కామారెడ్డి, న్యూస్‌లైన్: గల్ఫ్ దేశాలకు వెళ్లి వచ్చిన వారిని కష్టాలు వెన్నాడుతూనే ఉన్నాయి. ఉన్న ఊరిలో ఉపాధి కరువై ఆస్తులను అమ్ముకుని, ఆపై అప్పులు చేసి ఏజెంట్ల చేతిలో పెట్టి మోసపోయిన వారు కొందరైతే, గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్క సరైన వేతనాలు అందక ఆర్థికంగా చితికిపోయివారు, అక్కడి పాలకులు 2007లో విధించిన ఆంక్షలతో ఇళ్లకు చేరిన వారు ఇప్పుడు బతుకుదెరువు కోసం అవస్థలు పడుతున్నారు. ఒక్క కామారెడ్డి ప్రాంతం నుంచే 25 వేల మందికిపైగా గల్ఫ్ దేశాలకు వెళ్లివచ్చారు. తొలినాళ్లలో గల్ఫ్‌కు వెళ్లినవారు అంతోఇంతో సంపాదించుకోగా, తర్వాత విజిట్ వీజాలపై వెళ్లిన వారు అనేక కష్టాలకు గురయ్యారు. ఈ ప్రాంతానికి చెందినవారు 125 మంది వరకు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అలాగే గల్ఫ్‌లో ప్రమాదాలు, ఇతర సంఘటనలో 2 వందల మంది వరకు మృత్యువాత పడ్డారు. గల్ఫ్ దేశాల్లో ఔట్ విధించిన తర్వాత వేలాది మంది తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. వెళ్లడానికి చేసిన అప్పులు తీరకముందే ఇంటిముఖం పట్టిన వారు అనేక కష్టాలకు గురయ్యారు. గల్ఫ్ బాధితులకు ఉపాధి చూపేందుకు చర్యలు తీసుకుంటామని పాలకులు ప్రకటించినా, వారికి ఎలాంటి బతుకుబాట చూపలేకపోయారు. ప్రతిసారి బాధితులు తమను ఆదుకోవాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా లాభం లేకుండా పోయింది.
రోడ్డునపడ్డ కుటుంబాలు..
గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ చనిపోయిన వారితో పాటు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఆత్మహత్యలు చేసుకున్న గల్ఫ్ బాధితుల కుటుంబాల గురించి పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ఆ కుటుంబాల కన్నీటిని తుడిచేవారు లేకుండాపోయారు. జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడివారి సంఖ్య 3 వందలకు పైగానే ఉంది. ఆ కుటుంబాలు అప్పులు తీర్చలేక, బతుకు బండి సాగించలేక నానా అవస్థలు పడుతున్నారు. గల్ఫ్ బాధితులను ఆదుకుంటామని చెప్పినవారే తప్ప ఆ కుటుంబాలకు ప్రభుత్వపరంగా ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందలేదు.
బాధితులకు తప్పని ఉపాధి వేట..
గల్ఫ్ బాధితులకు ఉపాధివేట తప్పడం లేదు. చాలా మంది ఉన్న భూములు, ఆస్తులను అమ్ముకున్నారు. కొందరు అడ్డగోలు వడ్డీలపై అప్పులు తీసుకుని వెళ్లారు. అలాంటి వారంతా ఇప్పుడు అప్పులు తీర్చేదారి కానరాక, బతుకు దెరువు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కొందరైతే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెదుక్కుందామన్న దోరణితో తిరిగి గల్ఫ్ దేశాలకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ బతుకుదామంటే పని దొరకక, ఏదైనా దందా చేద్దామంటే పెట్టుబడి లభించక ఇబ్బందులు పడుతున్నారు.
నేడు బాధితుల సింహగర్జన..
గల్ఫ్ బాధితుల సమస్యలపై ప్రభుత్వాల కళ్లు తెరిపించేందుకు గల్ఫ్ బాధితులంతా కలిసి కామారెడ్డిలో శుక్రవారం సభ ఏర్పాటు చేశారు.స్థానిక సత్యగార్డెన్స్‌లో ఈ సభ జరగనుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావుతో పాటు స్వదేశీ జాగరణ్ మంచ్ నేత కోటపాటి నర్సింహనాయుడు తదితరులు సభకు హాజరుకానున్నారు.
గల్ఫ్ గాయానికి మందేదీ!
Published Fri, Jan 10 2014 4:33 AM | Last Updated on Sat, Aug 25 2018 5:17 PM
Advertisement