తషీన్ రహిమ్‌తో
ఫైనాన్షియల్ స్ట్రాటజిస్ట్‌గా తనను తాను నిరూపించుకున్న తషీన్...ఒకరోజు తనకు తానే సలహా ఇచ్చుకుంది. ఆ సలహా 28 సంవత్సరాల తషీన్‌ను సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చింది...
మ్యాథ్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసిన తషీన్ రహిమ్‌తోలకు ఎప్పుడూ లాభ,నష్టాల గురించి ఆలోచించే అవసరం రాలేదు. ‘ఫైనాన్షియల్ స్ట్రాటజిస్ట్’గా ఆమె మంచి ఉద్యోగంలో ఉంది. ‘ఎందరికో వ్యూహాత్మక సలహాలు ఇస్తున్న నేను ఎందుకు వ్యాపారంలోకి అడుగుపెట్టకూడదు?’ అని ఒక ఫైన్‌మార్నింగ్ ఆలోచించింది. తనకు తానే సలహా ఇచ్చుకుంది.
నిజానికి ఎంటర్‌ప్రెన్యూర్ అనే మాట ఆమెకు కొత్తేమీ కాదు. తల్లిదండ్రులు ఇద్దరూ వేరువేరు వ్యాపారాల్లో ఉన్నారు. అయినప్పటికీ ‘జాబ్ వదిలేస్తున్నాను’ అని చెబితే ‘రిస్క్ తీసుకుంటున్నావు’ అనే మాటే ఎక్కువగా వినిపించింది.
‘బిజినెస్‌లోకి అడుగు పెట్టే ముందు బాగా నవ్వు. ఎందుకంటే రకరకాల టెన్షన్‌లతో ఆ తరువాత నవ్వే పరిస్థితి ఉండదు’ అన్నారు కొందరు.
ఎవరు ఎలా స్పందించినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు తషీన్. ‘టేస్ట్ రీట్రీట్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా తొలి అడుగు వేసింది. మార్కెట్‌లో పోటీని తట్టుకోవడం, ఆర్డర్స్ సంపాదించడం, టీమ్‌ను లీడ్ చేయడం...అంత తేలికైన విషయం కాదు. అయితే ఆమెకు ప్రతి ఆర్డర్ ఒక విలువైన పాఠం నేర్పింది.
థీమ్‌డ్ పార్టీస్, కార్పొరేట్ గిఫ్టింగ్, సిట్–డౌన్ డిన్నర్....మొదలైన వాటిలో తనదైన ముద్ర వేసింది టేస్ట్ రీట్రీట్.
ఒకప్పుడు ‘ముంబై–వోన్లీ సర్వీస్’గా మొదలైన ఈ వెంచర్ పాన్–ఇండియా ఆ తరువాత అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి ఎంతో కాలం పట్టలేదు. 50 లక్షలతో మొదలుపెట్టిన ‘టేస్ట్ రీట్రీట్’ ఇప్పుడు ‘17 క్రోర్ క్లబ్’లో చేరింది.
‘ఎందరో సాధించిన ఎన్నో విజయాల గురించి వింటూ ఉంటాం. నేను కూడా ట్రై చేసి చూస్తాను అనే ఆలోచన మీలో వస్తే మొదటి అడుగు పడినట్లే. మీకు ఇష్టమైన బిజినెస్ మొదలుపెడితే రెండో అడుగు పడుతుంది. మూడో అడుగులో అనుభవాలే పాఠాలు నేర్పించి మనల్ని విజేతగా నిలుపుతాయి’ అంటుంది 28 సంవత్సరాల తషీన్.
Comments
Please login to add a commentAdd a comment