మోర్తాడ్ (బాల్కొండ): కువైట్, ఖతర్ తదితర గల్ఫ్ దేశాల్లో పలు కంపెనీలు వర్క్ వీసాలపై వచ్చే కార్మికులపై ఖర్చు తప్పించుకోవడానికి కొత్తగా షట్‌డౌన్ (తాత్కాలిక) వీసాల బాటపట్టాయి. ఇటీవల షట్‌డౌన్ వీసాల జారీ ప్రక్రియ మొదలు కావడంతో కంపెనీల యాజమాన్యాలు పర్మనెంట్ కార్మికులలో ఒక్కొక్క రిని ఇంటి ముఖం పట్టిస్తున్నాయి. దీంతో అనేకమంది భారత కార్మికులు ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఇలా కువైట్, ఖతర్ దేశాల నుంచి నెల రోజుల వ్యవధిలోనే వందలాది మంది కార్మికులు తమ స్వదేశాలకు వెళ్లిపోయారు. గల్ఫ్ దేశాల్లోని కంపెనీలు వర్క్ వీసాలపై వచ్చే కార్మికులకు సంబంధించి ప్రభుత్వాలకు పక్కాగా లెక్క చూపాల్సి వస్తుంది. దీంతో తమకు ఆర్థికంగా భారం పడుతుండడంతో తాజాగా కంపెనీలు షట్‌డౌన్ వీసాలపై కార్మికులను పిలిపించుకుని వారితో అవసరం ఉన్నంతవరకు పనులు చేయించుకుని గాలికి వదిలివేస్తున్నాయి.
గల్ఫ్ కార్మిక చట్టాల ప్రకారం వర్క్ వీసాలపై వచ్చే కార్మికులకు ఆయా కంపెనీలు సరైన వసతి, భోజనం, రవాణా సౌకర్యాలు, పనికి తగిన వేతనం చెల్లించాలి. దీంతో కంపెనీలకు ఆర్థికంగా భారం పడుతోంది. దీనినుంచి తప్పించుకోవడానికి అవి షట్‌డౌన్ వీసాలవైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ వీసాలతో వచ్చే కార్మికులతో కేవలం కొద్ది నెలల పాటు పనిచేయించుకుంటే ఆయా కంపెనీలు వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించాల్సి న అవసరం లేదు. కువైట్‌లోని ప్రముఖ కంపెనీలైన కరాచీ నేషనల్, ఫస్ట్ కువైట్, ఎన్‌బీటీసీ తదితర కంపెనీలు వర్క్ వీసాలతో పని చేస్తు న్న అనేకమంది కార్మికులకు ఇటీవల ఉద్వాసన పలికాయి. కొన్ని నెలల పాటు సెలవులు మంజూరు చేస్తున్నామని.. అవసరం ఉన్నప్పు డు కబురు పెడతామంటూ కంపెనీలు కార్మికులను ఇంటికి పంపిస్తున్నాయి. తెలంగాణకు చెందిన పలువురు కార్మికులు కూడా ఈ దెబ్బ తో ఇంటిదారి పట్టారు. ఒక్క నెల వ్యవధిలోనే దాదాపు 750 మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. కువైట్, ఖతర్‌లలో రాబోయే రోజుల్లో మరింత మంది కార్మికుల ఉద్యోగాలు ఊడిపోయే అవకాశాలు ఉన్నట్లు మన రాష్ట్రానికి చెందిన కార్మికుల ద్వారా తెలిసింది.
షట్‌డౌన్ వీసాలకు భారీగా వసూళ్లు...
గల్ఫ్ కంపెనీలు షట్‌డౌన్ వీసాల కోసం ప్రభుత్వం నుంచి సులభంగా అనుమతి పొందుతున్నాయి. ఈ వీసాలకు ఎలాంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదు. కార్మి కుల నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకున్న గల్ఫ్ ఏజెంట్లు షట్‌డౌన్ వీసాలకు కూడా రూ.50వేల నుంచి రూ.60 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. సాధారణంగా షట్‌డౌన్ వీసాల ద్వారా నాలుగు నుంచి ఐదు నెలల పాటు పని చేయడానికి అవకాశం ఉంటుంది. పని కాలం ముగిశాక కార్మికులు స్వదేశాలకు వెళ్లిపోవాలి. అక్కడే ఉండి మరో పని చూసుకోవచ్చని నమ్మిస్తున్న ఏజెంట్లు కార్మికులకు షట్‌డౌన్ వీసాల కోసం ఎక్కువ మొత్తంలోనే వసూలు చేస్తున్నారు. ఈ విధానం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. భారత ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు షట్‌డౌన్ వీసాల గురించి కార్మికులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
షట్‌డౌన్ వీసాల వల్లనే ఇంటికి పంపించారు
నేను కువైట్‌లో దాదాపు ఐదేళ్ల నుంచి మున్సిపాలిటీలో పని చేస్తున్నాను. ఇటీవలే అకామ కోసం మన కరెన్సీలో రూ.15వేలు చెల్లించాను. అయితే కువైట్‌లో షట్‌డౌన్ వీసాలపై వచ్చిన వారికే ఎక్కువ పని చూపుతున్నారు. దీంతో మా కంపెనీ నన్ను ఇంటికి పంపించింది. మళ్లీ కబురు పెడతామని చెప్పారు. కాని నమ్మకం లేదు. షట్‌డౌన్ వీసాల జారీ మొదలు కావడంతో కార్మికులకు కష్టాలు మొదలయ్యాయి.
– ఆనందం గంగేశ్వర్, ఏర్గట్ల(నిజామాబాద్‌జిల్లా)
Comments
Please login to add a commentAdd a comment