GV Rao Wrong Analysis On AP Financial Status Says Duvvuri Krishna, Details Inside - Sakshi
Sakshi News home page

రామోజీ ‘‘డ్రామాల’’ ఆర్థిక నిపుణుడు.. జీవీ రావు తప్పుడు విశ్లేషకుడు: దువ్వూరి కృష్ణ

Published Thu, May 11 2023 11:35 AM | Last Updated on Thu, May 11 2023 5:08 PM

GV Rao Wrong Analysis On AP Financial Status Says Duvvuri Krishna - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విపక్షంతో పాటు, ఆ పార్టీకి వత్తాసు పలికే మీడియాలో అదేపనిగా దుష్ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి (ఫైనాన్స్, ఎకనామిక్‌ అఫైర్స్‌) దువ్వూరి కృష్ణ ఆక్షేపించారు. ఎవరికీ తెలియని, పరిచయం లేని వ్యక్తిని ఆర్థిక నిపుణుడిగా పరిచయం చేస్తూ, ఆయనతో ఒక ప్రకటన చేయించిన ఈనాడు పత్రిక, దాన్ని ప్రముఖంగా ప్రచురించిందని, దీని వల్ల ప్రజల్లో లేనిపోని అపోహలు తలెత్తే అవకాశం ఏర్పడిందని కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఇప్పుడు కీలకమైన ఆర్థిక అంశాలన్నింటినీ గణాంకాలను మీడియా ముందు ఉంచుతున్నట్లు వెల్లడించారాయన. 

ప్రభుత్వానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ పబ్లిక్‌ డొమెయిన్‌లో ఉన్నాయి. వాటిని విశ్లేషించి, మాట్లాడితే స్వాగతిస్తాం. కానీ ఎక్కడా ఏ విశ్లేషణ చేయకుండా, ఎక్కడా లెక్కలు చెప్పకుండా.. రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా దిగజారిపోయిందని అర్ధంలేని ప్రకటన చేయించారు. ఒక అవగాహనతో మాట్లాడితే ఎవరైనా స్వాగతిస్తారు. కానీ అవేవీ లేకుండా ఒక అనామకుడితో మాట్లాడించి, ఒక పత్రిక రాయడం దారుణం.

రుణాలు.. నాడు–నేడు:
రాష్ట్రానికి సంబంధించిన రుణాలు (పబ్లిక్‌ డెట్‌)తో.. పబ్లిక్‌ ఎక్కౌంట్‌ వివరాలు చూస్తే.. ఆర్బీఐ నివేదిక ప్రకారం విభజన నాటికి.. అంటే 2014, మార్చి 31 నాటికి ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న అప్పులు రూ.1,96,202 కోట్లు. ఇంకా అప్పుడు తొలి రెండు నెలల్లో ఉన్న ద్రవ్య లోటు రూ.7,333 కోట్లు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో:
విభజన తర్వాత 58 శాతం వాటా ప్రకారం లెక్కిస్తే విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మిగిలిన అప్పు రూ.1,18,050 కోట్లు. అదే 5 ఏళ్లలో, 2019 మార్చి 31 నాటికి రూ.2.64 లక్షల కోట్లకు చేరుకుంది. ఆ తర్వాత రెండు నెలల్లో ద్యవ్యలోటు రూ.7346 కోట్లు. దాన్ని కూడా కలుపుకుంటే 2019, మే లో గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర రుణం మొత్తం రూ.2,71,797.56 కోట్లు.

మా ప్రభుత్వ హయాంలో:  ఆ తర్వాత మా ప్రభుత్వ హయాంలో, అంటే ఈ నాలుగేళ్లలో రాష్ట్ర రుణం మొత్తం రూ.4,42,442 కోట్లకు చేరింది. ఇది కూడా ఆర్బీఐ నివేదికలో స్పష్టంగా ఉంది. 

