మీడియా సమావేశంలో ఎంపీలు వద్దిరాజు, సురేశ్‌రెడ్డి, నామా, శ్రీనివాస్‌రెడ్డి
మాట వినని వారిని లొంగదీసుకునేందుకు సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు
ఎన్‌డీఏ పదేళ్ల పాలనలో దేశవ్యాప్తంగా 2,954 దాడులు
ఢిల్లీలో బీఆర్‌ఎస్ ఎంపీలు నామా, సురేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వద్దిరాజు
సాక్షి, న్యూఢిల్లీ: ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలతో దాడులు చేయిస్తూ ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రాంతీయ పార్టీలను, నేతల్ని లొంగదీసుకునే రాజకీయాలు చేస్తోందని బీఆర్‌ఎస్ ఎంపీలు ఆరోపించారు. దేశంలో జరుగుతున్న దాడులను ప్రజలంతా గమనిస్తున్నారని, త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
గత యూపీఏ హయాంలో కంటే ఎక్కువ దాడులు ప్రస్తుత ఎన్‌డీఏ హయాంలో జరిగాయని ఎంపీలు నామా నాగేశ్వరరావు, కేఆర్ సురేశ్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్రలు చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న పాలసీలో అవినీతి జరిగిందని, ఆధారాల్లేకుండా ఎమ్మెల్సీ కవితను రాత్రికి రాత్రి అరెస్టు చేయడం అప్రజాస్వామికమని నామా నాగేశ్వరరావు అన్నారు. ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచేందుకే కవిత అరెస్టు చేశారని ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన లిక్కర్ పాలసీ లాంటి ఎన్నో పాలసీలను కేంద్ర ప్రభుత్వం సైతం ప్రవేశపెట్టిందన్నారు.
ఎన్‌డీఏ హయాంలో 2,954 దాడులు
టీవీ సీరియల్ మాదిరిగా సాగదీసిన కేసులో ఎన్నికలు వచ్చేసరికి ఈడీ హుటాహుటిన కవితను అరెస్టు చేయడం ఎంత అక్రమమో తెలుస్తోందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. యూపీఏ çపదేళ్ల కాలంలో ఈడీ 200 కేసులు నమోదు చేస్తే.. ఎన్‌డీఏ పాలనలో 2,954 కేసులు బనాయించిందని ఆరోపించారు. ఇలా సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలతో దాడులు చేయిస్తూ నేతలను బెదిరింపులకు గురిచేస్తూ లొంగదీసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. లిక్కర్ కేసులో కవిత బాధితురాలే తప్ప.. బాధ్యురాలు, నిందితురాలు కాదన్నారు.
ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రంలో దాడులు చేయించడం బీజేపీకి పరిపాటిగా మారిందని ఎంపీ సురేశ్ రెడ్డి అన్నారు. కవితకు డబ్బు ముట్టినట్లుగా గానీ, ఆమె ఇచ్చిన ట్లుగా గానీ ఎక్కడా ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఓ పక్క శక్తి అంటూ మాట్లాడుతున్న ప్రధాని మోదీ మహిళలపై దాడులు చేయించడం ఎంతవరకు సమంజసమంటూ ప్రశ్నించారు. మోదీ తెలంగాణ, ఢిల్లీపై దాడి చేయిస్తూ ఇటు కవితను, అటు కేజ్రీవాల్‌ను దొంగల్లా అరెస్టు చేయించారని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. న్యాయ స్థానాలపై తమకు నమ్మకం ఉందని ఈ వ్యవహారంపై ఎందాకైనా పోరాడతామన్నారు. కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఎంపీలు ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment