పాసుపుస్తకాలు ఇవ్వాలని కామారెడ్డి జాయింట్ కలెక్టర్‌ను కోరుతున్న అన్నాసాగర్ గ్రామానికి చెందిన గల్ఫ్ కుటుంబాలు (ఫైల్)
కామారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న పథకాలు విదేశాలకు వెళ్లిన వలస జీవులకు దక్కడం లేదు. పథకాలు అందక ముఖ్యంగా గల్ఫ్‌కు వెళ్లిన వలసకార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టిన రైతులందరికీ కొత్త పాసుపుస్తకాలు అందించింది. అంతేగాక రైతుబంధు కార్యక్రమం ద్వారా ఎకరాకు పంటకు రూ.4 వేల చొప్పున పెట్టుబడిసాయం అందించింది.
వీటికితోడు ప్రతీ రైతుకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తోంది. అయితే ఇవేవీ వలస జీవులకు అందడం లేదు. ఇదేమంటే భూ యజమాని నేరుగా వచ్చి తమ పేరిట ఉన్న పాసుపుస్తకాన్ని, రైతుబంధు చెక్కు అందుకోవాలని చెబుతున్నారు. వేల మైళ్ల దూరాన ఉన్న వాళ్లు రైతుబంధు కోసమో, పాసుపుస్తకం కోసమో ఇంటికి రావాలంటే ఎంతో వ్యయంతో కూడుకున్న పని.
అప్పు చేసైనా వద్దామంటే అక్కడి ప్రభుత్వాలు అత్యవసర పరిస్థితుల్లో వీసాలు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. తమ పేరిట ఉన్న పాసుపుస్తకాలను కుటుంబ సభ్యులకు ఇవ్వాలన్న వలస జీవుల వినతులు ప్రభుత్వానికి వినపడడం లేదు. తెలంగాణ రాష్ట్రంలోని ఆయా జిల్లాలకు చెందిన వారు దాదాపు 10 లక్షల మంది దాకా గల్ఫ్ దేశాల్లో ఉన్నట్టు అంచనా.
అయితే భూమి ఉండి విదేశాల్లో ఉంటున్న వారి సంఖ్య దాదాపు 1.50 లక్షలు ఉంటుందని రెవెన్యూ అధికారుల లెక్కలు వేశారు. ఈ 1.50 లక్షల మందిలో 90 శాతం గల్ఫ్‌లోనే ఉంటున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్నవారిలో అందరూ సన్న, చిన్నకారు రైతులే కావడం గమనార్హం. చాలా మంది వ్యవసాయం దెబ్బతిని, బోర్లు తవ్వించి అప్పులపాలై పొట్ట చేతపట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్లినవారే ఉంటారు.
అమలుకు నోచుకోని హామీ...
వలస వెళ్లిన రైతులకు కూడా పాసుపుస్తకాలు అందిస్తామని, రైతుబంధు సాయం అందుతుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, ఇప్పటి వరకు వలస రైతులకు పాసుపుస్తకాలపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్నీ వెలువరించడం లేదు. దీంతో ఆ కుటుంబాలు మనోవేదనకు గురవుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘బీమా’ ధీమా లేదు..
వ్యవసాయ భూములు కలిగి ఉన్న వలస జీవులకు కనీసం బీమా కూడా దక్కడం లేదు. రైతుబంధు ద్వారా రైతులందరికీ సాయం అందించడంతో పాటు ప్రతీ ఒక్కరికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్న ప్రభుత్వం వలస జీవులకు ఆ అవకాశం కల్పించడం లేదు. భూమిని నమ్ముకుని బతికిన తమవాళ్లు వ్యవసాయం దెబ్బతినడం మూలంగానే విదేశాలకు వెళ్లారని, అలాంటి తమవారిని ఇబ్బందులకు గురిచేయడం తగదంటున్నారు. పాత రికార్డుల ఆధారంగా ఇప్పటికైనా ప్రభుత్వం పాసుపుస్తకాలు అందించడంతో పాటు రైతుబంధు సాయం అందించాలని, బీమా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment