తెలంగాణ వచ్చాక 350 మంది రైతులు మృతి
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 350 మంది రైతులు చనిపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం లోక్సభలో వెల్లడించారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. వీటికి తోడు తీవ్రమైన కరెంట్ కోతలు, కరువుతో రైతులు చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అప్పులు భారమై ప్రాణాలు తీసుకుంటున్నారని చెప్పారు.
ఓ వేళ పంటలు పండినా మద్దతు ధర మాత్రం లభించడం లేదన్నారు. రైతులు ఆత్మహత్యలు నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అగ్రికల్చర్ ఎమర్జెన్సీ ప్రకటించి తెలంగాణ రైతులను ఆదుకోవాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రానికి సూచించారు.