'రెండున్నరేళ్లలో ఒక్క రూపాయి కూడా నిధులివ్వలేదు'
విజయవాడ : పెద్దనోట్ల రద్దుతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ప్రభుత్వం తరఫున రాయితీలు ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం కలిశారు. నోట్ల రద్దుపై సామాన్యులకు ఇబ్బందులు కలుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, నియోజకవర్గాల అభివృద్ధి నిధులు ఎమ్మెల్యేల ద్వారా ఖర్చు చేయాలని కోరుతూ సీఎంకు ఓ లేఖను సమర్పించారు.
సీఎంను కలిసిన అనంతరం ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించారు. సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..బిల్లులు వాయిదా వేయడంతో పాటు రైతులకు మంజూరుచేసే రుణాలను 100 నోట్లలో ఇవ్వాలన్నారు. కౌలు రైతులకు ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి బ్యాంకర్లతో రుణాలు ఇప్పించాలని సీఎంకు సూచించామని చెప్పారు. కరెన్సీ రద్దుతో ప్రజలు ఇబ్బందిపడుతున్న దృష్ట్యా ప్రభుత్వ చెల్లింపులకు కొంతకాలం మినహాయింపు ఇవ్వాలని కోరారు. కరెంటు, నీటి బిల్లులు, ఇంటి పన్నులు, స్కూల్, కాలేజీ ఫీజులు, గ్యాస్, రేషన్ తదితర ప్రభుత్వ చెల్లింపులకు వెసులుబాటు కల్పించాలని లేఖలో పేర్కొన్నారు.
ఎమ్మెల్యేలందరూ నియోజకవర్గాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని... ఈ రెండున్నరేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలకు ఒక్క రూపాయి కూడా నిధులివ్వలేదని పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జుల పేరుమీద జీవోలు జారీచేస్తున్నారు, ఇది ప్రజాస్వామ్యంలో మంచిపద్ధతి కాదని సీఎంకు తెలిపామన్నారు. చిత్తూరు జిల్లా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి టీడీపీలో చేరినందుకు 11.5 కోట్ల పనులు కేటాయించడంతో పాటు భారీస్థాయిలో పింఛన్లు కూడా మంజూరు చేశారన్నారు. ఈ విధంగా ఫిరాయింపు దారులకు నిధులు కేటాయించడం మంచిది కాదని ఆయన అన్నారు.
గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా గౌరవం ఇచ్చారని, ఇప్పుడు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని బాబుకు చెప్పామన్నారు. న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. కొందరు ఎమ్మెల్యేలకు లెటర్ హెడ్ల మీద సీఎంఆర్ఎఫ్‌కు లేఖ రాస్తే.. ఆ పేదలకు ప్రభుత్వం నుంచి సహాయం కూడా అందడం లేదన్నారు. ఆ లేఖలను పక్కన పెడుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యే లేఖ లేకుండా పంపితే అదేరోజు మంజూరువుతున్నాయన్నారు. ఆర్టీసీ డిపో నిర్మాణం మీరు సీఎం కాకముందే పూర్తయింది, దాన్ని ఇప్పటివరకు ప్రారంభించలేదు.. ప్రారంభిస్తే ప్రజలకు అందుబాటులోకి వస్తుందని పెద్దిరెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బాబు తీరును ప్రజలు అర్థం చేసుకుని బుద్ధి చెబుతారని పెద్దిరెడ్డి చెప్పారు. అంతకు ముందు స్టేట్ గెస్ట్హౌస్ నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పాదయాత్ర నిర్వహించారు.