సాక్షి, ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా రాలేదని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. స్థానిక టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న విభజన సమస్యలు, కాళేశ్వరం జాతీయ హోదా తదితర విషయాలను ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తామని చెప్పారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, మైనింగ్ యూనివర్శిటీ ఏర్పాటు, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు.
రాష్ట్రానికి మంజూరు చేసిన 3,155 కిలోమీటర్ల జాతీయ రహదారులకు వెంటనే నిధులు ఇవ్వాలని, మంజూరైన రైల్వే లైన్లకు తక్షణం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న హర్–గర్–జల్ కార్యక్రమం రాష్ట్రంలో అవసరం లేదని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, దానికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా సాయం అందలేదని, వెంటనే కాళేశ్వరానికి జాతీయ హోదా ప్రకటించాలని, అన్ని ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు ఎక్కువ నిధులు కేటాయించాలన్నారు. రాష్ట్రంలో ప్రతీ జిల్లాకు ఒక నవోదయ పాఠశాల, మెడికల్ కళాశాల మంజూరు చేయాలన్నారు. ఆర్టికల్ 370, 35ఏ రద్దుకు టీఆర్‌ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించిందని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు. ఆయన వెంట రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మం జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, మేయర్ పాపాలాల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ నల్లమల వెంకటేశ్వర్‌రావు, నాయకులు తాళ్లూరి భ్రహ్మయ్య, స్వర్ణకుమారి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment