Development funds
-
మాట ఇచ్చారు.. అందుకు కట్టుబడే అడుగులు
సాక్షి, విజయవాడ: దశాబ్ధాలుగా కృష్ణ లంక లోతట్టు ప్రాంతాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాద యాత్ర చేపట్టబోతున్నట్లు వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ దేవినేని అవినాష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఎన్నో ఏళ్లుగా కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపుతున్నా గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృష్ణ లంక లోతట్టు ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి రూ. 126 కోట్లు కేటాయించారు. దీనికి కృతజ్ఞతగా ఈ నెల 31న ముఖ్యమంత్రికి ధన్యవాద యాత్ర చేపట్ట బోతున్నాం. అమరావతిని అభివృద్ధి చేసి తీరుతామని అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చారు. ఆ మాటకు అనుగుణంగానే ఆయన అడుగులు పడుతున్నాయి. కానీ ప్రతిపక్ష పార్టీ ప్రజల దృష్టి మరల్చడానికి రాజధాని అమరావతి పేరుతో ఎన్నో విధాలుగా కుట్రలు చేస్తోంది. త్వరలో జరగబోయే విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకుతీరుతామని' దేవినేని అవినాష్ పేర్కొన్నారు. (నూతన బాధ్యతలు చేపట్టిన మంత్రి మేకపాటి) -
'కేంద్రం నుంచి ఒక్క పైసా రాలేదు'
సాక్షి, ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా రాలేదని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. స్థానిక టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న విభజన సమస్యలు, కాళేశ్వరం జాతీయ హోదా తదితర విషయాలను ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తామని చెప్పారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, మైనింగ్ యూనివర్శిటీ ఏర్పాటు, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు. రాష్ట్రానికి మంజూరు చేసిన 3,155 కిలోమీటర్ల జాతీయ రహదారులకు వెంటనే నిధులు ఇవ్వాలని, మంజూరైన రైల్వే లైన్లకు తక్షణం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న హర్–గర్–జల్ కార్యక్రమం రాష్ట్రంలో అవసరం లేదని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, దానికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా సాయం అందలేదని, వెంటనే కాళేశ్వరానికి జాతీయ హోదా ప్రకటించాలని, అన్ని ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎక్కువ నిధులు కేటాయించాలన్నారు. రాష్ట్రంలో ప్రతీ జిల్లాకు ఒక నవోదయ పాఠశాల, మెడికల్ కళాశాల మంజూరు చేయాలన్నారు. ఆర్టికల్ 370, 35ఏ రద్దుకు టీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించిందని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు. ఆయన వెంట రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మం జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, మేయర్ పాపాలాల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ నల్లమల వెంకటేశ్వర్రావు, నాయకులు తాళ్లూరి భ్రహ్మయ్య, స్వర్ణకుమారి ఉన్నారు. -
సార్ హామీ.. నెరవేరదేమి..!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఆసియా ఖండంలోనే అతిపెద్దదిగా పేరొందిన మేడారం మహాజాతర అభివృద్ధి పనులు మళ్లీ అటకెక్కాయి. జాతర జరిగే నాలుగు రోజుల్లో ఇక్కడికి వచ్చే ప్రభుత్వ పెద్దలు ఎడాపెడా హామీలు గుప్పించడం, అంతకు ముందు రెండు నెలల పాటు పనుల పేరుతో అధికారులు హడావుడి చేయడం తప్ప.. మేడారంలో శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టడంపై ఎవరూ కూడా చిత్తశుద్ధితో వ్యవహరించడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోరిన వారికి కొంగుబంగారమైన వనదేవతలు శ్రీసమ్మక్క–సారలమ్మ మహాజాతరను పురస్కరించుకుని ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్వయంగా ఇచ్చిన హామీలు నాలుగున్నర నెలలు గడిచినా ఇంతవరకు ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు కోటికి పైగా మంది భక్తులు వస్తుంటారు. తెలంగాణ రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడకు చేరుకుని సమ్మక్క– సారలమ్మకు మొక్కులు చెల్లించుకుంటారు. మూడో రోజు సీఎం రాక.. ఈ ఏడాది జనవరి 31 నుంచి ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారంలో మహా జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర మూడో రోజున సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా మేడారాన్ని సందర్శించారు. వనదేవతల దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మేడారంలో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేసేందుకు రూ.200 కోట్లు కేటాయిస్తాం.. 2018–19 బడ్జెట్లోనే ఈ నిధులు మంజూరు చేస్తాం.. జాతరకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేసేందుకు దేవాదాయశాఖకు ఇక్కడ తగినంత స్థలం అందుబాటులో లేదు.. జాతర ఏర్పాట్ల కోసం కనీసం 200 నుంచి 300 ఎకరాల స్థలం కావాలి.. ఎంత ఖర్చయినా ఇక్కడ భూమిని సేకరిస్తాం.. ఈ విషయాలపై చర్చించేందుకు జాతర ముగిసిన తర్వాత తాను 15 రోజుల్లో మరోసారి మేడారం వచ్చి అధికారులతో మాట్లా డతా’’ అని పేర్కొన్నారు. అంతేకాదు జంపన్న వాగులో ఎప్పుడూ పరిశుభ్రమైన నీరు ఉండేలా డ్యామ్ నిర్మిస్తామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటైనందుకు తాను మొక్కులు చెల్లించానని, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలని తిరిగి వనదేవతలను మొక్కుకున్నట్లు చెప్పారు. ఒక్కటీ జరగలేదు.. జాతర ముగిసి నాలుగున్నర నెలలు గడిచినా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. 15 రోజుల్లో మళ్లీ మేడారం వచ్చి అ«ధికారులతో సమావేశం ఏర్పా టు చేస్తానన్న సీఎం.. ఇటువైపు కన్నెత్తి కూడా చూ డడం లేదు. దీంతో 200 ఎకరాల స్థల సేకరణ అంశం మరుగున పడిపోయింది. తర్వాత రాష్ట్ర బడ్జెట్ 2018–19లో మేడారం జాతరకు ఒక్క రూ పాయి కూడా కేటాయించలేదు. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేడారంలో శాశ్వత ప్రాతిపదికన పనులు చేపడుతున్న అభివృద్ధి పెరి గింది. అయితే అంతకు రెట్టింపు సంఖ్యలో జాతర ప్రాధాన్యత పెరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ వంటి వీఐపీలు గత జాతరలో మేడారం వచ్చారు. దేశంలో ఇతర రాష్ట్రాలకు చెందిన గిరిజన సంక్షేమశాఖ మంత్రులు వస్తున్నారు. జాతర సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా మేడారం వచ్చే భక్తు ల సంఖ్య పెరిగింది. సెలవుదినాల్లో వందల వాహనాలు మేడారం వైపు పరుగులు పెడుతున్నా యి. ఈ నేపథ్యంలో ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది. జాతర సమయంలో తప్పితే ఇటువైపు ఎవరూ కన్నెత్తి చూడక పోవడంతో అభివృద్ధి పనుల్లో అంతులేని నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. 2016 జాతర సమయంలో రూ. 14 కోట్లతో తలపెట్టిన నాలుగు చెక్‌డ్యామ్‌ల నిర్మాణం నేటికీ పూర్తి కాకపోవడం ఇందుకు నిదర్శనం. ఇప్పుడు ఒక్క ఎకరమే.. ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని ఊరట్టం గ్రామపంచాయతీ పరిధిలో మేడారం ఉంది. ఈ పల్లెలో 155.8 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. సమ్మక్క–సారలమ్మకు కేవలం ఎకరం భూమి మాత్రమే ఉంది. మేడారం పరిసరాల్లో మొత్తం 155.08 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిలో గద్దెల ప్రాంగణం చుట్టూ ఉన్న మరో 8 ఎకరాల్లో ప్రభు త్వ కార్యాలయాలు, భక్తుల వసతి నిర్మాణాలు, క్యూలైన్లు, స్నానఘట్టాలు ఉన్నాయి. ఇవన్నీ సాం కేతికంగా ప్రభుత్వ భూముల్లోనే ఉన్నాయి. జాతర జరిగే సమయంలో యంత్రాంగం ఈ భూముల ను వినియోగించుకుంటోంది. పలు నిర్మాణాలను ఈ భూముల్లోనే చేపట్టింది. అయితే శాశ్వతంగా వనదేవతలకు భూములను కేటాయించలేదు. జాతర సమయంలో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ నెరవేర్చాలని భక్తులు కోరుతున్నారు. -
నిధుల జారీలో చంద్రబాబు పక్షపాతం
-
'రెండున్నరేళ్లలో ఒక్క రూపాయి కూడా నిధులివ్వలేదు'
విజయవాడ : పెద్దనోట్ల రద్దుతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ప్రభుత్వం తరఫున రాయితీలు ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం కలిశారు. నోట్ల రద్దుపై సామాన్యులకు ఇబ్బందులు కలుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, నియోజకవర్గాల అభివృద్ధి నిధులు ఎమ్మెల్యేల ద్వారా ఖర్చు చేయాలని కోరుతూ సీఎంకు ఓ లేఖను సమర్పించారు. సీఎంను కలిసిన అనంతరం ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించారు. సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..బిల్లులు వాయిదా వేయడంతో పాటు రైతులకు మంజూరుచేసే రుణాలను 100 నోట్లలో ఇవ్వాలన్నారు. కౌలు రైతులకు ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి బ్యాంకర్లతో రుణాలు ఇప్పించాలని సీఎంకు సూచించామని చెప్పారు. కరెన్సీ రద్దుతో ప్రజలు ఇబ్బందిపడుతున్న దృష్ట్యా ప్రభుత్వ చెల్లింపులకు కొంతకాలం మినహాయింపు ఇవ్వాలని కోరారు. కరెంటు, నీటి బిల్లులు, ఇంటి పన్నులు, స్కూల్, కాలేజీ ఫీజులు, గ్యాస్, రేషన్ తదితర ప్రభుత్వ చెల్లింపులకు వెసులుబాటు కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలందరూ నియోజకవర్గాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని... ఈ రెండున్నరేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలకు ఒక్క రూపాయి కూడా నిధులివ్వలేదని పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్చార్జుల పేరుమీద జీవోలు జారీచేస్తున్నారు, ఇది ప్రజాస్వామ్యంలో మంచిపద్ధతి కాదని సీఎంకు తెలిపామన్నారు. చిత్తూరు జిల్లా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి టీడీపీలో చేరినందుకు 11.5 కోట్ల పనులు కేటాయించడంతో పాటు భారీస్థాయిలో పింఛన్లు కూడా మంజూరు చేశారన్నారు. ఈ విధంగా ఫిరాయింపు దారులకు నిధులు కేటాయించడం మంచిది కాదని ఆయన అన్నారు. గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా గౌరవం ఇచ్చారని, ఇప్పుడు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని బాబుకు చెప్పామన్నారు. న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. కొందరు ఎమ్మెల్యేలకు లెటర్ హెడ్ల మీద సీఎంఆర్ఎఫ్కు లేఖ రాస్తే.. ఆ పేదలకు ప్రభుత్వం నుంచి సహాయం కూడా అందడం లేదన్నారు. ఆ లేఖలను పక్కన పెడుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యే లేఖ లేకుండా పంపితే అదేరోజు మంజూరువుతున్నాయన్నారు. ఆర్టీసీ డిపో నిర్మాణం మీరు సీఎం కాకముందే పూర్తయింది, దాన్ని ఇప్పటివరకు ప్రారంభించలేదు.. ప్రారంభిస్తే ప్రజలకు అందుబాటులోకి వస్తుందని పెద్దిరెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బాబు తీరును ప్రజలు అర్థం చేసుకుని బుద్ధి చెబుతారని పెద్దిరెడ్డి చెప్పారు. అంతకు ముందు స్టేట్ గెస్ట్‌హౌస్ నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పాదయాత్ర నిర్వహించారు. -
నిధులు కేటాయింపులపై సీఎంకు ఫిర్యాదు
-
ఆర్థిక పరిస్థితిపై అప్రమత్తం
శాఖలవారీగా జమా ఖర్చుల నివేదిక స్పెషల్ సీఎస్‌లకు బాధ్యతలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతమున్న వాస్తవ ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం అంచనా వేస్తోంది. శాఖలవారీగా ఆర్థిక పరమైన అంశాలను అధ్యయనం చేసే బాధ్యతను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు అప్పగించింది. ఒక్కో స్పెషల్ సీఎస్‌కు మూడు నాలుగు శాఖల బాధ్యతలను కట్టబెట్టింది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ఆదా య స్థితిగతులపై చర్చ జరిగిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ బకాయిలపై కేబినెట్లో చర్చ జరిగింది. ఆదాయ వృద్ధి గణనీయంగా ఉన్నా బకాయిలెందుకు పేరుకుపోయాయని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. శాఖల వారీగా వాస్తవ ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయాలని సీఎస్ రాజీవ్‌శర్మ, ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. నెల రోజుల్లోగా బకాయిలన్నీ చెల్లించేందుకు కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సోమవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ రాజీవ్ శర్మ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. శాఖలవారీగా ఆర్థిక పరమైన అంశాలపై సమాచారాన్ని రూపొందించి నివేదిక తయారు చేయాలని స్పెషల్ సీఎస్‌లను ఆదేశించారు. వివిధ శాఖల అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు అయ్యే ఖర్చు, శాఖల ఆదాయం, కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్రం నుంచి వచ్చిన నిధులపై సమీక్షించారు. ప్రతి స్పెషల్ సీఎస్ మూడు నాలుగు శాఖలను అధ్యయనం చేయాలని రాజీవ్ శర్మ సూచించారు. వివిధ పథకాలపై ఆయా శాఖల ఖర్చు, ఆదాయం తదితర వివరాలన్నింటినీ నివేదికల్లో పొందుపర్చాలని చెప్పారు. వివిధ శాఖలకు రావాల్సిన ఆదాయానికి సంబంధించి కోర్టు కేసులు, ప్రభుత్వ భూముల ద్వారా వచ్చే ఆదాయం, కొత్తగా ఆదాయం వచ్చే మార్గాలు, రెవెన్యూ లీకేజీలు, ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలకు నిధుల కేటాయింపు, ఖర్చు, పెండింగ్ బిల్లులు, అవసరమైన నిధులన్నీ ఈ నివేదికలో చేర్చాలని సూచించారు. -
‘అందోలు’కు రూ.80 కోట్లు
అందోలు-ఎర్రారం వరకు బైపాస్‌రోడ్డు మోడల్‌స్కూల్ టెండర్లు పూర్తి అందోలు ఎమ్మెల్యే పి.బాబూమోహాన్ జోగిపేట: అందోలు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు గాను ప్రభుత్వం ఇటీవల రూ.80 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే పీ.బాబూమోహన్ పేర్కొన్నారు. గురువారం అందోలు గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని ఎస్సీ కాలనీలల్లో సీసీ రోడ్ల కోసం రూ.5 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఏడు మండలాల్లోని పాఠశాలలో టాయ్లెట్ల నిర్మాణం, పైప్లైన్ల ఏర్పాటు, డ్రింకింగ్ వాటర్ కోసం రూ.5 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఈ నిధులు నియోజకవర్గ అభివృద్ధి నిధులు కోటి, జిల్లా మంత్రి ద్వారా రూ. 2 కోట్లు, విద్యాశాఖ మంత్రి ద్వారా రూ.2కోట్లు మంజూరు చేస్తున్నారన్నారు, పలు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. రూ.13 కోట్లతో నిర్మిస్తున్న పాలిటెక్నిక్ కళాశాలల నూతన భవనాలు శరవేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. బుదేరాలో రూ.12 కోట్లతో డిగ్రీ కళాశాల నిర్మాణం, రాయికోడ్‌లో రూ. 13 కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్, బుదేరాలో రోడ్లు భవనాల శాఖ గెస్ట్‌హౌస్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అందోలు పెద్ద చెరువు వద్ద రూ.4.50 కోట్లతో మినీ ట్యాంకు బండ్ నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. జోగిపేట-నాందేడ్ అకోలా రహదారి ఫోర్‌లైన్ రోడ్లుగా విస్తరించేందుకు గాను ఎలాంటి అడ్డంకులు రాకుండా అల్మాయిపేట వద్ద నుంచి బైపాస్‌రోడ్డు పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్నారు. ఆత్మకమిటీ చైర్మన్ లక్ష్మికాంతరెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షుడు కే.రమేశ్, మాజీ ఉపాధ్యాక్షుడు లింగాగౌడ్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు డీబీ నాగభూషణం, కౌన్సిలర్లు శ్రీకాంత్, లక్ష్మణ్, టేక్మాల్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు యూసూఫ్ అలీ, నాయకులు రవీంద్రగౌడ్, గోపాల్, సీహెచ్.వెంకటేశం, చేనేత సొసైటీ చైర్మన్ వర్కల అశోక్ తో పాటు పలువురు పాల్గొన్నారు. -
‘ప్రత్యేక’ నిర్లక్ష్యం
ఖర్చుకాని వెనకబడిన ప్రాంతాల ప్రత్యేక అభివృద్ధి నిధులు రెండేళ్ల వ్యవధిలో రూ. 100కోట్లు విడుదల ఇంతవరకు చేసిన ఖర్చు రూ. కోటి 50లక్షలు పూర్తిగా వినియోగించామంటూ కేంద్రానికి తప్పుడు నివేదికలు వాస్తవాలు పరిశీలిస్తే మన పరువు గంగపాలు అభివృద్ధి పనులు జరగడం లేదంటే... నిధుల కొరతేమోనని అంతా భావించడం పరిపాటి. నిధులున్నా పనులు చేపట్టకపోతే ఏమంటారు...? కచ్చితంగా నిర్లక్ష్యమే కదా... అదే ప్రస్తుతం విజయనగరం జిల్లాకు శాపంగా మారింది. కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక అభివృద్ధికోసం నిధులు కేటాయిస్తోంది. అందులో జిల్లాకు ఏటా రూ. 50కోట్లు వస్తున్నాయి. కానీ మన పరిస్థితి దేవుడు వరమిచ్చినా... పూజారి వరమివ్వనట్టు తయారైంది. ఇప్పటివరకూ కేవలం రూ. 5.02కోట్లే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో ఖర్చుచేసిందెంతో తెలుసా... రూ. 1.50కోట్లే. రెండేళ్లలో మనకోసం వచ్చిన రూ. వందకోట్లు సంగతేమిటో పాలకులే సమాధానం చెప్పాలి. విజయనగరం : రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలోని ఏడు జిల్లాలను కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించింది. అందులో విజయనగరం ఒకటి. ఒక్కో జిల్లాకు ఏటా రూ. 50 కోట్లు చొప్పున ఐదేళ్ల పాటు ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే(2014-2015) రూ. 50కోట్లు విడుదల చేసింది. ఆ నిధులు సకాలంలో ఖర్చు కాలేదు. స్పష్టమైన విధివిధానాల్లేవన్న సాకు చూపి రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తూ వచ్చింది. ఇంతలోనే టీడీపీ నేతల కన్ను ఆ నిధులపై పడింది. అభివృద్ధి పనుల కింద వాటిని దక్కించుకుంటే పెద్ద ఎత్తున పర్సంటేజీల రూపంలో నొక్కేయొచ్చన్న ఆలోచనతో రంగంలోకి దిగారు. వాటిని తమకే కేటాయించాలని అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఒత్తిళ్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఖర్చు చేసేందుకు అధికారులు సాహసించలేదు. ఇంతలో 2015-2016కు సంబంధించి రెం డో విడతగా రూ. 50కోట్లు విడుదలయ్యాయి. ఈ లెక్క న రూ. 100కోట్లు జిల్లాకొచ్చినట్టయింది. విద్య, వైద్యం,తాగునీరు తదితర మౌలిక సౌకర్యాలకోసం ఈ నిధులు ఖర్చుచేయాలని కేంద్రం స్పష్టంగా పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తమ అజెండాను కార్యాచరణలోకి తెచ్చి వ్యవసాయ శాఖ, ఉద్యానవనశాఖ, పశు సంవర్థక శాఖ, మత్స్యశాఖ, పట్టు పరిశ్రమ శాఖ, ఇరిగేషన్ తదితర శాఖలకు కేటాయించి ఖర్చు పెట్టాలని ఆదేశాలిచ్చింది. తాజాగా మంజూరు చేసిన పనులు జిల్లాలోని 18 ప్రభుత్వ శాఖల పరిధిలో రూ. 61.88కోట్ల విలువైన 397అభివృద్ధి పనులకు మంజూరు ఇచ్చారు. గురజాడ కళాభారతి ఆధునికీకరణకు రూ. 25లక్షలు, జిల్లాలోని ఆరు వ్యవసాయ మార్కెట్ కమిటీల అభివృద్ధి పనులకు రూ. 60లక్షలు, పార్వతీపురంలో భూసార పరీక్ష కేంద్రం ఏర్పాటుకు రూ. 10లక్షలు, దాసన్నపేట, రామభద్రపురం, పార్వతీపురంలో మినీ కోల్డ్ స్టోరేజీ కేంద్రాల ఏర్పాటుకు రూ. 36లక్షలు, కొత్తవలస, నాతవలస, చీపురుపల్లి, రామభద్రపురం, పార్వతీపురంలో హైవే బజార్లకోసం రూ. 60లక్షలు, నియోజకవర్గానికొక కస్టమ్స్ హైరింగ్ సెంటర్ కోసం రూ.82.65లక్షలు, 100 చెరువుల్లో చేప పిల్లల పెంపకానికి రూ. 32.82లక్షలు, ఏజెన్సీ పరిధిలో గల 252 గిరిజన రైతుల కోసం వ్యవసాయ బోర్‌వెల్స్ వేసేందుకు రూ. 201లక్షలు, కురుపాం, కొమరాడ మండలాల్లోని 90మంది రైతులకు సోలార్ పంపు సెట్లతో నడిచే వ్యవసాయ బోర్లు కోసం రూ. 58లక్షలు మంజూరు చేశారు. జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రూ. 22.50లక్షలు, ట్రైబల్ వేల్ఫేర్ రోడ్ల కోసం రూ. 1809.60లక్షలు, డ్వామా పరిధిలో నాలుగు భూగర్బజల సర్వే పరికరాల కోసం రూ. 1.80లక్షలు, 5హెచ్‌పీ సామర్ధ్యం గల 101సోలార్ పంపు సెట్ల కోసం రూ. 450లక్షలు, బలిజిపేట నుంచి పెద్దింపేట రోడ్డు వరకు బ్రిడ్జి నిర్మాణానికి రూ. 550లక్షలు, గెద్దలుప్పి, బగ్గందొరవలస మధ్య సువర్ణముఖి నదిపై ఎత్తై బ్రిడ్జి నిర్మాణానికి రూ. 450లక్షలతో పాటు మరికొన్ని పనులు మంజూరు చేశారు. తీర ప్రాంత సౌకర్యాల కేంద్రాలకు రూ. 4.4కోట్లతో పడవలు, వలలు మంజూరు తదితర పనులకు కేటాయించారు. ఇవిగాక మరికొన్ని పనులున్నాయి. ఇవన్నీ ప్రస్తుతం మంజూరు దశలోనే ఉన్నాయి. ఈ పనుల మంజూరు వెనుకా రాజకీయ లబ్ధి ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేతైనేమి రెండేళ్లకు విడతల వారీగా రూ. 100కోట్లు వస్తే ఇంతవరకు రూ. 5.02కోట్లు మాత్రమే మంజూరు చేసింది. ఇందులో రూ. కోటి 50లక్షల వరకు ఖర్చు చేయగలిగిందని తెలిసింది. ఖర్చు పెట్టకపోయినా కేంద్రానికి యూసీలు తొలి విడత రూ. 50కోట్లు విడుదలై రెండేళ్లైనా పట్టించుకోని ప్రభుత్వ ఉన్నతాధికారులు తాజాగా విడుదలైన రూ. 50కోట్లుతో కలిపి రూ. 100కోట్లకు యుద్ధ ప్రాతిపదికన యూసీలివ్వాలని ఆ మధ్య జిల్లా అధికారులను ఆదేశించారు. ఇప్పుడిప్పుడే పనులు మంజూరు చేస్తున్నామని... ఇంకా పనులు మొదలుపెట్టనే లేదనీ, అలాంటప్పుడు విడుదలైన రూ. 100కోట్లకు యూసీలు ఎలా ఇవ్వగలమని అధికారులు చేతులెత్తేశారు. కానీ ప్రభుత్వం మాత్రం విడుదలైన రూ. 100కోట్లు ఖర్చు పెట్టినట్టు కేంద్రానికి నివేదికలిచ్చినట్టు తెలిసింది. దీనిపై నీతి అయోగ్ ఇప్పటికే మండిపడ్డట్టు సమాచారం. ఇప్పుడా పనులన్నింటినీ తనిఖీ చేస్తామని కూడా హెచ్చరించినట్టు తెలిసింది. వారన్నట్టుగా కేంద్ర బృందాలు జిల్లాకొస్తే కాగితాల్లో మంజూరు తప్ప పనులు ఎక్కడా కన్పించవు. వారొస్తే మన ప్రభుత్వం చిత్తశుద్ధి బయటపడనుంది. -
ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలేవీ?
