అక్కడి నుంచి ఎలా వచ్చేది..! | Special Story About People Suffering To Come From Gulf Countries | Sakshi
Sakshi News home page

అక్కడి నుంచి ఎలా వచ్చేది..!

Published Fri, Oct 18 2019 8:34 AM | Last Updated on Fri, Oct 18 2019 11:05 AM

Special Story About People Suffering To Come From Gulf Countries - Sakshi

‘గల్ఫ్‌లో ఉన్న మనోళ్లంతా ఇంటికి తిరిగి రావాలె. ఇక్కడ ఎన్నో అవకాశాలున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో నిర్మాణరంగం వేగంగా నడుస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు వచ్చి పనులు చేస్తున్నారు. గల్ఫ్‌లో ఉన్న మనోళ్లంతా వస్తే ఇక్కడే మస్తు పని దొరుకుతుంది. అవసరమైతే నేనే స్వయంగా గల్ఫ్‌ దేశాలకు వెళ్లి మనోళ్లతోని మాట్లాడుతా’ అని సీఎం కేసీఆర్‌ ఇటీవల చేసిన ప్రకటన గల్ఫ్‌ వలస కార్మికుల్లో చర్చనీయాంశమైంది. తొలిసారి గల్ఫ్‌ వలస కార్మికుల విషయంపై సీఎం కేసీఆర్‌ ప్రకటన చేసిన నేపథ్యంలో వలస కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం అనుసరించబోయే తీరు ఎలా ఉండబోతుందోననే అంశంపై సర్వత్రా చర్చజరుగుతోంది.

సీఎం ప్రకటనపై కార్మికులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు కార్మికులు సానుకూలంగా స్పందించగా, మరి కొందరు ఇది సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు. ముఖ్యమంత్రి కేవలం భవన నిర్మాణ రంగంలోనే ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారని, కానీ, గల్ఫ్‌ దేశాల్లో ఎంతో మంది కార్మికులు ఇతర రంగాల్లోనూ ఉపాధి పొందుతున్నారని పలువురు తెలిపారు. అంతేకాకుండా వలస కార్మికుల సంఖ్య అత్యధికంగా ఉండగా.. వారందరికి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి చూపుతుందా అనే సంశయం వ్యక్తం చేస్తున్నారు. గల్ఫ్‌లో ఏదో ఒక పనిచేసుకుని బతుకుతున్న వలస జీవులు ఇంటికొచ్చి స్థానికంగా ఉపాధి చూసుకునేందుకు ముందుకు రావడం లేదు.

ఏళ్ల తరబడి గల్ఫ్‌లో పనులు చేస్తూ.. అక్కడ  కొంత మెరుగైన జీవనం గడుపుతున్న వారు ఇంటికి తిరిగి వచ్చి సంపాదనకు దూరం కాలేమంటున్నారు. ఇదే సమయంలో అరకొర వేతనాలతో నెట్టుకొస్తున్నవారు సైతం.. రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేరళ విధానం గురించి చెప్పిందని, తరువాత దాన్ని మరిచిపోయిందని, ఇప్పుడు రమ్మంటుంటే నమ్మకం కలగడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గల్ఫ్‌ వలస జీవుల పట్ల స్పష్టమైన వైఖరిని ప్రకటించి  ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, అప్పుడే నమ్మకం కుదిరి చాలా మంది స్వస్థలాలకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు.  

ప్రభుత్వం చెబుతున్న ఉపాధి ఇదే... 
గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి కోసం వెళ్తున్న తెలంగాణ కార్మికుల్లో ఎక్కువ మంది నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. భవనాల నిర్మాణంతో పాటు ఎలక్రీషియన్, ఫ్లంబర్, డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. కొందరు మాల్స్, ఇతర కంపెనీల్లో క్లీనింగ్, స్టోర్‌ కీపర్లుగా, సూపర్‌వైజర్లుగా మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేయడానికి వెళ్తున్నారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం హైదరాబాద్‌ ప్రాంతం లోని నిర్మాణ రంగంలో ఉపాధి కల్పించడానికి ఏర్పాట్లు చేస్తామని ప్రకటించింది. మన ప్రాంతం వారు వలస వెళ్లడంతో స్థానికంగా జరిగే నిర్మాణాలకు కార్మికుల కొరత ఏర్పడి పొరుగు రాష్ట్రాల నుంచి కార్మికులను రప్పించుకోవాల్సి వస్తుందని ప్రభుత్వం పేర్కొంటోంది.

అంతేకాకుండా గల్ఫ్‌ దేశాల్లో వలస కార్మికులకు ఆశించిన విధంగా వేతనం లభించడం లేదని ఈ కారణంగా కార్మికులు అవస్థలు పడుతున్నారని ప్రభుత్వం పేర్కొంది. అందువల్ల హైదరాబాద్‌ ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాల్లో వలస కార్మికులకు ఉపాధి కల్పించడానికి బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో సంప్రదింపులు జరుపుతామని ప్రకటించింది. అంతేగాక హైదరాబాద్‌లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌(న్యాక్‌)లో కార్మికులకు అవసరమైన శిక్షణ ఇప్పిస్తామని కూడా ప్రభుత్వం వెల్లడించింది. 

మూడు తరాలు గల్ఫ్‌లోనే.. 
ఐదు దశాబ్దాలుగా గల్ఫ్‌కు వలసలు కొనసాగుతున్నాయి. మూడు తరాల వాళ్లు ఎడారి దేశాల బాట పట్టారు. ఇటీవలి కాలంలో చాలా మంది యువకులు గల్ఫ్‌ బాట పడుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్‌ మండలం కల్వరాల్, పద్మాజివాడీ, మాచారెడ్డి మండలంలోని పాల్వంచ, గన్‌పూర్‌ (ఎం), రామారెడ్డి మండలం రెడ్డిపేట, అన్నారం.. ఇలా కొన్ని గ్రామాల్లో ఒకే ఇంట్లో తండ్రి, కొడుకు గల్ఫ్‌లో ఇప్పటికీ ఉంటున్నారు. అంతకుముందు వారి తాతలు కూడా వెళ్లివచ్చారు.

గల్ఫ్‌లో తెలంగాణ వాసులు 13 లక్షలకు పైగానే.. 
గల్ఫ్‌ దేశాలైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఒమాన్, బహ్రెయిన్, ఇరాక్‌లలో వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికుల సంఖ్య 13లక్షలకు పైగా ఉంటుందని అంచనా. 1970 నుంచి ఈ ప్రాంత వాసులు గల్ఫ్‌ దేశాలకు వలస వెళుతున్నారు. మొదట తెలంగాణలోని  నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి వలసలు సాగాయి. ఆ తర్వాత వలసలు దాదాపు అన్ని జిల్లాలకు విస్తరించాయి.   

ప్రవాసీ సంక్షేమ విధానంపై ఆశలు.. 
విదేశాలకు ఉపాధి, ఉద్యోగాల కోసం వలస వెళ్లిన కార్మికుల సంక్షేమం కోసం ప్రవాసీ సంక్షేమ విధానం(ఎన్‌ఆర్‌ఐ పాలసీ) అమలు చేయాలని వలసదారులు ఎంతో కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐ పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదాను సిద్ధం చేసినా మళ్లీ అధ్యయనం కోసం అధికారుల బృందాన్ని కేరళకు పంపించాలని నిర్ణయించడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ముసాయిదా సిద్ధం చేసిన తరువాత అధ్య యనం కోసం అధికారులను కేరళకు పంపిం చడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది కాలయాపన చేయడమేనని గల్ఫ్‌ ప్రవాసుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు అంటున్నారు. అయితే, గల్ఫ్‌ కార్మికుల సంక్షేమం కోసం మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పడం హర్షణీయమని పలువురు పేర్కొంటున్నారు.

కార్మికుల సంఖ్య తేల్చడానికి సర్వే..
తెలంగాణ నుంచి గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిన కార్మికుల సంఖ్య ఎంత ఉంటుందో తేల్చడానికి అంతర్గతంగా సర్వే జరుగుతోంది. ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాల మేరకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో యంత్రాంగం వివరాలు సేకరిస్తోంది. గల్ఫ్‌ వలస కార్మికులను స్వరాష్ట్రానికి రప్పించి వారికి స్థానికంగానే ఉపాధి చూపుతామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో వలస కార్మికుల సంఖ్యను తేల్చడానికి ప్రత్యేక సర్వే ప్రారంభం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement