దమ్ముంటే ఉప ఎన్నికలు జరపండి
- కేసీఆర్‌కు వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి సవాల్
- ఖమ్మంలో టీఆర్‌ఎస్ గెలిస్తే తెలంగాణ వైఎస్సార్‌సీపీని ఆ పార్టీలో కలిపేస్తాం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘ముఖ్యమంత్రి కేసీఆర్.. మీకు మెజార్టీ ఉన్నా ప్రతిపక్షాల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే ఉండకూడదని ప్రలోభాలు పెట్టి మరీ వారిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారు. మీకు చిత్తశుద్ధి, దమ్ము, ధైర్యం ఉంటే ఇలా మీ పార్టీలో చేర్చుకున్న తొమ్మిది మంది ఎమ్మెల్యేల స్థానాల్లో ఉప ఎన్నికలు పెట్టండి.. ఖమ్మం జిల్లాలోని వైరా, అశ్వారావుపేట స్థానాలు మీరు గెలిస్తే రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని టీఆర్‌ఎస్‌లో కలిపేస్తాం’.. అని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సవాల్ విసిరారు.
ఖమ్మంలోని ఎస్‌ఆర్ గార్డెన్స్‌లో శుక్రవారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నమ్ముకున్న కార్యకర్తలను నట్టేట ముంచి అధికారదాహంతో వైఎస్సార్‌సీపీని వీడిన ప్రజాప్రతినిధులకు ప్రజాకోర్టులో తగిన గుణపాఠం తప్పదని పొంగులేటి హెచ్చరించారు. వ్యక్తిగత లాభం, స్వార్థపూరితంగానే పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారని, వారు వెళ్లినంత మాత్రాన రాష్ట్రంలోగానీ, జిల్లాలోగానీ నేతలు, కార్యకర్తలు ఈసమెత్తయినా మనోస్థైర్యం కోల్పోలేదన్నారు.
ఎవరో కొందరు వ్యక్తులకో.. అధికారంలో ఉన్న నేతలకో గులాం గిరి చేయాల్సిన అవసరం వైఎస్సార్‌సీపీకి లేదన్నారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉంటామని... కానీ అధికారంలో ఉన్నామని అరాచక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం తగదని హితవు పలికారు. ప్రజల్లో వైఎస్సార్‌సీపీపై ఉన్న ప్రేమ, అభిమానాన్ని ఎవరూ దోచుకోలేరన్నారు. దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి నాడు ఎలాంటి నిబంధనలు లేకుండా రైతులకు రుణమాఫీ చేస్తే.. నేడు రూ.లక్ష రుణమాఫీ అని చెప్పి.. నేటికీ ఏ ఒక్క రైతుకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకపోవడం దారుణమన్నారు.
కార్యకర్తల కోసం రూ. 50 లక్షలతో నిధి
ఖమ్మం జిల్లాలో పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలు చాలామంది ఉన్నారని పొంగులేటి పేర్కొన్నారు. వారి కుటుంబాలకు వైద్యం, పిల్లల చదువులు, ఇతరత్రా ఖర్చుల నిమిత్తం ఏటా రూ.50 లక్షలు కేటాయించనున్నట్లు ఆయన ప్రకటించారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటుతాం..
రానున్న జీహెచ్‌ఎంసీ, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతామని ఎంపీ పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పార్టీ తరఫున అభ్యర్థులను రంగంలోకి దించుతామని చెప్పారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా దయానంద్ విజయ్‌కుమార్, అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, కార్యదర్శి ఐలూరి వెంకటేశ్వరరెడ్డి, ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మెండెం జయరాజు, రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శి షర్మిలా సంపత్, నేతలు కూరాకుల నాగభూషణం, సాధు రమేష్‌రెడ్డి, గుగులోతు రవిబాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు.