Khammam MP
-
'కేంద్రం నుంచి ఒక్క పైసా రాలేదు'
సాక్షి, ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా రాలేదని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. స్థానిక టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న విభజన సమస్యలు, కాళేశ్వరం జాతీయ హోదా తదితర విషయాలను ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తామని చెప్పారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, మైనింగ్ యూనివర్శిటీ ఏర్పాటు, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు. రాష్ట్రానికి మంజూరు చేసిన 3,155 కిలోమీటర్ల జాతీయ రహదారులకు వెంటనే నిధులు ఇవ్వాలని, మంజూరైన రైల్వే లైన్లకు తక్షణం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న హర్–గర్–జల్ కార్యక్రమం రాష్ట్రంలో అవసరం లేదని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, దానికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా సాయం అందలేదని, వెంటనే కాళేశ్వరానికి జాతీయ హోదా ప్రకటించాలని, అన్ని ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎక్కువ నిధులు కేటాయించాలన్నారు. రాష్ట్రంలో ప్రతీ జిల్లాకు ఒక నవోదయ పాఠశాల, మెడికల్ కళాశాల మంజూరు చేయాలన్నారు. ఆర్టికల్ 370, 35ఏ రద్దుకు టీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించిందని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు. ఆయన వెంట రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మం జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, మేయర్ పాపాలాల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ నల్లమల వెంకటేశ్వర్రావు, నాయకులు తాళ్లూరి భ్రహ్మయ్య, స్వర్ణకుమారి ఉన్నారు. -
వైఎస్ జగన్ నన్ను కుటుంబ సభ్యుడిలా చూశారు
వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తనను ఓ కుటుంబ సభ్యుడిలా చూశారని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పార్టీలో తాను టాప్ 3లో ఒకడిగా ఉన్నానని, వైఎస్ కుటుంబంపై ప్రేమాభిమానాలు ఎప్పటికీ అలాగే ఉంటాయని ఆయన చెప్పారు. ఏపీలో పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు చెబుతున్నట్లుగా వైఎస్ జగన్‌కు అహంకారం లేదని ఆయన అన్నారు. అయితే.. ప్రేమాభిమానాలు వేరు, ప్రాంతాల అభివృద్ధి వేరని ఆయన చెప్పారు. పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ మూడు రోజుల నిరాహార దీక్ష చేస్తున్నందువల్లే తాను పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. తెలంగాణలో పార్టీకి ఇబ్బంది అవుతుందని తెలిసినా, ప్రతిపక్ష నేతగా, ఏపీ ప్రాంత ప్రయోజనాల కోసం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని, అందుకే తాను తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. వైఎస్ఆర్ జలయజ్ఞం ద్వారా కొన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయని, మిగిలిన ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేస్తున్నారని అన్నారు. అందుకే బంగారు తెలంగాణలో పాలు పంచుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. కేటీఆర్ ఆహ్వానం మేరకు బుధవారం తాను టీఆర్ఎస్లో చేరుతున్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. తాను కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరుతున్నానన్నారు. దీక్ష బాధాకరం పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ దీక్ష చేయాలనుకోవడం బాధాకరమని తెలంగాణ మంత్రి కె. తారక రామారావు అన్నారు. ఏపీ ప్రాంత ప్రయోజనాలు వైఎస్ జగన్‌కు ఎంత ముఖ్యమో, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు తమకూ అంతే ముఖ్యమని, అందుకే తెలంగాణ వైఎస్ఆర్సీపీ నేతలను టీఆర్ఎస్లోకి రావాలని ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు. -
మేడారంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి
వరంగల్: మేడారం సమ్మక్క సారక్క జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. మరోరెండు రోజుల్లో ప్రారంభం కానున్న జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమ్మక్క, సారలమ్మ గద్దెలను దర్శిచుకుని ప్రత్యేక పూజలు చేశారు. నిలువెత్తు ‘బంగారం’తో పొంగులేటి మొక్కు తీర్చుకున్నారు. అమ్మ వార్లను దర్శించుకున్న వారిలో ఆయనతో పాటు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఉన్నారు. -
గూడు కోసం ఎన్నాళ్లు ఎదురుచూడాలి?
