బీజేపీ పోటీ చేసిన 17 సీట్లలో 9 మంది బీఆర్‌ఎస్,కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్లే
వీరిలో ఆదిలాబాద్ నుంచి గోడం నగేష్ ఒక్కరే విజయం
గెలిచిన 8 మంది ఎంపీల్లో ఈటల, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ కొన్నేళ్ల కిందటే పార్టీలోకి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీచేసిన ‘వలస’ నేతల్లో ఒకే ఒక్కరే విజయతీరానికి చేరుకుని సత్తా చాటారు. మొత్తం 17 ఎంపీ సీట్లలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నుంచి సరిగ్గా ఎన్నికలకు ముందు పార్టీలో చేరి బీజేపీ టికెట్ తెచ్చుకున్నవారు లేదా పార్టీకి ప్రత్యక్షంగా సంబంధం లేని వారు మొత్తంగా 9 మంది పోటీచేశారు. ఈ వలస నేతల్లో బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన మాజీ ఎంపీ గోడం నగేష్.. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన ఆదిలాబాద్ నుంచే గెలుపొందారు. మిగతా ఎనిమిది మంది పరాజయం పాలయ్యారు.
జహీరాబాద్ నుంచి బీఆర్‌ఎస్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్‌కర్నూల్ నుంచి బీఆర్‌ఎస్ ఎంపీ పి.రాములు (ఆయన తన కుమారుడు భరత్ ప్రసాద్‌కు టికెట్ ఇప్పించుకున్నారు), మహబూబాబాద్ నుంచి బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ డా.సీతారాంనాయక్, వరంగల్ నుంచి బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేశ్, నల్లగొండ నుంచి బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, పెద్దపల్లి నుంచి కాంగ్రెస్‌నేత గోమాస శ్రీనివాస్, ఖమ్మం నుంచి సంఘ్‌పరివార్ క్షేత్రాల్లో పనిచేస్తూ గుర్తింపు పొందిన తాండ్ర వినోద్‌రావు, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన మాధవీలత (సంఘపరివార్‌తో ఉన్న సంబంధాలు కలిసిరాగా, టికెట్ వచ్చే నాటికి బీజేపీ సభ్యత్వం లేకపోయినా ఆమెకు సీటు) వలసనేతల జాబితా కోవలోకి వస్తారు.
గెలిచిన 8 ఎంపీల విషయానికొస్తే...
ప్రస్తుతం బీజేపీ గెలిచిన 8 సీట్లలో సిట్టింగ్ ఎంపీలు జి.కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్), బండి సంజయ్ (కరీంనగర్), అర్వింద్ ధర్మపురి (నిజామాబాద్), గోడం నగేశ్ (ఆదిలాబాద్–బీఆర్‌ఎస్ నుంచి ఎన్నికలకు ముందు బీజేపీలో, చేరారు), ఈటల రాజేందర్ (మల్కాజిగిరి), డీకే అరుణ (మహబూబ్‌నగర్), ఎం.రఘునందన్‌రావు (మెదక్), కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (చేవెళ్ల) ఉన్నారు. వీరిలో అర్వింద్ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందుగానే బీజేపీలో చేరి ఆ ఎన్నికల్లో నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితపై సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నారు.
మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ గత లోక్‌సభ ఎన్నికల్లోనే బీజేపీ టికెట్‌పై పోటీచేసినా, ఆమె ఎక్కువకాలం కాంగ్రెస్‌లో కొనసాగినందున కొత్తగా కమలం గుర్తుతో ఆమెను ఓటర్లు గుర్తించలేదు. దాంతో ఆమె బీజేపీ టికెట్‌పై మళ్లీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటి తొలిసారి పార్లమెంట్‌లోకి అడుగు పెడుతున్నారు. మెదక్ నుంచి ఎంపీగా గెలిచిన రఘునందన్‌రావు బీజేపీలో చేరి పదేళ్లకు పైగానే కాగా, 2018–23 మధ్యలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలుపొందారు. 2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచే ఓటమిపాలయ్యారు.
ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి గెలిచి తొలిసారి ఎంపీ అయ్యారు. ఇక కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విషయానికొస్తే...2014 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎంపీగా గెలిచారు. 2019లో చేవెళ్ల నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడారు. ఆ తర్వాత బీజేపీలో చేరి మళ్లీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడి నుంచే ఆ పార్టీ టికెట్‌పై ఎంపీగా విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌లో నెంబర్–టుగా ప్రాధాన్యత గల నేతగా గుర్తింపు పొందిన ఈటల రాజేందర్ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురయ్యాక బీజేపీలో చేరారు. ఎమ్మెల్యేగా రాజీనామాతో వచ్చిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుపొంది సంచలనం సృష్టించారు.
ఐతే 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మళ్లీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ పై మల్కాజిగిరి నుంచి భారీ మెజారిటీతో గెలిచి తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే...బీజేపీలోనే పుట్టి పెరిగి ఒరిజనల్, పక్కా కమలనాథులుగా ఉంటూ ఎంపీలుగా గెలిచిన వారు మాత్రం కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాత్రమేనని పాతతరం పార్టీ నాయకులు పేర్కొంటుండడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment