‘మిషన్ భగీరథ’ను అడ్డుకున్న రైతులు
పంట పొలాలను నష్టం చేస్తున్నారని మండిపాటు
చేవెళ్ల: ఇంటింటికీ నల్లాల ద్వారా తాగు నీరు అందించాలనే ఉద్ధేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ భగీరథ‘ పనులకు అడుగడుగునా అవాంతరాలు ఏర్పడుతున్నాయి. తమకు కనీస సమాచారం లేకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, పరిహారం ఇస్తామన్న భరోసా కల్పించకుండా.. తమ పంట పొలాల నుంచి తాగునీటి పైపులు వేస్తుండడంతో రైతులు పలుచోట్ల అడ్డుకుంటున్నారు. తాజాగా శనివారం చేవెళ్ల మండల రైతులు మిషన్ భగీరథ పనులను అడ్డుకున్నారు. పంట పొలాలనుంచి పైపులు వేయడానికి సంబంధిత రైతుల అనుమతి అక్కర లేదా? అంటూ కాంట్రాక్టర్‌పై, పనులు చేయిస్తున్న సూపర్‌వైజర్‌పై మండిపడ్డారు. తమ అనుమతి తీసుకున్న తరువాతే పైపులైను పనులు చేయాలంటూ పనులను అడ్డగించారు. పనులను ఆపే దాకా రైతులు శాంతించ లేదు. పూర్తి వివరాలలోకి వెళితే.. 2018 చివరినాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలనే సదాశయంతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో భాగంగా చేవెళ్ల నియోజకవర్గంలోని చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి, షాబాద్ మండలాలు, రాజేంద్రగనర్‌లోని నాలుగు గ్రామాలకు ప్రభుత్వం రూ.240 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. దీంతో పనులు వేగవంతమయ్యాయి.
భారీ నీటి ట్యాంకులు, సంపులు నిర్మించే పనులు, పైపులైను వేసే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దీంతో రోడ్డు పక్కన సుమారు 50 నుంచి 60 మీటర్ల అవతలి నుంచి పైపులైన్లు వేసే క్రమంలో రైతుల పొలాల్లోకి కూడా పైపులైన్లు వేసేందుకు గుంతలు తీస్తున్నారు. దీనికి ఎలాంటి పరిహారం ఇవ్వడం లేదు. రైతుల పొలాల నుంచి వేసే పైపులైన్లకు పరిహారం ఇవ్వడంలేదు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ముంబై-బెంగుళూరు హైవేలో చేవెళ్ల సమీపంలో పైపులైన్లు వేయడానికి గుంతలు తీస్తుండగా చేవెళ్లకు చెందిన రైతులు ఎం.లక్ష్మారెడ్డి, ఏ.విఠల్‌రెడ్డి, కె.అనంతరెడ్డి, ఎం.కమాల్‌రెడ్డి, రాంరెడ్డి, ఎం.జంగారెడ్డి, ఏ.చంద్రశేఖర్‌రెడ్డి, తదితరులు పనులను అడ్డుకున్నారు. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా గుంతలు ఎలాతీస్తారంటూ మండిపడ్డారు. రైతులు అడ్డుకోవడంతో పనులను మాత్రం తాత్కాలికంగా నిలిపేశారు.
నిబంధనల ప్రకారమే పనులు చేస్తున్నాం..
ప్రతి ఇంటికీ మంచినీటిని అందిచాలన్న ప్రభుత్వ ఆశయానికి ప్రజలు, రైతుల సహకారం అందించాలి. కార్యక్రమాన్ని అడ్డుకోవద్దు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పైపులైన్లు వేస్తున్నాం. రైతులు సహకరించాలి. - నరేందర్, మిషన్ భగీరథ డీఈఈ, చేవెళ్ల డివిజన్