రంగు మెరుపుతో వచ్చే రాఖీల పండుగ.. దూర దేశం బోయిన మా అన్న చంద్రుడా.. రాఖీట్ల పున్నానికి వస్తవని వాకిట్ల కూసున్నరో మాయన్న.. అని జానపద గాయని అంకుల గంగాదేవి పాడిన పాట గల్ఫ్‌లో ఉన్న వలస కార్మికులతో పాటు ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులను కన్నీళ్లు పెట్టించింది. జానపద పాటలకు ఆదరణ లభించేలా తన గానంతో విశేష కృషి చేసిన ‘రేలా రె రేలా ఫేం’ గంగాదేవి గల్ఫ్ దేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు.
ఆయా సందర్భాల్లో అక్కడి కార్మికుల క్యాంపులను ఆమె సందర్శించి వారి జీవనశైలిని పరిశీలించారు. సంవత్సరాల కాలంగా కన్న తల్లిదండ్రులకు, కట్టుకున్న భార్యకు, రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలకు దూరంగా ఉంటూ కార్మికులు అనుభవిస్తున్న కష్టాలు తనను చలింపజేశాయని, అనేక మంది దుర్భర జీవితం గడుపుతున్నారని చెప్పారు. ఎడారి దేశాల్లో మన కార్మికుల జీవనంపై గంగాదేవి ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
నిజామాబాద్ జిల్లా ముల్లంగిలో జన్మించిన నాకు చిన్నతనంలోనే తండ్రి దూరమయ్యాడు. తల్లి, అమ్మమ్మ, అక్క ఆప్యాయతను పంచుకుని పెరిగిన నేను చిన్ననాటి నుంచి కష్టాలనే అనుభవించాను. జానపదాలను అందరికి వినిపిస్తూ గాయనిగా ఒక్కో మెట్టు ఎక్కాను. పల్లె పాట ద్వారా అందరి అభిమానం చూరగొన్న నేను గల్ఫ్ కార్మికుల కష్టాల గురించి చిన్ననాటి నుంచి వింటూనే ఉన్నా. జానపద గాయకురాలిగా స్వరాష్ట్రంలోనే కాకుండా గల్ఫ్ దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చే అవకాశం వచ్చింది.
తద్వారా కార్మికుల జీవన విధానాన్ని పరిశీలించే అవకాశం కూడా లభించింది. యూఏఈ, కువైట్, ఖతార్, ఒమాన్ దేశాల్లో ఇప్పటి వరకు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. సౌదీ అరేబియా, బహ్రెయిన్ దేశాల్లో మాత్రం ప్రదర్శనలు ఇవ్వడానికి అవకాశం రాలేదు. ప్రధానంగా తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా, బతుకమ్మ సంబరాల సమయంలో గల్ఫ్ దేశాలకు వెళ్లి పాటలు పాడుతుంటా. గల్ఫ్‌లో ప్రదర్శనల అనంతరం కార్మికుల క్యాంపులకు వెళ్లి వారితో మాట్లాడాను.
ప్రధానంగా దుబాయి లోని సోనాపూర్ క్యాంపు, షార్జాలోని కార్మికుల క్యాంపులకు వెళ్లి తెలుగు రాష్ట్రాల కార్మికులను కలుసుకున్నా. కార్మికులు ఏజెంట్ల చేతుల్లో మోసపోవడం, కంపెనీ యాజమాన్యాల ద్వారా వంచనకు గురికావడం ఇలా ఎన్నో రకాలుగా కార్మికులు అవస్థలు పడటాన్ని తెలుసుకున్నా. ఖల్లివెళ్లి అయిన కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కార్మికులు గల్ఫ్ దేశాల్లో మరణిస్తే వారి మృతదేహాలు ఇళ్లకు చేరుకోవడానికి కాలయాపన జరుగుతోంది. మరికొందరి మృతదేహాలు మార్చురీలలోనే మగ్గిపోతున్నాయి. ఇలా ఎన్నో సమస్యలు నా దృష్టికి వచ్చాయి.
గల్ఫ్ కార్మికుల అంశాన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించాను. వారిలో మనోధైర్యం కలిగించేందుకు కృషిచేస్తున్నా. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. గల్ఫ్‌లో ఏ కార్మికుడిని కదిలించినా మాతో ఒకే ఒక్కమాట చెప్పారు అదే.. ఎన్‌ఆర్‌ఐ పాలసీని అమలు చేయాలని. ఎన్‌ఆర్‌ఐ పాలసీ అమలైతేనే గల్ఫ్ కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని ఎంతో మందికి విశ్వాసం ఉంది. అలాగే ఎడారి దేశాల్లో నష్టపోయిన కార్మికులకు పునరావాస కార్యక్రమాలు అమలు చేయాలి.
వారి జీవితాలపై ఆల్బమ్ చేయాలని ఉంది..
జానపద గాయనిగా ఎన్నో పాట లను ఆలపించిన నేను.. గల్ఫ్ కార్మికుల జీవితాలపై ఆల్బమ్ రూపొందించాలనుకుంటున్నా. అవకాశం వస్తే కచ్చితంగా కాల్బమ్ చేస్తా. ఆ ఆల్బమ్‌ను గల్ఫ్ కార్మికులకే అంకితం ఇస్తాం. మున్ముందు గల్ఫ్ కార్మికుల జీవితాలకు అద్దం పట్టే పాటలను ఆలపిస్తా.
Comments
Please login to add a commentAdd a comment