జంగారెడ్డిగూడెం రూరల్: ఎన్నికల ఖర్చు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రోత్సాహక నిధులను ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. ఏకగ్రీవ పంచాయతీల్లో 15వేల లోపు జనాభా ఉంటే రూ. 15 లక్షలు, 15వేల జనాభా దాటితే రూ. 20 లక్షలు మంజూరు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని భావించిన ఏకగ్రీవ పంచాయతీలకు నిరాశే ఎదురైంది. వాటికి ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. 2013 జూలై 27నగ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో 17 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. వాటికి ఇవ్వాల్సిన ప్రోత్సాహక నిధులను అందజేయడంపై ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ కనబరచడం లేదు. జంగారెడ్డిగూడెం డివిజన్లో జంగారెడ్డిగూడెం మండలంలో అమ్మపాలెం, పుట్లగట్లగూడెం, బుట్టాయగూడెం మండలంలో అలివేరు, దొరమామిడి, కోయ రాజమండ్రి, ముంజులూరు, కొయ్యలగూడెం మండలంలో అచ్యుతాపురం, డిప్పకాయలపాడు, పోలవరం మండలంలో గెడ్డపల్లి, ఎల్అండ్డిపేట, మామిడిగొంది, వింజరం, చింతలపూడి మండలంలో నామవరం, కామవరపుకోట మండలంలో కెఎస్ రామవరం, పోలాసిగూడెం గ్రామ పంచాయతీ ఏకగ్రీవమయ్యాయని డివిజన్ పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. తమ గ్రామాలకు ప్రోత్సాహక నిధులను వెంటనే మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆయా పంచాయతీల పాలకవర్గాలు కోరుతున్నాయి. -
నియోజకవర్గ అభివృద్ధికి నిధులివ్వలేను
హైదరాబాద్: శాసనసభ్యులకు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని సీఎం చంద్రబాబు ... పార్టీ ఎమ్మెల్యేలకు తేల్చిచెప్పారు. ఆర్థిక వెసులుబాటును బట్టి బడ్జెట్ తర్వాత ఆలోచిస్తానన్నారు. శాసనసభ కమిటీ హాలులో సోమవారం చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి రూ.1.5 కోట్ల నిధులు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందనే విషయాన్ని పలువురు ఎమ్మెల్యేలు ప్రస్తావించగా, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ పరిస్థితి లేదనిబాబు చెప్పారు. ఎమ్మెల్యేల పనితీరును పర్యవేక్షిస్తున్నానన్నారు. మంత్రులు అందరినీ కలుపుకొని వెళ్లాలన్నారు. కొత్త గృహాల్ని మంజూరు చేయాలని ఎమ్మెల్యేలు కోరగా గతంలో బోగస్ పేర్లతో గృహాలు పొందిన వారి జాబితాను తనకివ్వాలని సూచించారు. గతంలో బోగస్ పేర్లతో గృహాలు పొందినవారిలో టీడీపీ వారు కూడా ఉన్నారని, ఇప్పడు ఆ జాబితాను బయటకి తీస్తే పార్టీ కార్యకర్తలకు నష్టం జరిగే అవకాశం ఉందని తెనాలి ఎమ్మెల్యే ఆళపాటి రాజేంద్రప్రసాద్ చెప్పారు. ఆ జాబితాతో సంబంధం లేకుండా అర్హులైన వారికి ఇళ్లు కేటాయించాలన్నారు. కేంద్రం... రెక్కలు నరికి ఎగరమంటోంది కొత్త రాజధాని ఒక స్థాయికి వచ్చే వరకు చేయూత ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని బాబు చెప్పారు. ఏపీకి రూ. 17 వేల కోట్ల రెవె న్యూ లోటు ఉండగా రూ.500 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందన్నారు. రెక్కలు నరికేసి ఎగరమంటోందని వ్యాఖ్యానించారు. విద్యుత్ చార్జీల పెంపు ఖాయం వచ్చే ఏప్రిల్ నుంచి విద్యుత్ చార్జీలను పెంచకతప్పదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విద్యుత్ చార్జీల భారం వేయబోతున్నారని వస్తున్న వార్తలను కొందరు ఎమ్మెల్యేలు ప్రస్తావించగా.. ప్రస్తుత పరిస్థితుల్లో చార్జీలు పెంచకతప్పదని బాబు చెప్పారు. దాదాపు రూ.7,716 కోట్ల లోటును పూడ్చుకునే క్రమంలో చార్జీలను పెంచకతప్పదని అన్నారు. -
ఆశలు సజీవం...!
నల్లగొండ : వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులపై (బీఆర్జీఎఫ్)ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నా యి. 2014-15 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు రావాల్సిన రూ.33.80 కోట్లు విడుదల చేయడంలో కేంద్రం తీవ్ర జాప్యం చేస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో జిల్లాలో చేపట్టాల్సిన వివిధ రకాల అభివృద్ధి పనులు మరుగునపడ్డాయి. నిధుల ఎప్పుడు వస్తాయన్న ఆశతో జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఎదరుచూస్తున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన సందర్భంలో కూడా ఈ నిధుల మంజూరు గురించి కేం ద్రంతో చర్చించడం జరిగింది. మరికొంత ఆలస్యమైనప్పటికీ జిల్లాకు రావాల్సిన నిధులు తప్పక వస్తాయని అధికారులు చెబున్నారు. అయితే గతేడాది నిధులతో ప్రమేయం లేకుండానే 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాకు రూ. 33.50 కోట్లు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులకు సంబంధించి కొత్త వా ర్షిక ప్రణాళిక రూపొందించేందుకు 70 రోజుల గడువు విధించింది. అప్పటిలోగా గ్రామసభలు, మున్సిపాల్టీల్లో వార్డుసభలు నిర్వహించి పనులు గుర్తించాలని పేర్కొంది. ఎప్పటి మాదిరే ఈ నిధుల్లో గ్రామ పంచాయతీలకు 50 శాతం, మండల పరిషత్‌లకు 30 శాతం, జిల్లా పరిషత్, అర్బన్ ప్రాంతాలకు 20 శాతం నిధులు కేటాయించనున్నారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డుగా ఉన్నందున సభలు నిర్వహించేందుకు వీల్లేదు. వచ్చే నెలాఖరు వరకు కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి కేంద్రం విధించిన 70 రోజుల్లో 40 రోజుల సమయం వృథా అయినట్లే. గతేడాది కూ డా వరుస ఎన్నికల కోడ్ కారణంగానే ప్ర తిపాదనలు రూపొందించడం ఆలస్యమైంది. పర్యవసానంగా ఇప్పటివరకు ని ధులు విడుదల కానీ పరిస్థితి ఏర్పడింది. అన్నీ అవరోధాలే... ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం..మరోవైపు వరుస ఎన్నికల కారణంగా గతేడాది రావాల్సిన బీఆర్జీఎఫ్ నిధులు రాకుండా పోయాయి. వాస్తవానికి ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో ప్రతిపాధనలు పం పితే జూన్‌లో ఈ నిధులు వస్తాయి. ప్రతి పాదనలకు ముందు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం, త ర్వాత జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ) గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. 2014-15 బీఆర్జీఎఫ్ ప్రతిపాదలనకు స్థానిక, సార్వత్రిక ఎన్నికలు ప్రతిబంధకంగా మారాయి. ఎన్నికల నోటిఫికేషన్, ప్రక్రియ తదితర కారణాలతో ఈ వ్యవహారం డోలాయమానంలో పడింది. కొన్ని జిల్లాలో అప్పుడున్న శాసనసభ్యులు, మంత్రులు అధికారులతో మాట్లాడి హైపవర్ కమిటీకి ప్రతిపాదనలు పంపగా..జిల్లాలో మాత్రం బీఆర్జీఎఫ్ ప్రతిపాదనలకు నోచుకోలేదు. జెడ్పీకి కొత్త పాలకవర్గం వచ్చాక సెప్టెంబర్‌లో డీపీసీ ఆమోదంతో రూ.33.80 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపారు. ప్రతిపాదనలు పంపి ఆరు మాసాలు కావస్తున్నా నిధుల ఊసు లేదు. జూన్‌లో హైపవర్ కమిటీకి చేరి ఉంటే... వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద చేపట్టే పనులకు ఉన్నతాధికారులు మే నెలలోనే ప్రత్యేక అధికారులనుంచి ప్రతిపాదనలు కోరారు. గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో పనులు గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ అప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యింది. దీంతో ప్రతిపాదనలు కేంద్రానికి పంపకుండా ఆపేశారు. ఎన్నికల అనంతరం జెడ్పీటీసీలు, ఎంపీపీలు అధికారంలోకి రావడంతో అధికారులు రూపొందించిన ప్రతిపాదనలు మళ్లీ మార్చాల్సి వచ్చింది. ప్రజాప్రతినిధుల సూచనల మేరకు కొత్త ప్రతిపాదనలు రూపొందించి డీపీసీ ఆమోదం పొందే నాటికి పరిస్థితి చేయి దాటిపోయింది. ప్రతిపాదనలు హైపవర్ కమిటీ చేరడం ఆలస్యం కావడంతో ఇప్పటివరకు నిధులు రాకుండా ఆగిపోయాయి. పంపకాలు సవ్యంగా జరిగేనా...? గతేడాది ప్రతిపాదనలకు వరుస ఎన్నికలు అడ్డంకిగా నిలిస్తే..ఈ ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ప్రతిబంధకంగా మారింది. 70 రోజుల గడువులోగా ప్రతిపాదనలు పంపడం ఆలస్యమైతే మొదటి విడత జూన్, జులైలో విడుదల కావాల్సిన నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇదిలా ఉంటే గతేడాది జెడ్పీ చైర్మన్ కాంగ్రెస్‌లో ఉన్నారు కాబట్టి వచ్చిన నిధుల్లో పంపకాలు సవ్యంగా సాగాయి. కానీ ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చైర్మన్ టీఆర్ఎస్లోకి చేరడంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీల వాటాల పంపకంలో వివాదాలు మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే నిధుల పంపకంలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని జెడ్పీటీసీలు గుర్రుగా ఉన్నారు. అలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కొత్త పనుల ప్రతి పాధనులు సకాలంలో చేరుతాయా..?లేదా..? అన్నది వేచిచూడాల్సిందే. -
కేసీఆర్ సర్కార్ వివక్ష చూపుతోంది...
హైదరాబాద్ : ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అభివృద్ధి నిధుల విడుదలలో కేసీఆర్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ రోడ్ల నిర్మాణానికి పంచాయతీ రాజ్ శాఖ రూ. 1952 కోట్లు విడుదల చేస్తూ జీవో 36 ఇచ్చిందన్నారు. అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు రూ.5 కోట్ల లోపు మంజూరు చేసిన ప్రభుత్వం... టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పెద్ద మొత్తంలో నిధులను మంజూరు చేసిందని రామ్మోహన్ రెడ్డి అన్నారు. కేసీఆర్...అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య తేడా చూపరాదని ఆయన సూచించారు. -
నిధులువెనక్కేనా..!
బీఆర్జీఎఫ్ నిధులపై ప్రతిష్టంభన ప్రతిపాదనలకు చివరి తేదీ ఈనెల 30 నేటికీ సమావేశమవ్వని డీపీసీ అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపం సాక్షి, హన్మకొండ : అధికారుల అలసత్వం కారణంగా వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు(బీఆర్జీఎఫ్) వెనక్కి మళ్లే ప్రమాదం ఏర్పడింది. ఈ నిధుల కింద చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలు సెప్టెంబర్ 30లోగా ప్రభుత్వానికి పంపించాల్సి ఉంది. గడువులోపే జిల్లా ప్రణాళికా కమిటీ (డీపీసీ) సమావేశంలో ఈ పనులపై చర్చ జరగాల్సి ఉంది. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపం కారణంగా ప్రతిపాదనలు నేటికీ ఆమోదం పొందలేదు. సరికొత్త మార్గదర్శకాలు 2012-17 వరకు అమలు కావాల్సి ఉంది. ఈ పథకం ద్వారా కేటాయించే నిధులలో గ్రామ పంచాయతీలకు 50శాతం, మండల పరిషత్‌లకు 30శాతం, జిల్లా పరిషత్‌కు 20శాతం కేటాయిస్తారు. రెండో విడత కింద రూ.33కోట్ల వరకు నిధులు జిల్లాకు కేటాయించగా వీటిలో రూ.22కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో, రూ.11 కోట్లు పట్టణ ప్రాంతాల్లో ఖర్చు చేయాల్సి ఉంది. అంతకు ముందు బీఆర్జీఎఫ్-1 కింద 2007-12 వరకు మొదటి విడత అమలైంది. ఈ సమయంలో హైమాస్ట్‌లైట్లు, మురుగుకాల్వలు, సిమెంట్ రోడ్లకు అత్యధిక నిధులు కేటాయించడాన్ని రాష్ట్ర హైపవర్ కమిటీ తప్పుపట్టింది. హైమాస్ట్‌లైట్ల కొనుగోలుపై ఆడిట్ అభ్యంతరాలు సైతం వ్యక్తమయ్యాయి. దానితో మురుగు కాల్వలు, సిమెంట్ రోడ్లు, హైమాస్ట్‌లైట్లను ప్రతిపాదనల్లో చేర్చవద్దని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనాలు, పాఠశాలల్లో కిచెన్షెడ్లు, మూత్రశాలలు, తాగు నీటి సౌకర్యాలు వంటి పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని మార్గదర్శకాలు జారీ చేశారు. జెడ్పీ అధికారుల నిర్లక్ష్యం 2012లో బీఆర్జీఫ్-2 అమలయ్యే నాటికి కొత్త పాలకవర్గం ఏర్పడ లేదు. అధికారుల పాలనే సాగింది. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 2014 ఏప్రిల్‌లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగ్గా మే నెలలో ఫలితాలు వెలువడ్డాయి. ఆ వెంటనే బీఆర్జీఎఫ్-2 నిధులతో చేపట్టే పనులకు సంబంధించిన ప్రతిపాదనలు జెడ్పీటీసీ సభ్యుల నుంచి తీసుకోవడంలో జిల్లా పరిషత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కొత్త సభ్యులకు మార్గదర్శకాలు వివరించకుండా, గత అనుభవాలను పట్టించుకోకుండా ప్రతిపాదనలు తీసుకున్నారు. దానితో జెడ్పీటీసీ సభ్యులు పంపిన ప్రతిపాదనల్లో యాభై శాతానికి మించిన పనులు సీసీ రోడ్లు, డ్రెరుునేజీలకు సంబంధించినవే ఉన్నాయి. జెడ్పీటీసీ సభ్యులు పంపించిన ప్రతిపాదనలు బీఆర్జీఎఫ్-2 నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనే అంశాన్ని మూడు నెలలుగా జిల్లా అధికారులు గుర్తించలేదు. మరోవైపు గడువు తేదీ సెప్టెంబర్ 30 సమీపిస్తుండటంతో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. గతంలో జెడ్పీటీసీలు సమర్పించిన పనులను ఏకగ్రీవంగా ఆమోదించారు. డీపీసీ వాయిదా బీఆర్జీఎఫ్-2 పనుల ప్రతిపాదనలకు సంబంధిం చి జిల్లా పరిషత్ ఉన్నతాధికారులకు, జెడ్పీటీసీలకు మధ్య సమన్వయ లోపం ఏర్పడింది. దీన్ని సరిదిద్దడంపై అటు కలెక్టర్ సైతం దృష్టి సారించక పోవడంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. దానితో ఈ ప్రతిపాదనలు విషయంలో ఏం చేయాలనే అంశంపై స్పష్టత రాకుండా పోయింది. జిల్లా కలెక్టర్ సభ్యుడిగా ఉండే జిల్లా ప్రణాళికా కమిటీ(డీపీసీ)లో చర్చించి ఆమోదం పొందేందుకు జెడ్పీటీసీ సభ్యులు బుధవారం యత్నించారు. అయితే వీడియో కాన్ఫరెన్స్ ఉందనే కారణంతో డీపీసీ సమావేశాన్ని కలెక్టర్ వాయిదా వేశారు. సమావేశం ఎప్పుడు నిర్వహించే తేదీని సైతం ఖరారు చేయలేదు. జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షురాలిగా ఉండే జిల్లా ప్రణాళికా కమిటీ సమావేశాన్ని కలెక్టర్ వాయిదా వేయడం ఏమిటని పలువురు ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఇదే తీరున ఆలస్యం జరిగితే నిధులు వెనక్కి మళ్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు. బీఆర్జీఎఫ్-2 పనుల విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగించడంలో జిల్లా అధికారులు విఫలమయ్యారంటూ సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. -
సమస్యాత్మక గ్రామాలపై దృష్టి
