సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఆర్భాటంగా ప్రవేశపెట్టిన బీసీ కులవృత్తిదారులకు ఆర్థిక సాయం పంపిణీ పథకం ఆశావహులను తీవ్ర నిరాశకు గురిచేసింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా బీసీ కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ పథకం కింద భారీగా దరఖాస్తులు రావడంతో వాటిని పరిశీలించి ప్రతి నెలా 15వ తేదీన విడతల వారీగా సాయం పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా తొలివిడత కింద ఈనెల 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక శాసనసభ్యుల చేతుల మీదుగా ఆర్థిక సాయానికి ఎంపికైన వారికి చెక్కులు అందించేందుకు ఏర్పాట్లు చేసింది.
ఎంతో ఆర్భాటంగా ప్రకటనలు చేసిన యంత్రాంగం చివరకు అరకొరగా.. కేవలం పదుల సంఖ్యలోనే లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ పంపిణీ ఊసే లేకపోగా.. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చోట్ల పరిమితంగా లబ్ధిదారులకు చెక్కులు అందించడంతో ఎంతో ఆశగా సాయంకోసం ఎదురు చూసిన దరఖాస్తుదారులు నిరాశకు గురయ్యారు.
ఎంతమందికి అందాయి..?
బీసీ కులవృత్తిదారులకు ఆర్థిక సాయం కింద రాష్ట్రవ్యాప్తంగా 5.28 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిని మండల స్థాయిలో పరిశీలించి అర్హతలను నిర్ధారించాలని ప్రభుత్వం సంబంధిత అధికారు లను ఆదేశించింది. ఈ క్రమంలో అధికారులు వీలైనన్ని దరఖాస్తులను పరిశీలించి జాబితాలను జిల్లా కలెక్టర్లకు అందించారు. తొలివిడత కార్య క్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం రూ.400 కోట్ల నిధులను విడుదల చేసింది.
ఈ డబ్బుతో ప్రతి అసెంబ్లీ సెగ్మెంటుకు సగటున 335 మంది లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున సాయం ఆదించవచ్చని అంచనా వేశారు. కానీ శనివారం మెజార్టీ సెగ్మెంట్లలో ఈ కార్యక్రమమే నిర్వహించలేదని ఆరోపణలు వస్తున్నాయి. అయితే శాసనసభ్యులకు సమయాభావం వల్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయినట్లు క్షేత్రస్థా యి అధికారులు అధికారులు చెబుతున్నారు.
దీంతో 15వ తేదీన జరిగిన కార్యక్రమంలో ఎంత మందికి చెక్కులు పంపిణీ చేశారనే దానిపై అస్పష్టత నెలకొంది. దీంతో మండలాల వారీగా సమాచా రాన్ని సేకరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తొలివిడతలో చేపట్టిన కార్యక్రమంలో పంపిణీ చేసిన చెక్కుల వివరాలపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని చెపుతున్నారు.
అత్యధికం అనర్హులే...!
వెనుకబడిన వర్గాల్లో కులవృత్తులపై ఆధారపడ్డ వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. దరఖాస్తులను ఆన్‌లైన్ పద్ధతిలో స్వీకరించింది. దరఖాస్తుల ప్రక్రియకు తక్కువ సమయం ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో అనూహ్య స్పందన వచ్చింది. అధికారులు వాటి పరిశీలనకు ప్రత్యేక విధానాన్ని అమలు చేసినట్లు తెలిసింది. ప్రతి దరఖాస్తుపై పూర్తిస్థాయి పరిశీలన (360 డిగ్రీలు) విధానంలో ఆరా తీసినట్లు చెపుతున్నారు.
ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖా స్తుల్లో మూడోవంతు వాటిని తొలివిడత కింద పరిశీలన చేశారు. ఇందులో మెజార్టీ అర్జీ దారులు కులవృత్తులపైనే ఆధారపడకుండా ఇతరత్రా వ్యాపకాలు నిర్వహిస్తున్నట్లు వెలుగు చూసింది. అంతేకాకుండా ఆర్థికంగా బాగా ఉన్న వాళ్లు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడైంది. చాలా మందికి సొంతంగా నాలుగు చక్రాల వాహనాలు, ఇళ్లు, పొలాలు.. తదితరాలున్నా యని తేలింది. ఆదాయపన్ను చెల్లిస్తున్న వాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవడం విశేషం.
ఈ క్రమంలో మెజార్టీ దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యేలు ఇచ్చిన జాబితాల ఆధారంగా పరిశీలించిన దరఖాస్తుల్లోనూ ఇదే తరహాలో పలువురు అనర్హతకు గురైనట్లు తెలిసింది. దీంతో తాము సిఫార్సు చేసిన వారి పేర్లు లేనందున చెక్కుల పంపిణీ విషయంలో వారు ఆసక్తి చూపించలేదని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment