గూడు కోసం ఎన్నాళ్లు ఎదురుచూడాలి?
ఖమ్మం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చాలని కోరుతూ తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెండురోజుల నిరశన దీక్షను సోమవారం ప్రారంభించారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారం చేపట్టి 16 నెలలు దాటినా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో నియోజకవర్గానికి 400 మందికి మాత్రమే డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయిస్తే.. ఎన్ని ఏళ్ల పాటు పేదలు గూడు కోసం ఎదురుచూడాలని పొంగులేటి ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికీ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే 4,600 మంది పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారని, ఆ తరువాత వచ్చిన ఏ ప్రభుత్వాలూ పేదల గురించి ఆలోచించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చకుంటే ఆమరణ నిరాహార దీక్షకైనా వెనుకడేది లేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ప్రజల పక్షాన పోరాడేందుకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ దీక్షకు ఖమ్మం ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై తమ మద్దతు పలికారు.