20 ఏళ్ల తర్వాత తొలిసారి | Brs Party did not win a single seat in the elections | Sakshi
Sakshi News home page

20 ఏళ్ల తర్వాత తొలిసారి

Published Wed, Jun 5 2024 5:38 AM | Last Updated on Wed, Jun 5 2024 8:44 AM

Brs Party did not win a single seat in the elections

లోక్‌సభలో బీఆర్‌ఎస్‌కు దక్కని ప్రాతినిధ్యం

ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవని గులాబీ పార్టీ

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో భారత్‌ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్నడూ లేని రీతిలో  పరాజయాన్ని చవి చూసింది. రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాల్లోనూ ఓటమి పాలయ్యింది. 2004 లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా బరిలోకి దిగిన బీఆర్‌ఎస్‌ సరిగ్గా 20 ఏళ్ల తర్వాత లోక్‌సభలో ప్రాతినిధ్యాన్ని కోల్పోయింది. 2004 ఎన్నికల్లో (14వ లోక్‌సభ) ఐదు, 2009లో 2, 2014లో 11, 2019లో 9 స్థానాలు సాధించింది. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌.. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో రెండంకెల స్థానాలు సాధించడం లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డింది. 

కానీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేక పోయింది. చివరకు పార్టీకి పట్టు ఉన్న మెదక్‌ సెగ్మెంటు సహా గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యాన్ని సాధించిన మరో ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో సైతం పార్టీ అభ్యర్థులు ప్రభావం చూపలేకపోయారు. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బస్సుయాత్రతో 13 లోక్‌సభ సెగ్మెంట్లను చుట్టి వచ్చినా ఫలితం లేకుండా పోయింది. 

స్టార్‌ క్యాంపెయినర్లుగా ప్రచారంలో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు సుడిగాలి ప్రచారం చేసినా ఎన్నికల ఫలితాలు పూర్తిగా నిరాశకే గురి చేశాయి.  మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కూడా పార్టీ పరాజయం పాలైంది. 
 


అసెంబ్లీ ఫలితాలతో అప్రమత్తమైనా..
గత ఏడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దృష్టిలో పెట్టుకుని జనవరి మొదటి వారం నుంచే ఓటమిపై సమీక్ష పేరిట లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ సన్నద్ధతను ప్రారంభించింది. కేటీఆర్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశాల్లో కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. మరోవైపు కేఆర్‌ఎంబీకి కృష్ణా జలాల అప్పగింతను నిరసిస్తూ నల్లగొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు.. కేసీఆర్‌ ఊతకర్ర సాయంతో (కేసీఆర్‌ ఇంట్లో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే) హాజరయ్యారు. ఎండిన పంట పొలాల పరిశీలనకు పొలం బాట పేరిట ఉమ్మడి నల్లగొండ, వరంగల్, కరీంనగర్‌ జిల్లాల్లో బస్సుయాత్ర చేశారు. 

మరోవైపు ‘చలో మేడిగడ్డ’ పేరిట కేటీఆర్, హరీశ్‌ల నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ కీలకనేతలందరూ ప్రాజెక్టును సందర్శించారు. పార్టీ కేడర్‌లో స్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. మార్చి మొదటి వారం నుంచే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై కేసీఆర్‌ దృష్టి పెట్టారు. అదే సమయంలో ఎన్నికల సన్నద్ధతను వేగవంతం చేసేందుకు మార్చి 12న ‘కరీంనగర్‌ కదనభేరి’ సభను నిర్వహించారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయంలో చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

సిట్టింగ్‌ ఎంపీలు పార్టీకి దూరం
లోక్‌సభ ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్, కేటీఆర్‌ సెగ్మెంట్ల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలోనే పలువురు బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీలు పార్టీని వీడి కాంగ్రెస్‌ లేదా బీజేపీలో చేరారు. 9 మంది సిట్టింగ్‌ ఎంపీలకు గాను కేవలం ముగ్గురు మాత్రమే తిరిగి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేశారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా, మన్నె శ్రీనివాస్‌ రెడ్డి (మహబూబ్‌నగర్‌), మాలోత్‌ కవిత (మహబూబాబాద్‌), నామా నాగేశ్వర్‌రావు (ఖమ్మం) మాత్రమే తిరిగి పోటీ చేశారు. 