ఖమ్మం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చాలని కోరుతూ తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెండురోజుల నిరశన దీక్షను సోమవారం ప్రారంభించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారం చేపట్టి 16 నెలలు దాటినా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో నియోజకవర్గానికి 400 మందికి మాత్రమే డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయిస్తే.. ఎన్ని ఏళ్ల పాటు పేదలు గూడు కోసం ఎదురుచూడాలని పొంగులేటి ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికీ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే 4,600 మంది పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారని, ఆ తరువాత వచ్చిన ఏ ప్రభుత్వాలూ పేదల గురించి ఆలోచించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చకుంటే ఆమరణ నిరాహార దీక్షకైనా వెనుకడేది లేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ప్రజల పక్షాన పోరాడేందుకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ దీక్షకు ఖమ్మం ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై తమ మద్దతు పలికారు. -
గూడు కోసం ఎన్నాళ్లు ఎదురుచూడాలి?
-
పామాయిల్ ఫ్యాక్టరీ సందర్శించిన పొంగులేటి
అశ్వరావుపేట: ఖమ్మం జిల్లా అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని వైఎస్సార్సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం సందర్శించారు. రైతు పక్షాన నిలబడి పామాయిల్ రైతుల డిమాండ్లపై సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పామాయిల్ గెలల ధరల పెంపుపై కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌తో మాట్లాడుతానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
కేసీఆర్ పాలనలో ప్రజలు భయపడుతున్నారు
ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కారేపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన చూసి రాష్ట్ర ప్రజలు భయాందోళనలో ఉన్నారని ఖమ్మం ఎంపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పేరుపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ.. 60 ఏళ్ల తెలంగాణ కల సాకారమైనా..టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు దాటినా పాలనపై స్పష్టత లేదని, దీంతో ప్రజలకు ఏమీ అర్థం కావడం లేదని అన్నారు. అర్హులైన వారికి ఫించన్లు రాకపోవడంతో గుండె ఆగి చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇచ్చి ఆదుకున్నారని, ఎలాంటి కొర్రీలు లేకుండా రైతుల రుణాలు మాఫీ చేశారని, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా వైద్యం వంటి సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు. అయితే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ పూర్తిగా విస్మరించారని విమర్శించారు. రైతుల వద్ద పంట ఉత్పత్తులు ఉన్నప్పుడే గిట్టుబాటు ధర కల్పించాలని, పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేద దళితులకు మూడెకరాలు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం జిల్లాలో కేవలం 7 కుటుంబాలకే ఇచ్చిందని, ఇంకా వేల కుటుంబాలకు ఇవ్వాల్సి ఉండగా.. పలు సాకులు చూపి భూమి ఇవ్వకుండా దాట వేస్తోందని విమర్శించారు. నాగార్జున సాగర్ నీళ్లు రావడం ఆలస్యం కావడంతో..రైతులు నష్ట పోవాల్సి వచ్చిందని, రెండో పంట కన్నా షెడ్యూల్ ప్రకారం సాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీరు పింఛన్‌కు అర్హులు కారా..? వీరు పింఛన్లకు అర్హులు కాదా..? కళ్లు తెరిచి చూడండి.. ఇంత కంటే దౌర్భాగ్యం మరొకటి లేదు..