- వ్యాధులపై అవగాహన కల్పించాలి
- ఆస్పత్రి అభివృద్ధి నిధులు వినియోగించాలి
- కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్
పాడేరు, న్యూస్‌లైన్: ఎపిడమిక్ దృష్ట్యా వ్యాధులు విజృంభిస్తున్నందున వైద్యఆరోగ్య,మలేరియాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఆదేశించారు. బుధవారం పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో ఎస్‌పీహెచ్‌వోలు,వైద్యులు, మలేరియాశాఖల అధికారులతో సమీక్షించారు.
కలెక్టర్ మాట్లాడుతూ గత అనుభవాల దృష్ట్యా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. మలేరియా రోగులను గుర్తించాలని, వారు సక్రమంగా మందులు వేసుకునేలా వైద్యసిబ్బంది పర్యవేక్షించాలన్నారు. ముందుగా ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశమై ఎపిడమిక్‌లో వచ్చే వ్యాధులు, నివారణ చర్యలపై గిరిజనులకు అవగాహన కల్పించాలన్నారు.
దోమ తెరల వినియోగం, దోమల నివారణ మందు పిచికారీ, పారిశుధ్యం తదితర అంశాలపై ఆరా తీయాలన్నారు. హైరిస్క్ గ్రామాలలో వ్యాధులు రాకుండా వైద్యాధికారులు నిరంతరం తనిఖీ చేయాలన్నారు. వ్యాధులు సంక్రమించకుండా నివారణ చర్యలు తీసుకోవలసిన బాధ్యత వారిపైనే ఉందన్నారు.
వైద్యాధికారులు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను పూర్తిగా పరిశీలించి సక్రమంగా అమలు చేయాలన్నారు. వైద్యసిబ్బంది, ఆశ కార్యకర్తల వద్ద పూర్తిస్థాయిలో మందులు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాడేరు ఐటీడీఏ పీవో వి.వినయ్‌చంద్ మాట్లాడుతూ ఆస్పత్రి అభివృద్ధి నిధులతో పీహెచ్‌సీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.
దుప్పట్లు, కర్టెన్లు కొనుగోలు చేయాలని, ఆస్పత్రి అభివృద్ధికోసం మంజూరు చేసిన నిధులను సక్రమంగా ఖర్చు చేయాలన్నారు. ఎస్పీహెచ్‌ఓలు తమ పరిధిలోని పీహెచ్‌సీలలో మంచినీటి సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు శుక్రవారం తనకు అందజేయాలన్నారు. గ్రామ ఆరోగ్య, పారిశుధ్య నిధులను వినియోగించి గ్రామాల్లో పారిశుధ్య పనుల చేయాలన్నారు.
దోమల మందు పిచికారీ పనులపై వైద్యాధికారులకు పూర్తిస్థాయి అవగాహన ఉండాలన్నారు. సమావేశంలో ఆర్‌డీవో జి.రాజకుమారి, ఏపీవో పీవీఎస్ నాయుడు, డీఎంహెచ్‌వో శ్యామల, డీఎంవో ప్రసాదరావు, డీసీహెచ్‌ఎస్ నాయక్, 11 మండలాల ఎస్పీహెచ్‌వోలు, వైద్యాధికారులు పాల్గొన్నారు.