సమస్యలపై ఉద్యమిద్దాం
సాక్షి, హైదరాబాద్: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం ఉద్యమించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం వైఎస్సార్ సీపీ జిల్లా సమీక్ష సమావేశంలో హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకోసం పార్టీ కార్యకర్తలంతా పనిచేయాలని అన్నారు. వైఎస్సార్ మెతుకుసీమపై ప్రత్యేక మమకారం చూపేవారన్నారు. సింగూరు జలాలు ఇపుడు సాగుకు అందుతున్నాయంటే అది కేవలం వైఎస్సార్ కృషి వల్లే సాధ్యమైందన్నారు.
అందువల్లే మెతుకుసీమ ప్రజలు కూడా వైఎస్సార్‌ను, ఆయన పేరుతో స్థాపించిన వైఎస్సార్ సీపీని ఆదరిస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో మెదక్ జిల్లాకు చెందిన చాలా మంది తమ సొంత డబ్బులు వెచ్చించి వైఎస్సార్ సీపీని బలోపేతం చేసేందుకు కృషి చేశారని, వారి రుణం ఏమిచ్చినా తీర్చుకోలేమన్నారు. వారి శ్రమ వృథా కాకుండా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కార్యకర్తలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పనిచేసే కార్యకర్తలకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని, వారి శ్రమకు తగ్గట్టుగానే పార్టీలో హోదా దక్కేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. కథలు చెప్పే వారిని దూరంగా ఉంచడం, కహానీలు చెప్పేవారిని పార్టీ నుంచి సాగనంపడం జరుగుతుందన్నారు. కార్యకర్తలు, ప్రజల కష్టాలు వినేందుకు పార్టీ కే ంద్ర కార్యాలయం కేంద్రంగా ఒక కమిటీ వేస్తామన్నారు. కమిటీ సభ్యులు అందరి సాధకబాధలు విని వాటి పరిష్కారానికి కృషి చేస్తారన్నారు.
వైఎస్సార్ విగ్రహావిష్కరణలు, విగ్రహాల ఏర్పాటు గురించి కూడా ఒక కమిటీ వేస్తానని పేర్కొన్నారు. సెంటిమెంట్‌ను ఉద్యమంగా మలిచి అధికారం దక్కించుకున్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్నీ నెరవేర్చ లేకపోయారన్నారు. ప్రజల తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉందన్నారు. అయితే నిర్మాణం లేకుండా పోరాటాలు చేయడం సరైంది కాదనీ, అందువల్ల కొంత సమయం తీసుకుని ప్రజా సమస్యలపై ఉద్యమిద్దామన్నారు. అందరం సమష్టిగా పనిచేసి 2019 నాటికి రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ జెండాను రెపరెపలాడిద్దామన్నారు. పార్టీ నిర్మాణం పూర్తి అయిన తర్వాత వ్యూహాత్మకంగా ఒక ప్రణాళికతో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిలతో రాష్ట్రంలో పాదయాత్ర లాంటి ఒక మహోత్తర కార్యక్రమం చేయదలిచామన్నారు.
త్వరలోనే దానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. అనంతరం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్, గట్టు రామచంద్రరావు, నల్లా సూర్యప్రకాష్, గట్టు శ్రీకాంత్ రెడ్డిలు మాట్లాడుతూ, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందన్నారు. అందుకు తమవంతు అండ, సాయం తప్పకుండా ఉంటుందన్నారు. పార్టీని ఆదరించేవారు తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఉన్నారన్నారు. అందువల్ల త్వరలోనే వైఎస్సార్ సీపీ తెలంగాణలో బలమైన శక్తిగా ఎదుగుతుందన్నారు.
అనంతరం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి జిల్లాలోని ప్రతి ఇంటికీ, ప్రతి గడపకూ తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. అనంతరం ప్రభుగౌడ్ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు క్రీస్తుదాసు, జగదీశ్వర్ గుప్త, బస్వానందం, సంజీవరావు, శ్రావణ్‌కుమార్ గుప్త, భిక్షపతి, బాలకృష్ణారెడ్డి, మల్లయ్య, రవి, ఎస్‌ఎస్ పాటిల్, సుధాకర్‌గౌడ్, జగదీశ్, సంజీవరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, నారాయణ, రాంరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.