అని పొంగులేటి ఆవే దన వ్యక్తం చేశారు. కారేపల్లి మండలం గుంపెళ్లగూడెం, పేరుపల్లి గ్రామాలలో పలువురు వృద్ధులు, వితంతువులు తమ పింఛన్ రద్దు చేశారని పొంగులేటి ఎదుట మొరపెట్టుకోగా ఆయన పై విధంగా స్పందించారు. ‘ఇదేనా మనం కన్న బంగారు తెలంగాణా..? వ్యక్తిగతంగా అర్హతను గుర్తించి వృద్దులకు, వికలాంగులకు, వితంతువులకు ఫించన్లు మంజూరు చేయాల్సింది పోయి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటరు కార్డుల్లో తప్పులు దొర్లాయని, వయస్సు తక్కువ పడిందని, ఇంటి పేరు, అసలు పేర్లు తప్పుగా ఉన్నాయని కుంటి సాకులతో రద్దు చేయడం సరైంది కాదు’ అన్నారు. తాను రాజకీయంగానో, ప్రతిపక్షంగానో మాట్లాడడం లేదని, ఈ వృద్ధులను చూసి బాధతో మాట్లాడుతున్నానని అన్నారు. ఈ విషయంలో పేదలకు అన్యాయం చేస్తే అన్ని పార్టీలను కలుపుకొని పోరాడుతామని, కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ వైరా నియోజకవర్గ ఇన్చార్జి బొర్రా రాజశేఖర్, ఎంపీపీ బాణోతు పద్మావతి, మండల అధ్యక్షుడు ఇమ్మడి తిరుపతిరావు, ఎంపీటీసీ ఆలోతు ఈశ్వరీనందరాజ్, నాయకులు గడ్డం వెంకటేశ్వర్లు, టి రాంబాబు, షేక్ సైదులు, వీరన్న, చిలక విజయ ఉన్నారు. -
గంగారం.. ఇక సింగారం
‘సంసద్ ఆదర్శ్’ కింద ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గంగారం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. దీంతో ఆ గ్రామ రూపురేఖలు మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులతో జిల్లా యంత్రాంగం సహాయంతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని, మోడల్ గ్రామంగా తీర్చి దిద్ది ప్రధాని నరేంద్రమోదీని తీసుకువస్తానని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో తాగునీరు, డ్రెయినేజీ, రోడ్ల ఏర్పాటుతో పాటు పచ్చదనంతో గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దేందుకు సర్పంచ్ అధ్యక్షతన తొమ్మిది మందితో అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేశారు. - సత్తుపల్లి సత్తుపల్లి మండల కేంద్రం తర్వాత గంగారం గ్రామం అతివేగంగా పట్టణీకరణ వైపు పరుగుతీస్తోంది. ఇప్పటికే అక్కడక సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల, దాసరి వీరారెడ్డి ప్రభుత్వ జిల్లా పరిషత్ హైస్కూల్, నాలుగు ప్రాథమిక పాఠశాలలు, సాయిస్ఫూర్తి డీఏవీ ఇంగ్లిష్ మీడియంలో స్కూల్‌తో విద్యారంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. గంగారం గుట్టపై 15వ గిరిజన బెటాలియన్‌ను కూడా ఏర్పాటు చేశారు. గ్రామ స్వరూపం.. : గంగారం గ్రామపంచాయతీలో రామగోవిందాపురం, మేడిశెట్టివారిపాలెం అవాస గ్రామాలుగా ఉన్నాయి. ప్రకాష్‌నగర్‌కాలనీ, పాత హరిజనవాడ, జలగంనగర్, ఎస్టీ కాలనీ, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలు ఉన్నాయి. పంచాయతీలో 14 వార్డులు ఉన్నాయి. జనాభా 5451, ఓటర్లు 3,378, బీసీలు 1790, ఎస్సీలు 700, ఎస్టీలు 550లు మంది ఉన్నారు. వందకుపైగా పూరిల్లు ఉన్నాయి. గ్రామంలో 800 ఎకరాల ఆయకట్టు ఉన్న చింతల చెరువు, వడ్లజగయ్యకుంట 20 ఎకరాలకు, రామగోవిందాపురం కుంట 30 ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. సహకారం అందిస్తున్న ‘తాన్ల’... అలాగే గ్రామాభివృద్ధికి తనవంతు సహాయం అందిస్తానని ‘తాన్ల’ సొల్యూషన్స్ అధినేత దాసరి ఉదయ్‌కుమార్‌రెడ్డి ముందుకు వచ్చారు. అందులో భాగంగా గ్రామంలోని సమస్యలను సంపూర్ణంగా తెలుసుకునేందుకు బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. ఐదేళ్ల క్రితం సుమారు రెండు కోట్ల రూపాయలతో బీటీరోడ్లు, డ్రైయిన్లు, రోడ్ల పక్కన పచ్చని మొక్కలు నాటారు. ఇంకా మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సమస్యలను కిందిస్థాయి నుంచి తెలుసుకునేందుకు 34 మంది తో ఇంటింటి సర్వే చేశారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తనవంతు సహకారం అందించి సొంత గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశలో పెట్టేందుకే తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సమస్యలపై దృష్టి సారించరూ.. : గ్రామంలో దీర్ఘకాలికంగా సర్వే నంబర్ 133 ఆన్లైన్ కాక పోవడంతో ఈ పహాణీలు రాక రైతులు రుణాలకు నోచుకోలేక పోతున్నారు. భూముల క్రయ విక్రయాలు నిలిచి పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల స్థలాల సమస్య తీవ్రంగా ఉంది. ఒకే ఇంట్లో మూడు నాలుగు కుటుంబాలు ఉంటున్నారు. గ్రామంలో సమీపంలోని 16 గ్రామాలకు మంచినీరు సరఫరా చేసే రామగోవిందాపురం ఫ్లోరైడ్ ప్రాజెక్టు ఉన్నా.. గ్రామంలోని జలగంనగర్, ఎస్టీ కాలనీ, గురుభట్లగూడెం రోడ్లలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఫ్లోరైడ్ రహితనీరు సరఫరా చేయాలంటూ ప్రజల నుంచి డిమాండ్ వస్తోంది. మరుగుదొడ్లు సరిపడా లేక బహిర్భూమికి వెళ్లాల్సి వస్తోంది. గ్రామంలో నిర్మల్ భారత్ అభియాన్కింద 150 మరుగుదొడ్లు మంజూరు కాగా వీటిలో 40 మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. హిందూ శ్మశాన వాటికలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఖననం చేసేందుకు, కాల్చటానికి కూడా స్థలం లేక దొంగచాటున చెరువు గట్టులపై అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ముస్లిం శ్మశానవాటిక ఆక్రమణకు గురైంది. ఎన్నిసార్లు అధికారులు వినతులు పంపించినా పట్టించుకోవటంలేదని ఫిర్యాదులు ఉన్నాయి. డంపింగ్‌యార్డు లేక స్టేట్‌హైవే పక్కనే చెత్తా చెదారాలు వేసి కాల్చుతున్నారు. గురుబట్లగూడెం రోడ్లో మంచినీటిబోరు వద్ద చికె న్ వ్యర్ధాలు వేయటం వలన దుర్వాసన వెదజల్లుతోంది. స్టేట్ హైవేతో సహా.. అంతర్గత రహదారులైన గంగారం-రామానగరం, గంగారం-గురుభట్లగూడెం, ప్రకాష్‌నగర్‌కాలనీ - రామగోవిందాపురం రోడ్ల పక్కన డ్రైయినేజీలు లేక పోవటం రోడ్లపై తిరిగే పరిస్థితి నెలకొంది. గంగారం-గురుభట్లగూడెం జంక్షన్ వద్ద గుంతలు ఏర్పడి మురుగునీరు నిలిచి ప్రజలపై పడుతోంది. ఇందిరమ్మ హౌసింగ్ కాలనీలో ఇళ్లు మంజూరులో జరిగిన అక్రమాలతో చాలా మంది నిరుపేదలకు పక్కా గృహాలు వచ్చే పరిస్థితి లేదు. సత్వరం విచారణ పూర్తి చేసే అర్హులైన లబ్ధిదారులకు పక్కాగృహాలు మంజూరు చేయాలని కోరుతున్నారు. సాయంత్రం వేళ్లల్లో ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులతో బస్‌స్టాప్ సెంటర్లో రద్దీ నెలకొంటోంది. ఆకతాయిల ఆగడాలు మితిమీరుతున్నాయి. ఈవ్‌టీజింగ్ అరికట్టాలని, మోటారు సైకిళ్ల వేగ నియంత్రణ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆటో స్టాండ్ లేకపోవటం వలన రోడ్డుపక్కనే నిలిపాల్సి రావటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. అభివృద్ధికి చిరునామాగా నిలుపుతా.. : ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజల కోసమే వినియోగిస్తున్నా.. సంసద్ ఆదర్శ కార్యక్రమంలో భాగంగా గంగారం గ్రామాన్ని అభివృద్ధికి చిరునామాగా నిలుపుతా. జిల్లా యంత్రాంగం, మంత్రులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతాను. ప్రధాన మంత్రి నరేంద్రమోడి మెచ్చుకునే వవిధంగగా గంగారం గ్రామాన్ని దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ చాలా అదృష్టంగా భావిస్తున్నా.. : ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గంగారం గ్రామాన్ని దతత్త తీసుకోవటంతో చాలా అదృష్టంగా భావిస్తున్నా.. గ్రామ పెద్దల సహకారంతో అభివృద్ధివైపు పరుగులు పెడుతుంది. అన్ని మౌళిక సౌకర్యాలు కల్పించేందుకు ననా వంతు ప్రయత్నం చేస్తా. -కోటమర్తి రమేష్, సర్పంచ్, గంగారం -
తెలంగాణ వచ్చాక 350 మంది రైతులు మృతి
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 350 మంది రైతులు చనిపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం లోక్‌సభలో వెల్లడించారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. వీటికి తోడు తీవ్రమైన కరెంట్ కోతలు, కరువుతో రైతులు చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అప్పులు భారమై ప్రాణాలు తీసుకుంటున్నారని చెప్పారు. ఓ వేళ పంటలు పండినా మద్దతు ధర మాత్రం లభించడం లేదన్నారు. రైతులు ఆత్మహత్యలు నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అగ్రికల్చర్ ఎమర్జెన్సీ ప్రకటించి తెలంగాణ రైతులను ఆదుకోవాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రానికి సూచించారు. -
విఐపి రిపోర్టర్ - పొంగులేటి శ్రీనివాసరెడ్డి
-
నిర్లక్ష్యాన్ని సహించం
ఖమ్మం జెడ్పీసెంటర్: పేదలకు ప్రభుత్వ ఫలాలు అందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. అధికారులు మొక్కుబడిగా సమావేశాలకు హాజరుకాకుండా యథార్థ నివేదికలతో రావాలని విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ హోదాలో సమావేశానికి హాజరైన ఎంపీ కోరారు. జడ్పీ సమావేశ మందిరంలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం చైర్మన్, ఎంపీ శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఆదివారం జరిగింది. తొలి విజిలెన్స్ కమిటీ సమావేశం సంతృప్తికరంగా లేదన్నారు. మొక్కుబడి నివేదికలతో అధికారులు హాజరుకావటం సరికాదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేలా ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు..దానికి అధికారులు సహకరించాలని కోరారు. ప్రతి మూడునెలల కోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు. ఒకటి, రెండు పేజీల నివేదికలతో కాకుండా సమగ్ర సమాచారంతో రావాలన్నారు. తదుపరి సమావేశంలో పూర్తిస్థాయి సమీక్ష చేస్తామన్నారు. రెండునెలలకోసారి క్షేత్రపర్యటన చేసి అభివృద్ధిని పర్యవేక్షిస్తామన్నారు. ఒకటి, రెండుసార్లు మాత్రమే హెచ్చరిస్తాం..మూడోసారి సంబంధిత శాఖలకు సిఫారసు చేసి చర్యలు చేపడతామన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వ్యవహరించి అభివృద్ధికి పాటుపడాలనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ మీదే ఎక్కువసేపు చర్చ జరిగిందన్నారు. సమీక్ష తీరు ఇలా.. జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైంది. తొలుత కలెక్టర్ కమిటీ సమావేశం నిర్వహణ తీరును వివరించారు. అనంతరం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జోక్యం చేసుకుని తనకు ఎజెండా కాపీ అందలేదన్నారు. గతంలో హైదరాబాద్‌లో ఉంటే అక్కడికి పంపించేవారని, ఇప్పుడలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. సమాచార పుస్తకం పంపామని డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్‌నాయక్ సమాధానం ఇచ్చారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నారు..కాబట్టి వారికి ఏజెండా కాపీ అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని ఎంపీ పొంగులేటి సూచించారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను సంబంధిత అధికారులు వివరించారు. నిర్మల్ భారత్ అభియాన్ కింద 1.77 లక్షల మరుగుదొడ్లు నిర్మించడం లక్ష్యంకాగా 50వేల వరకు నిర్మించామన్నారు. ఈ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారుల లోపం ఉందని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఆరోపించారు. మరుగుదొడ్ల నిర్మా ణ వ్యయాన్ని రూ.10,900 నుంచి రూ.20వేలకు పెంచేలా తీర్మానం చేసి, ప్రతిపాదనలు పంపాలని ఎంపీ పొంగులేటి సూచించారు. ఉపాధి హామీ పనుల నిబంధనలు ఎలా ఉన్నాయి, గ్రామ సభలు ఏర్పాటు చేసి తీర్మానం చేస్తున్నారా? అని ఎంపీ ప్రశ్నించారు. లేబర్ బడ్జెట్ ఏర్పాటు చేసి వంద రోజుల పని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పీడీ వివరించారు. ఏపీవో, ఫీల్డ్ అసిస్టెంట్లు దీనిలో పరిమితికి మించి జోక్యం చేసుకుంటున్నారని కలెక్టర్ అన్నారు. వీరిని తొలగించి నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తామన్నారు. ఉపాధిహామీలో తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, చండ్రుగొండ, కల్లూరులో అవినీతి జరిగినట్లు తన దృష్టికి వచ్చిందని, అక్రమాలకు పాల్పడిన వారిని తొలగించాలని కోరారు. చండ్రుగొండ మండలం రావికంపాడులో వందశాతం మరుగుదొడ్లు నిర్మించినట్లు నివేదికలు ఇచ్చారు. ఆ ఊరికి బహుమతి కూడా అందజేశారు. కానీ అక్కడ ఒక్క మరుగుదొడ్డి కూడా నిర్మించలేదు..దీనిపై విచారణ చేపట్టాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కోరారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. వేంసూరులో కోటి రూపాయల స్కాం జరిగిందని ఎంపీడీవోను సస్పెండ్ చేశారు. నగదు రికవరీ అయిందా? లేదా? అని ఎమ్మెల్యే పాయం ప్రశ్నించారు. ఇందిర జలప్రభ పనులు పదిశాతం కూడా పూర్తికాలేదన్నారు. శాఖల మధ్య సమన్వయం లేదు. ట్రాన్స్‌కో అధికారులు ఎక్కడ అని మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ ప్రశ్నించారు. ఎంపీలు సమావేశానికి వస్తే ఎస్ఈ స్థాయి అధికారి సమావేశానికి రాలేడా? అన్ని ప్రశ్నించారు. నీటిపారుదలశాఖ మొత్తం 300 పథకాలు నిర్వహిస్తుంటే వాటిలో 200 మూలకుపడ్డాయంటే ఆ శాఖ పనితీరు ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందని ఎంపీ పొంగులేటి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వేలేరుపాడు మండలంలో ఇందిరమ్మ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని ఎవరు ఇస్తారని ఎమ్మెల్యే తాటి ప్రశ్నించారు. ఆ బిల్లులను చంద్రబాబు ఇస్తారని ఎంపీ నాయక్ సమాధానం ఇచ్చారు. పెండింగ్ బిల్లులు చెల్లించేలా తీర్మానం చేస్తున్నట్లు పొంగులేటి ప్రకటించారు. చివరిలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే జ్యేష్ట వెంకటేశ్వరరావు మృతికి సమావేశం మౌనం పాటించింది. శాసన సభ్యుల డుమ్మా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జిల్లాలో మొదటి సారిగా జరిగిన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి సత్తుపల్లి, పాలేరు, మధిర, ఖమ్మం, భద్రాచలం, ఇల్లెందు, కొత్తగూడెం శాసన సభ్యులు గైర్హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలు గ్రామస్థాయిలో అమలవుతున్న తీరుపై నిర్వహించిన సమావేశానికి వారు హాజరుకాకపోవడం విమర్శలకు తావిచ్చింది. -
నేటి నుంచి జిల్లాలో ఎంపీ పొంగులేటి పర్యటన
సాక్షి, ఖమ్మం : ఖమ్మం ఎంపీ, వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. ఈమేరకు జిల్లా పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆదివారం ఉదయం 11 గంటలకు పెనుబల్లిలో సాయిరాం హాస్పిటల్‌ను ఎంపీ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3గంటలకు ముదిగొండ మండలం పెద్దమండవ గ్రామంలో పాఠశాల భవనానికి శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5 గంటలకు సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగే ఇంటర్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరవుతారు. రాత్రి 7గంటలకు వైరా మండలంలోని కామిశెట్టి కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్రస్థాయి రంగస్థల నాటకోత్సవాల బహుమతుల ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు చండ్రుగొండ మండలంలోని మద్దుకూరు వద్ద రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. 10 గంటలకు కొత్తగూడెంలో క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో జరిగే అధికారుల సమీక్ష సమావేశానికి హాజరవుతారు. సాయంత్రం 6 గంటలకు నగరంలోని 32వ డివిజన్లో మినీవాటర్ స్కీమ్ ఫౌండేషన్ స్టోర్‌ను ఆయన ప్రారంభిస్తారు. -
సమస్యలపై ఉద్యమిద్దాం
సాక్షి, హైదరాబాద్: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం ఉద్యమించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం వైఎస్సార్ సీపీ జిల్లా సమీక్ష సమావేశంలో హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకోసం పార్టీ కార్యకర్తలంతా పనిచేయాలని అన్నారు. వైఎస్సార్ మెతుకుసీమపై ప్రత్యేక మమకారం చూపేవారన్నారు. సింగూరు జలాలు ఇపుడు సాగుకు అందుతున్నాయంటే అది కేవలం వైఎస్సార్ కృషి వల్లే సాధ్యమైందన్నారు. అందువల్లే మెతుకుసీమ ప్రజలు కూడా వైఎస్సార్‌ను, ఆయన పేరుతో స్థాపించిన వైఎస్సార్ సీపీని ఆదరిస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో మెదక్ జిల్లాకు చెందిన చాలా మంది తమ సొంత డబ్బులు వెచ్చించి వైఎస్సార్ సీపీని బలోపేతం చేసేందుకు కృషి చేశారని, వారి రుణం ఏమిచ్చినా తీర్చుకోలేమన్నారు. వారి శ్రమ వృథా కాకుండా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కార్యకర్తలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పనిచేసే కార్యకర్తలకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని, వారి శ్రమకు తగ్గట్టుగానే పార్టీలో హోదా దక్కేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. కథలు చెప్పే వారిని దూరంగా ఉంచడం, కహానీలు చెప్పేవారిని పార్టీ నుంచి సాగనంపడం జరుగుతుందన్నారు. కార్యకర్తలు, ప్రజల కష్టాలు వినేందుకు పార్టీ కే ంద్ర కార్యాలయం కేంద్రంగా ఒక కమిటీ వేస్తామన్నారు. కమిటీ సభ్యులు అందరి సాధకబాధలు విని వాటి పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. వైఎస్సార్ విగ్రహావిష్కరణలు, విగ్రహాల ఏర్పాటు గురించి కూడా ఒక కమిటీ వేస్తానని పేర్కొన్నారు. సెంటిమెంట్‌ను ఉద్యమంగా మలిచి అధికారం దక్కించుకున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్నీ నెరవేర్చ లేకపోయారన్నారు. ప్రజల తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉందన్నారు. అయితే నిర్మాణం లేకుండా పోరాటాలు చేయడం సరైంది కాదనీ, అందువల్ల కొంత సమయం తీసుకుని ప్రజా సమస్యలపై ఉద్యమిద్దామన్నారు. అందరం సమష్టిగా పనిచేసి 2019 నాటికి రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ జెండాను రెపరెపలాడిద్దామన్నారు. పార్టీ నిర్మాణం పూర్తి అయిన తర్వాత వ్యూహాత్మకంగా ఒక ప్రణాళికతో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిలతో రాష్ట్రంలో పాదయాత్ర లాంటి ఒక మహోత్తర కార్యక్రమం చేయదలిచామన్నారు. త్వరలోనే దానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. అనంతరం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్, గట్టు