వెంకటేశ్‌ నేత (పెద్దపల్లి), పి.రాములు (నాగర్‌కర్నూలు), బీబీ పాటిల్‌ (జహీరాబాద్‌), రంజిత్‌రెడ్డి (చేవెళ్ల), పసునూరు దయాకర్‌ (వరంగల్‌) బీఆర్‌ఎస్‌కు దూరమయ్యారు. పార్టీ టికెట్‌ ఖరారు చేసినా రంజిత్‌రెడ్డి, పి.రాములు, బీబీ పాటిల్‌ పార్టీకి దూరమవడం పార్టీ కేడర్‌ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది. 

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుతో పాటు రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు, మాజీ ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్‌రెడ్డి, కోనప్ప, పట్నం మహేందర్‌రెడ్డి, సైదిరెడ్డి తదితరులు కాంగ్రెస్‌ లేదా బీజేపీలోకి వలస వెళ్లడం కూడా బీఆర్‌ఎస్‌పై ప్రభావం చూపింది. ఇలా బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వెళ్లిన 9 మందికి బీజేపీ, కాంగ్రెస్‌లు ఎంపీ టికెట్లు ఇచ్చాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సికింద్రాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 

కవిత అరెస్టుతో విమర్శలు
బీఆర్‌ఎస్‌ లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతపై దృష్టి కేంద్రీకరించిన సమయంలోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టు అయ్యారు. దీంతో బీఆర్‌ఎస్‌ తీవ్ర విమర్శ లను ఎదుర్కోవాల్సి వచ్చింది. కాంగ్రెస్, బీజేపీ ఈ అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించాయి. ఇక బస్సు యాత్ర కొనసా గుతున్న సమయంలోనే కేసీఆర్‌ ప్రచారంపై ఎన్నికల సంఘం 48 గంటల నిషేధాన్ని విధించింది. 

సిరిసిల్లలో కాంగ్రెస్‌ నేతలపై చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసీఆర్‌ ప్రచారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. బస్సు యాత్రకు జనం స్పందన భారీగా రావడంతో లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామనే ధీమా బీఆర్‌ఎస్‌ శిబిరంలో కనిపించినా చివరకు పూర్తిస్థాయిలో పరాజయాన్ని మూటగట్టుకుంది. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు ఆశించిన రీతిలో రావడం లేదని రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా కేసీఆర్‌ సంకేతాలు ఇచ్చారు.

మూడో స్థానంతో నిరాశ
కానీ బీఆర్‌ఎస్‌కు మాత్రం లోక్‌సభ ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. సికింద్రాబాద్‌ నుంచి బరిలో నిలిచిన పద్మా రావు గౌడ్, బాజిరెడ్డి గోవర్దన్‌ (నిజామాబాద్‌), ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ (నాగర్‌ కర్నూల్‌), పి.వెంకట్రామిరెడ్డి (మెదక్‌). ఆత్రం సక్కు (ఆదిలాబాద్‌) లాంటి నేతలు కూడా మూడో స్థానానికి పడిపోయారు. మహబూబాబాద్, ఖమ్మం మినహా అన్ని చోట్లా మూడో స్థానానికి పడిపోయిన బీఆర్‌ఎస్, హైదరాబాద్‌లో 4వ స్థానంలో నిలిచింది. 

సిట్టింగ్‌ ఎంపీలుగా ఉన్న మాలోతు కవిత (మహబూబాబాద్‌), నామా నాగేశ్వరరావు (ఖమ్మం)లు మాత్రమే రెండో స్థానంలో ఉండి కొంత పోటీ ఇవ్వగలిగారు. గత ఫలితాలతో పోలిస్తే 3 స్థానాలున్న కాంగ్రెస్‌ బలం 8 స్థానాలకు పెరగ్గా, గతంలో 4 సీట్లు గెలిచిన బీజేపీ ఇప్పుడు రెట్టింపు స్థానాల్లో విజయం సాధించింది. ఇక, పోటీ చేసిన 17 స్థానాల్లో 8 చోట్ల గెలుపొందిన కాంగ్రెస్‌ పార్టీ, 8 చోట్ల రెండో స్థానంలో, ఒక్కచోట మాత్రం మూడోస్థానంలో నిలిచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement