గల్ఫ్ భారత కార్మికులకు మోదీ హామీలు!
దోహాః గల్ఫ్ లోని భారత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, కావలసిన సహాయం అందిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఐదు దేశాల పర్యటనకు వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోదీ ఆఫ్ఘనిస్తాన్ అనంతరం గల్ఫ్ దేశాలను సందర్శించారు. పర్యటనలో భాగంగా అక్కడ కార్మికులకోసం ఏర్పాటు చేసిన ఫ్రీ మెడికల్ క్యాంప్ కార్యక్రమానికి హాజరై, వారినుద్దేశించి మాట్లాడారు. కష్టపడి పనిచేయడంతోపాటు, ఆరోగ్యంపట్ల కూడ తగిన శ్రద్ధ వహించాలని కార్మికులకు సలహా ఇచ్చారు.
గల్ఫ్ లో పనిచేస్తున్న భారతీయ కార్మికులకు భారత ప్రధాని నరేంద్రమోదీ హామీలు కురిపించారు. ఇక్కడి కార్మికులకు భారత ప్రభుత్వం అన్నివిధాలుగా సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇండియన్ కమ్యూనిటీ బెనెవోలెంట్ ఫండ్ (ఐసీబీఎఫ్), ఇండియన్ డాక్టర్స్ కమ్యూనిటీ (ఐడీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మికుల ఉచిత వైద్య శిబిరానికి హాజరైన ఆయన.. అక్కడకు ప్రకాశవంతమైన పసుపురంగు యూనిఫారాలు ధరించి వచ్చిన కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ''బహుశా నేనెవరో మీకు తెలిసే ఉండొచ్చు... కానీ మిమ్మల్ని కలిసేందుకు భారతదేశంనుంచీ కొందరు రావడం అనేది మీకు మంచి ఫీలింగ్ గా ఉండాలి'' అంటూ నవ్వుతూ మోదీ తన ప్రసంగం కొనసాగించారు. దోహాలో నా మొదటి కార్యక్రమం మిమ్మల్ని కలవడమేనని, మీకు అన్ని విధాలుగా సహకరించేందుకు నావంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇండియన్ బ్లూ కాలర్ కార్మికుల ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఆయన... కార్మికుల ప్రధాన ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నానని, ముఖ్యంగా సరైన కౌన్సిలింగ్ లేకపోవడం, మధుమేహం ప్రధాన సవాళ్ళుగా మారాయని అన్నారు.
ప్రసంగం ముగిసిన తర్వాత మోదీ... కార్యక్రమానికి హాజరైన కార్మికులు ఒక్కొక్కరి దగ్గరకు వెళ్ళిమరీ ఆప్యాయంగా పలుకరించారు. ఓ కార్మికుడు తన సీటు నుంచీ లేచి, ప్రధానిని కూర్చోమంటూ ఆహ్వానించగా... అతడి భుజంపై తట్టిన ప్రధాని మోదీ.. అతడి పక్కనే కూర్చుని భోజనం చేశారు. ఈ సంవత్సరం ఏప్రిల్ లో కూడ మోదీ సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో భారత బ్లూ కాలర్ కార్మికులతో కలసి భోజనం చేశారు. 2008 లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటన అనంతరం కతర్ లో పర్యటించిన రెండో భారత ప్రధాని మోదీనే. కతర్ లో సుమారు 630,000 మంది బహిష్కృత కార్మికులుండగా... అందులో చాలామంది బ్లూకాలర్ కార్మికులే. కార్మికులతో ముచ్చటించిన తర్వాత కతర్ లోని బిజినెస్ లీడర్లతో సైతం భేటీ అయిన ప్రధాని మోదీ.. అనంతరం అక్కడినుంచీ స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికో పర్యటనలను ముగించుకొని భారతదేశానికి తిరిగి వచ్చారు.
Shoulder to shoulder with Indian workers abroad. PM @narendramodi interacts with the workers pic.twitter.com/z4GQJLueCX
— Vikas Swarup (@MEAIndia) June 4, 2016