ప్రభుత్వ గ్యారెంటీ రుణాలు:
ఇదే కాకుండా, ప్రభుత్వ పూచీకత్తుతో, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు చూస్తే.. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న ఆ రుణాలు రూ.14,028.23 కోట్లు కాగా, ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి, అంటే 2019, మే నాటికి ఆ రుణాలు రూ.59,257.31 కోట్లకు పెరిగాయి.  ఆ తర్వాత నాలుగేళ్లలో.. ఈ ఏడాది మార్చి నాటికి ఆ రుణాల మొత్తం రూ.1,44,875 కోట్లు. ఇందులో దాదాపు రూ.45 వేల కోట్లు విద్యుత్‌ రంగానికి చెందినవే. ఆ సంస్థలే ఆ రుణాలు తిరిగి చెల్లిస్తాయి. అందుకే ఆ రుణాలన్నీ ప్రభుత్వానివి అని చెప్పడానికి లేదు. 2014 నాటికి ప్రభుత్వానికి ఉన్న అప్పులు, ప్రభుత్వ పూచీకత్తుతో ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు.. రెండూ కలిపి రుణభారం రూ.1.32 లక్షల కోట్లు కాగా.. 2019లో గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆ రుణాలు రూ.3.31 లక్షల కోట్లకు పెరిగాయి. ఆ తర్వాత నాలుగేళ్లలో రాష్ట్ర రుణభారం రూ.5.87 లక్షల కోట్లకు చేరింది.

గ్యారెంటీ లేని రుణాలు:
ఇంకా ప్రభుత్వ గ్యారెంటీలు లేకుండా, ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులు చూస్తే.. 2014 నాటికి విద్యుత్‌ రంగంలో జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల అప్పులు రూ.18,374 కోట్లు కాగా, ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి, ఆ అప్పుల మొత్తం రూ.59,692 కోట్లకు చేరింది. ఆ తర్వాత ఇక ఈ ప్రభుత్వ హయాంలో, ఈ ఏడాది మార్చి నాటికి ఉన్న ఆ రుణభారం రూ.56,017 కోట్లు. 

డిస్కమ్‌లు–బకాయిలు:
విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు, విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) ఇవ్వాల్సిన బకాయిలు చూస్తే.. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రూ.2893 కోట్ల బకాయిలు ఉండగా, 2019 నాటికి అవి రూ.21,540 కోట్లకు చేరాయి. అదే ఇప్పుడు ఆ బకాయిలు కేవలం రూ.8,455 కోట్లు మాత్రమే.

టీడీపీ కంటే మేం చేసిన అప్పులు తక్కువే:
మొత్తం మీద పబ్లిక్‌ డెట్‌ టు పబ్లిక్‌ ఎక్కౌంట్‌ (ప్రభుత్వ రుణాలు), ప్రభుత్వ పూచీకత్తుతో ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు,  ఆ పూచీకత్తు లేకుండా చేసిన అప్పులు.. అన్నీ కలిపి చూస్తే..  2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న మొత్తం రుణాలు రూ.1,53,346.80 కోట్లు కాగా, గత ప్రభుత్వం దిగిపోయే నాటికి, ఆ రుణాలు ఏకంగా రూ.4,12,288 కోట్లకు పెరిగాయి.

ఇక ఈ నాలుగేళ్లలో, అంటే ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్ర రుణ మొత్తం రూ.6,51,789 కోట్లకు చేరింది. టీడీపీ హయాంలో 5 ఏళ్లలో దాదాపు రూ.2.58 లక్షల కోట్ల అప్పులు పెరగ్గా.. ఈ ప్రభుత్వ హయాంలో 4 ఏళ్లలో రూ.2.38 లక్షల కోట్లు పెరిగాయి. అంటే ఎలా చూసినా గత ప్రభుత్వంలో కంటే, ఈ ప్రభుత్వ హయాంలో ఎక్కువ రుణాలు తీసుకోలేదన్నది స్పష్టమవుతోంది. టీడీపీ హయాంలో 21.87 శాతం సీఏజీఆర్‌ పెరగ్గా, ఈ ప్రభుత్వ హయాంలో 12.69 శాతం సీఏజీఆర్‌ మాత్రమే పెరిగింది.

రూ.10 లక్షల కోట్లు అని దుష్ర్పచారం:
నిజానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ రుణభారం రూ.6.51 లక్షల కోట్లు మాత్రమే కాగా, ఏ విధంగా రూ.10 లక్షల కోట్లు అని దుష్ప్రచారం చేస్తున్నారు? ఆ మిగతా అప్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారు? ఎవరైనా అలా లెక్క లేకుండా అప్పులు ఇస్తారా?.  అంత బాధ్యతారహితంగా ఆ పత్రిక ఎలా రాసింది? ఎవరికీ పరిచయం లేని వ్యక్తితో మాట్లాడించి, అలా ప్రచురించడం ఎంత వరకు సబబు? ఇది అభ్యంతరకరం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, అలా బాధ్యతారహితంగా ప్రచురించడం దారుణం. సీఏజీఆర్‌ ప్రకారం చూసినా, టీడీపీ హయాం కంటే, ఈ ప్రభుత్వ హయాంలో అప్పులు తక్కువగా పెరిగాయి. అయినా అదే పనిగా బురద చల్లడం దారుణం.

టీడీపీ హయాంలో కంటే రుణాల సేకరణ తగ్గింది:
2022–23లో కేంద్ర ప్రభుత్వ రుణాలు చూస్తే..  (డెట్‌ టు జీడీపీ) 55.89 శాతం కాగా, 2023–24 నాటికి 56.16 శాతం ఉంటుందని అంచనా. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కంటే, ఈ ప్రభుత్వ హయాంలో రుణాల సేకరణ తగ్గింది. అంటే ఏ రకంగా చూసినా, రాష్ట్ర ప్రభుత్వం రుణాలు ఏ మాత్రం ఎక్కువ కాదు. 
ఇంకా ప్రభుత్వం వృథా ఖర్చు చేస్తోందని, ఆ గుర్తు తెలియని అపరిచిత వ్యక్తి స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ప్రతి రెవెన్యూ వ్యయం వృథా ఖర్చు కానేకాదు.
ఉదాహరణకు:
మనం ఒక ఇల్లు కట్టుకుంటే అది క్యాపిటల్‌ వ్యయం కాగా, పిల్లలను స్కూల్‌కు పంపిస్తే అది రెవెన్యూ వ్యయం అవుతుంది. దేని ప్రాధాన్యం అదే. గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా ఒకేరోజు రూ.5 వేల కోట్ల అప్పు చేసి, పథకంలో భాగంగా పంపిణీ చేశారు. దాన్ని ఏ రకంగా సమర్థిస్తారో చెప్పలేదు.

పథకాలు–ప్రయోజనాలు:
విద్యా రంగంలో చేసిన వ్యయం వల్ల కలిగిన ప్రయోజనాలు చూస్తే.. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) గణనీయంగా పెరిగింది. గతంలో దేశంలో జీఈఆర్‌ 99 శాతం ఉంటే, అప్పుడు రాష్ట్రంలో అది 84.48 శాతం మాత్రమే. అన్ని రాష్ట్రాల కంటే తక్కువ. అదే ఈరోజు మన రాష్ట్ర జీఈఆర్‌ 100.1 శాతం. అంటే దేశ సగటు కంటే ఎంతో ఎక్కువ. దీనిపై స్పష్టంగా గణాంకాలు ఉన్నాయి. ఇదంతా విద్యా రంగంలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాల వల్లనే సాధ్యమైంది. 