వ్యాధులపై అవగాహన కల్పించాలి ఆస్పత్రి అభివృద్ధి నిధులు వినియోగించాలి కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ పాడేరు, న్యూస్‌లైన్: ఎపిడమిక్ దృష్ట్యా వ్యాధులు విజృంభిస్తున్నందున వైద్యఆరోగ్య,మలేరియాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఆదేశించారు. బుధవారం పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో ఎస్పీహెచ్వోలు,వైద్యులు, మలేరియాశాఖల అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ గత అనుభవాల దృష్ట్యా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. మలేరియా రోగులను గుర్తించాలని, వారు సక్రమంగా మందులు వేసుకునేలా వైద్యసిబ్బంది పర్యవేక్షించాలన్నారు. ముందుగా ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశమై ఎపిడమిక్‌లో వచ్చే వ్యాధులు, నివారణ చర్యలపై గిరిజనులకు అవగాహన కల్పించాలన్నారు. దోమ తెరల వినియోగం, దోమల నివారణ మందు పిచికారీ, పారిశుధ్యం తదితర అంశాలపై ఆరా తీయాలన్నారు. హైరిస్క్ గ్రామాలలో వ్యాధులు రాకుండా వైద్యాధికారులు నిరంతరం తనిఖీ చేయాలన్నారు. వ్యాధులు సంక్రమించకుండా నివారణ చర్యలు తీసుకోవలసిన బాధ్యత వారిపైనే ఉందన్నారు. వైద్యాధికారులు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను పూర్తిగా పరిశీలించి సక్రమంగా అమలు చేయాలన్నారు. వైద్యసిబ్బంది, ఆశ కార్యకర్తల వద్ద పూర్తిస్థాయిలో మందులు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాడేరు ఐటీడీఏ పీవో వి.వినయ్‌చంద్ మాట్లాడుతూ ఆస్పత్రి అభివృద్ధి నిధులతో పీహెచ్‌సీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. దుప్పట్లు, కర్టెన్లు కొనుగోలు చేయాలని, ఆస్పత్రి అభివృద్ధికోసం మంజూరు చేసిన నిధులను సక్రమంగా ఖర్చు చేయాలన్నారు. ఎస్పీహెచ్ఓలు తమ పరిధిలోని పీహెచ్సీలలో మంచినీటి సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు శుక్రవారం తనకు అందజేయాలన్నారు. గ్రామ ఆరోగ్య, పారిశుధ్య నిధులను వినియోగించి గ్రామాల్లో పారిశుధ్య పనుల చేయాలన్నారు. దోమల మందు పిచికారీ పనులపై వైద్యాధికారులకు పూర్తిస్థాయి అవగాహన ఉండాలన్నారు. సమావేశంలో ఆర్డీవో జి.రాజకుమారి, ఏపీవో పీవీఎస్ నాయుడు, డీఎంహెచ్‌వో శ్యామల, డీఎంవో ప్రసాదరావు, డీసీహెచ్ఎస్ నాయక్, 11 మండలాల ఎస్పీహెచ్వోలు, వైద్యాధికారులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్య బాధ్యత వర్సిటీలదే
=‘రూసా’తో వర్సిటీల అభివృద్ధికి నిధులు =వర్సిటీల బలోపేతానికి చర్యలు =ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి యూనివర్సిటీక్యాంపస్, న్యూస్‌లైన్: విద్యార్థులకు నాణ్యమైన విద్య, సమాజాభివృద్ధికి దోహదపడే పరిశోధనలు అందించే బాధ్యత యూనివర్సిటీలదేనని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. ఎస్వీయూ అతిథిగృహంలో శనివారం ఆయన ‘న్యూస్‌లైన్’కు ప్రత్యేక ఇంట ర్వ్యూ ఇచ్చారు. వర్సిటీల అభివృద్ధికి తీ సుకుంటున్న చర్యలను వివరించారు. రాష్ట్రంలో అన్ని వర్సిటీలు ఆర్థిక లోటు తో కొట్టుమిట్టాడుతున్నాయి. 2013- 14 ఆర్థిక సంవత్సరంలో వర్సిటీల బ డ్జెట్‌ను ప్రభుత్వం పెంచింది. 2014- 15 సంవత్సరం ఎన్నికల సంవత్సరం కాబట్టి ప్రభుత్వం ఏమేరకు బడ్జెట్ పెం చుతుందో అనుమానమే. అయితే కేంద్రప్రభుత్వం ఉన్నత విద్య అభివృద్ధికి రాష్ట్రీయ ఉచిత శిక్షా అభియాన్(రూసా) అనే కొత్త పథకం ప్రవేశపెట్టింది. కేంద్రమానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఈ పథకం అమలు చేస్తుంది. సుమారు పదేళ్లపాటు ఈ ప థకం అమలులో ఉంటుంది. తద్వారా రాష్ట్రానికి రెండేళ్లకు రెండువేల కోట్ల రూ పాయల నిధులు రానున్నారుు. రెండేళ్ల తర్వాత మరో ఐదువేల కోట్లు రానున్నాయని వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. అటానమస్ కళాశాలలకు వర్సిటీస్థాయి రూసా పథకం కింద అటానమస్ కళాశాలను వర్సిటీలుగా అప్‌గ్రేడ్ చేయనున్న ట్లు వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. నాక్ ఎ-గ్రేడ్, కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కలిగి ఉండి, మూడువేల మంది విద్యార్థులు ఉన్న కళాశాలలను వర్సిటీలుగా అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు వర్సిటీల్లో పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అ నుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు. భర్తీ ప్రక్రియ కొకనసాగుతోందన్నారు.అధ్యాపక పోస్టుల భర్తీలో వీసీలు అక్రమాలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పరిపాలనా పరమైన సంస్కరణలు తీసుకు వచ్చేందుకు కూ డా కృషి చేస్తున్నామన్నారు. బోధనా ప్రమాణాలు పెరగాల్సిన అవసరం ఉందని, అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశ పెట్టాలన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో సిలబస్‌ను మార్చాల్సిన అవసరాన్ని వర్సిటీలు గుర్తించాలని ఆయన సూచించారు. కొందరు కళంకం తెస్తున్నారు కొందరు వీసీలు, ఇతర అధికారులు ఉన్నత విద్యకు కళంకం తెస్తున్నారని ఆయన అన్నారు. నిధులు పెంచుకోవడం కోసం అక్రమ మార్గాలను ఎంచుకుంటూ దారితప్పుతున్నారన్నారు. గ తంలో కుప్పంలోని ద్రవిడ వర్సిటీ, కర్నూలులోని రాయలసీమ వర్సిటీ సరైన నిబంధనలు పాటించకుండా లెక్కకుమించి పీహెచ్డీ అడ్మిషన్లు ఇచ్చాయని తెలిపారు. దీనిపై విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉండాలన్నారు. స్పష్టమైన లక్ష్యం కలిగి, దాన్ని సాధిం చేందుకు కృషి చేయూలని ఆయన సూచించారు.