రామచంద్రరావు, నల్లా సూర్యప్రకాష్, గట్టు శ్రీకాంత్ రెడ్డిలు మాట్లాడుతూ, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందన్నారు. అందుకు తమవంతు అండ, సాయం తప్పకుండా ఉంటుందన్నారు. పార్టీని ఆదరించేవారు తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఉన్నారన్నారు. అందువల్ల త్వరలోనే వైఎస్సార్ సీపీ తెలంగాణలో బలమైన శక్తిగా ఎదుగుతుందన్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి జిల్లాలోని ప్రతి ఇంటికీ, ప్రతి గడపకూ తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. అనంతరం ప్రభుగౌడ్ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు క్రీస్తుదాసు, జగదీశ్వర్ గుప్త, బస్వానందం, సంజీవరావు, శ్రావణ్‌కుమార్ గుప్త, భిక్షపతి, బాలకృష్ణారెడ్డి, మల్లయ్య, రవి, ఎస్ఎస్ పాటిల్, సుధాకర్‌గౌడ్, జగదీశ్, సంజీవరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, నారాయణ, రాంరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జనం గుండెల్లో వైఎస్ఆర్
వేంసూరు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఇంకా జనంగుండెల్లో ఉన్నాయని, అందుకే సొంత ఖర్చుతో ప్రజలు ఆయన విగ్రహాలను ఏర్పా టు చేస్తున్నారని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని యర్రగుంటపాడులో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని సోమవారం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్సీపీ సత్తుపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మట్టా దయానంద్ విజయ్‌కుమార్‌లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గోదావరి వరద బాధితులకు వెంటనే నష్ట పరిహారం అందించారని, కానీ ప్రస్తుతం బాధితులు వరద సాయం కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని అన్నారు. తొలుత యర్రగుంటపాడు ఎంపీటీసీ ఒం గురు లక్ష్మి దంపతులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మట్టా దయానంద్‌లను సన్మానించారు. అనంతరం దేశిరెడ్డి మాధవరెడ్డి నివాసంలో ఎంపీ పొంగులేటిని, దయానంద్‌లను సన్మానించారు. కార్యక్రమం లో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ అట్లూరి సత్యనారాయణరెడ్డి, రావి సత్యనారాయణ, తుమ్మురు రంగరెడ్డి, దేశిరెడ్డి మాధవరెడ్డి, గడ్డ రామకృష్ణరెడ్డి, తుమ్మరు శ్రీనివాసరెడ్డి, గోగులముడి రామచంద్రరెడ్డి, గాదె శ్రీనివాసరావు, గడిపర్తి శ్రీనివాసరావు, గొర్ల ప్రభాకర్‌రెడ్డి, దొడ్డ చెన్నకేశవరెడ్డి, చీపు కృష్ణ, గాయం రాం బాబు, భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, భీమిరెడ్డి చెన్నకేశవరెడ్డి, అల్లం చిన్నబ్బాయి పాల్గొన్నారు. -
నేడు జిల్లాకు ఎంపీ పొంగులేటి
ఖమ్మం హవేలి, : ఖమ్మం ఎంపీగా పార్లమెంటులో ప్రమాణస్వీకారం చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం జిల్లాకు రానున్నారు. కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద పొంగులేటికి ఘనస్వాగతం పలికేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు సన్నద్ధం అయ్యాయి. నాయకన్‌గూడెం నుంచి పాలేరు, కూసుమంచి, తల్లంపాడు, వరంగల్ క్రాస్‌రోడ్, కాల్వొడ్డు, మయూరిసెంటర్, జెడ్పీసెంటర్, ఇల్లెందు క్రాస్‌రోడ్, రోటరీనగర్ల మీదుగా భారీ ప్రదర్శనగా పొంగులేటి జిల్లా కార్యాలయానికి చేరుకోనున్నారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి శ్రేణులు తరలివచ్చి శీనన్నకు ఘనంగా స్వాగతం పలకాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.