గత ప్రభుత్వ హయాంలో కంటే దాదాపు రెట్టింపు విద్యా రంగంపై వ్యయం చేస్తున్నాం. అమ్మ ఒడి, గోరుముద్ద, మనబడి (నాడు-నేడు) విద్యాదీవెన, వసతి దీవెన, విద్యా కానుక.. ఇలా అనేక పథకాలు అమలు చేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం కోసం గత ప్రభుత్వం 5 ఏళ్లలో, ఏటా చేసిన సగటు వ్యయం రూ.553 కోట్లు కాగా, అందుకోసం ఈ ప్రభుత్వం ఏటా సగటున రూ.1209 కోట్లు ఖర్చు చేస్తోంది.

👉 పెన్షన్ల కోసం గత ప్రభుత్వం ఏటా సగటున రూ.5600 కోట్లు వ్యయం చేయగా, ఈ ప్రభుత్వం ఏటా సగటున రూ.17,694 కోట్లు వ్యయం చేస్తోంది. మరి దీన్ని కూడా వృథా వ్యయం అంటారా? 

👉 కోవిడ్‌ సమయంలో ప్రజలను ఆదుకోవడం కోసం, ఎక్కడా ఏ పథకాలు ఆపలేదు. రూ.2 లక్షల కోట్లకు పైగా ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా జమ చేయడం జరిగింది. కుక్‌ కమ్‌ హెల్పర్ల వేతనాలు కూడా పెంచడం జరిగింది.

ఆదాయం కోల్పోయాం:
కోవిడ్‌ వల్ల ఒకవైపు ప్రభుత్వ ఆదాయం తగ్గడం, మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో వాటా తగ్గడం వల్ల, ప్రభుత్వం దాదాపు రూ.66,116 కోట్ల ఆదాయం కోల్పోయింది.

అప్పటి కంటే తక్కువ ఫైన్లు:
వాహనమిత్ర పథకాన్ని ప్రస్తావిస్తున్న విపక్షం.. వాహనాల నుంచి ఫైన్లపైనా అసత్యాలు ప్రచారం చేస్తోంది. కానీ గత ప్రభుత్వ హయాంలో వాహనాల నుంచి ఫైన్ల రూపంలో ఏటా సగటున రూ.270.39 కోట్లు వసూలు చేయగా, ఈ ప్రభుత్వ హయాంలో ఆ మొత్తం రూ.183.94 కోట్లు మాత్రమే. అంటే ఎలా చూసినా, ప్రజలపై భారం వేయడం లేదు.

మూలధన వ్యయమూ ఎక్కువే:
కాగ్‌ (సీఏజీ) నివేదిక ప్రకారం మూలధన వ్యయం (క్యాపిటల్‌ ఎక్స్‌పెండీచర్‌) వివరాలు చూస్తే.. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో అందుకోసం చేసిన వ్యయం రూ.76,139 కోట్లు. అంటే ఏటా సగటు వ్యయం రూ.15,227.80 కోట్లు. అదే మా ప్రభుత్వ హయాంలో, ఈ నాలుగేళ్లలోనే రూ.75,411 కోట్లు మూలధన వ్యయం కింద ఖర్చు చేయడం జరిగింది. అంటే ఏటా సగటు వ్యయం రూ.18,852 కోట్లు. ఏ విధంగా చూసినా, గత ప్రభుత్వం కంటే ఇప్పుడు తక్కువ రుణాలు చేస్తూ.. ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, అయినా విపక్షంతో పాటు, ఎల్లో మీడియాలో అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారని శ్రీ దువ్వూరి కృష్ణ ఆక్షేపించారు.

ఏపీ ఆర్థిక పరిస్థితులపై జీవీ రావు అనే వ్యక్తి తప్పుడు విశ్లేషణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దువ్వూరి కృష్ణ. ఐసీఏఐ నుంచి ఆయన్ని తొలగించిన విషయాన్ని ఈ సందర్భంగా కృష్ణ గుర్తు చేశారు. అలాగే.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారాయన.

చదవండి: ఏపీ అప్పులపై ఈనాడు అర్థం, పర్థం లేని వార్తలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement