయిలో గుండెపోటుతో మరణించారు. నవీపేట మండలం బినోలాకు చెందిన ఒడ్డెన్న(45) సౌదీలో గుండెపోటుతో మరణించారు. ఆయన మృతదేహం మూడు నెలల తర్వాత జూలై 3వ తేదీన స్వగ్రామానికి చేరింది.
ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్‌కు చెందిన తిరుపతి(45) జూలై 7న సౌదీలో గుండెపోటుతో మరణించారు.
నందిపేట మండలం మారంపల్లికి చెందిన పెద్ద సాయాగౌడ్(50) దుబాయిలో అనారోగ్యానికి గురై జూలై 11 మరణించారు.
కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లికి చెందిన రాజన్న (50) దుబాయిలో గుండెపోటుకు గురై జూలై 13న మరణించారు.
వేల్పూర్‌కు చెందిన నాగేశ్(38) జూలై 29 దుబాయిలో అనారోగ్యంతో మరణించారు. ఆయన మృతదేహం ఐదు నెలల తర్వాత స్వగ్రామం చేరింది.
ఆర్మూర్‌కు చెందిన శ్రీనివాస్(35) ఆగస్టులో అబుదాబీలో గుండెపోటుకు గురై మరణించారు.
డిచ్‌పల్లి మండలం నడిమితండాకు చెందిన బంతిలాల్(40) సౌదీలో అనారోగ్యంతో ఆగస్టు 10 న మరణించారు.
భిక్కనూరు మండలం రాజంపేటకు చెందిన రాజయ్య(45) ఆగస్టు 20 దుబాయిలో గుండెపోటుతో మరణించారు.
నిజామాబాద్‌కు చెందిన తసిప్(30) సెప్టెంబర్ 4న గుండెపోటుతో సౌదీలో మరణించారు.
వేల్పూర్ మండలం జాన్కంపేటకు చెందిన శ్రీనివాస్ సెప్టెంబర్ 15 న సౌదీలో అనారోగ్యంతో మరణించారు.
ధర్పల్లి మండలం ఎల్లారెడ్డిపల్లికి చెందిన బాలగంగాధర్ అనారోగ్యంతో సెప్టెంబర్ 22న ఖతార్‌లో మరణించారు.
నందిపేట మండలం కుద్వాన్‌పూర్‌కు చెందిన పోశెట్టి(46) అక్టోబర్ 21న గుండెపోటుతో సౌదీలో మరణించారు.
డిచ్‌పల్లి మండలం ఇందల్వాయికి చెందిన గొల్ల రాములు(38) నవంబర్ 9 న కువైట్‌లో గుండెపోటుతో మరణించారు.
మాక్లూర్ మండలం గుంజిలికి చెందిన మోనాజీ(36) నవంబర్ 11న అనారోగ్యంతో దుబాయిలో మరణించారు.
నవీపేట మండలం పాత కమలాపూర్‌కు చెందిన రమేశ్(28) నవంబర్ 18న గుండెపోటుతో దుబాయిలో మరణించారు. కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేని రమేశ్ తల్లి లక్ష్మి గుండెపగిలి మరణించింది.
నిజామాబాద్ మండలం గుండారం గ్రామానికి చెందిన అలీముద్దీన్(50) నవంబర్‌లో గుండెపోటుతో రియాద్‌లో మరణించారు.
సిరికొండ మండలంలోని తాళ్లరామడుగుకు చెందిన రాములు(40) నవంబర్ 19న గుండెపోటుతో దుబాయిలో మరణించారు.
బాల్కొండ మండలం బోదెపల్లికి చెందిన సయ్యద్ జైలాని(24) నవంబర్ 25న అబుదాబిలో అనుమానాస్పద స్థితిలో మరణించారు.
కమ్మర్‌పల్లి మండలంలోని హాసాకొత్తూర్‌కు చెందిన శ్రీనివాస్(44) అనారోగ్యంతో సౌదీలో మరణించారు. ఆయన మృతదేహం మూడు నెలల తర్వాత డిసెంబర్ 3న స్వగ్రామం చేరింది.
గాంధారి మండలం ముదెల్లికి చెందిన లక్ష్మయ్య(45) డిసెంబర్ 4 న షార్జాలో మరణించారు. మృతికిగల కారణాలు తెలియరాలేదు.
జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్‌కు చెందిన బాలు(55) డిసెంబర్ 17న దుబాయిలో గుండెపోటుతో మరణించారు.
వేల్పూర్‌కు చెందిన హన్మండ్లు (50) మే 18న గుండెపోటుతో దుబాయిలో మరణించారు. వారం రోజుల తర్వాత ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.
కుమిలి కుమిలి.. గుండె పగిలి..
Published Sun, Jan 26 2014 2:50 AM | Last Updated on Mon, Oct 8 2018 4:59 PM
Advertisement
Advertisement