
నియోజకవర్గ అభివృద్ధికి నిధులివ్వలేను
హైదరాబాద్: శాసనసభ్యులకు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని సీఎం చంద్రబాబు ... పార్టీ ఎమ్మెల్యేలకు తేల్చిచెప్పారు. ఆర్థిక వెసులుబాటును బట్టి బడ్జెట్ తర్వాత ఆలోచిస్తానన్నారు. శాసనసభ కమిటీ హాలులో సోమవారం చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్‌పీ సమావేశం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి రూ.1.5 కోట్ల నిధులు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందనే విషయాన్ని పలువురు ఎమ్మెల్యేలు ప్రస్తావించగా, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ పరిస్థితి లేదనిబాబు చెప్పారు.
ఎమ్మెల్యేల పనితీరును పర్యవేక్షిస్తున్నానన్నారు. మంత్రులు అందరినీ కలుపుకొని వెళ్లాలన్నారు. కొత్త గృహాల్ని మంజూరు చేయాలని ఎమ్మెల్యేలు కోరగా గతంలో బోగస్ పేర్లతో గృహాలు పొందిన వారి జాబితాను తనకివ్వాలని సూచించారు. గతంలో బోగస్ పేర్లతో గృహాలు పొందినవారిలో టీడీపీ వారు కూడా ఉన్నారని, ఇప్పడు ఆ జాబితాను బయటకి తీస్తే పార్టీ కార్యకర్తలకు నష్టం జరిగే అవకాశం ఉందని తెనాలి ఎమ్మెల్యే ఆళపాటి రాజేంద్రప్రసాద్ చెప్పారు. ఆ జాబితాతో సంబంధం లేకుండా అర్హులైన వారికి ఇళ్లు కేటాయించాలన్నారు.
కేంద్రం... రెక్కలు నరికి ఎగరమంటోంది
కొత్త రాజధాని ఒక స్థాయికి వచ్చే వరకు చేయూత ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని బాబు చెప్పారు. ఏపీకి రూ. 17 వేల కోట్ల రెవె న్యూ లోటు ఉండగా రూ.500 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందన్నారు. రెక్కలు నరికేసి ఎగరమంటోందని వ్యాఖ్యానించారు.
విద్యుత్ చార్జీల పెంపు ఖాయం
వచ్చే ఏప్రిల్ నుంచి విద్యుత్ చార్జీలను పెంచకతప్పదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విద్యుత్ చార్జీల భారం వేయబోతున్నారని వస్తున్న వార్తలను కొందరు ఎమ్మెల్యేలు ప్రస్తావించగా.. ప్రస్తుత పరిస్థితుల్లో చార్జీలు పెంచకతప్పదని బాబు చెప్పారు. దాదాపు రూ.7,716 కోట్ల లోటును పూడ్చుకునే క్రమంలో చార్జీలను పెంచకతప్పదని అన్నారు.