ఆర్థిక పరిస్థితిపై అప్రమత్తం
శాఖలవారీగా జమా ఖర్చుల నివేదిక
స్పెషల్ సీఎస్‌లకు బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతమున్న వాస్తవ ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం అంచనా వేస్తోంది. శాఖలవారీగా ఆర్థిక పరమైన అంశాలను అధ్యయనం చేసే బాధ్యతను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు అప్పగించింది. ఒక్కో స్పెషల్ సీఎస్‌కు మూడు నాలుగు శాఖల బాధ్యతలను కట్టబెట్టింది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ఆదా య స్థితిగతులపై చర్చ జరిగిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలపై కేబినెట్‌లో చర్చ జరిగింది. ఆదాయ వృద్ధి గణనీయంగా ఉన్నా బకాయిలెందుకు పేరుకుపోయాయని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. శాఖల వారీగా వాస్తవ ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయాలని సీఎస్ రాజీవ్‌శర్మ, ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. నెల రోజుల్లోగా బకాయిలన్నీ చెల్లించేందుకు కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సోమవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ రాజీవ్ శర్మ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
శాఖలవారీగా ఆర్థిక పరమైన అంశాలపై సమాచారాన్ని రూపొందించి నివేదిక తయారు చేయాలని స్పెషల్ సీఎస్‌లను ఆదేశించారు. వివిధ శాఖల అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు అయ్యే ఖర్చు, శాఖల ఆదాయం, కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్రం నుంచి వచ్చిన నిధులపై సమీక్షించారు. ప్రతి స్పెషల్ సీఎస్ మూడు నాలుగు శాఖలను అధ్యయనం చేయాలని రాజీవ్ శర్మ సూచించారు. వివిధ పథకాలపై ఆయా శాఖల ఖర్చు, ఆదాయం తదితర వివరాలన్నింటినీ నివేదికల్లో పొందుపర్చాలని చెప్పారు. వివిధ శాఖలకు రావాల్సిన ఆదాయానికి సంబంధించి కోర్టు కేసులు, ప్రభుత్వ భూముల ద్వారా వచ్చే ఆదాయం, కొత్తగా ఆదాయం వచ్చే మార్గాలు, రెవెన్యూ లీకేజీలు, ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలకు నిధుల కేటాయింపు, ఖర్చు, పెండింగ్ బిల్లులు, అవసరమైన నిధులన్నీ ఈ నివేదికలో చేర్చాలని సూచించారు.