నల్లగొండ : వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులపై (బీఆర్‌జీఎఫ్)ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నా యి. 2014-15 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు రావాల్సిన రూ.33.80 కోట్లు విడుదల చేయడంలో కేంద్రం తీవ్ర జాప్యం చేస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో జిల్లాలో చేపట్టాల్సిన వివిధ రకాల అభివృద్ధి పనులు మరుగునపడ్డాయి. నిధుల ఎప్పుడు వస్తాయన్న ఆశతో జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఎదరుచూస్తున్నారు.
ఇటీవల సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన సందర్భంలో కూడా ఈ నిధుల మంజూరు గురించి కేం ద్రంతో చర్చించడం జరిగింది. మరికొంత ఆలస్యమైనప్పటికీ జిల్లాకు రావాల్సిన నిధులు తప్పక వస్తాయని అధికారులు చెబున్నారు. అయితే గతేడాది నిధులతో ప్రమేయం లేకుండానే 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాకు రూ. 33.50 కోట్లు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిధులకు సంబంధించి కొత్త వా ర్షిక ప్రణాళిక రూపొందించేందుకు 70 రోజుల గడువు విధించింది. అప్పటిలోగా గ్రామసభలు, మున్సిపాల్టీల్లో వార్డుసభలు నిర్వహించి పనులు గుర్తించాలని పేర్కొంది. ఎప్పటి మాదిరే ఈ నిధుల్లో గ్రామ పంచాయతీలకు 50 శాతం, మండల పరిషత్‌లకు 30 శాతం, జిల్లా పరిషత్, అర్బన్ ప్రాంతాలకు 20 శాతం నిధులు కేటాయించనున్నారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డుగా ఉన్నందున సభలు నిర్వహించేందుకు వీల్లేదు. వచ్చే నెలాఖరు వరకు కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి కేంద్రం విధించిన 70 రోజుల్లో 40 రోజుల సమయం వృథా అయినట్లే. గతేడాది కూ డా వరుస ఎన్నికల కోడ్ కారణంగానే ప్ర తిపాదనలు రూపొందించడం ఆలస్యమైంది. పర్యవసానంగా ఇప్పటివరకు ని ధులు విడుదల కానీ పరిస్థితి ఏర్పడింది.
అన్నీ అవరోధాలే...
ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం..మరోవైపు వరుస ఎన్నికల కారణంగా గతేడాది రావాల్సిన బీఆర్‌జీఎఫ్ నిధులు రాకుండా పోయాయి. వాస్తవానికి ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో ప్రతిపాధనలు పం పితే జూన్‌లో ఈ నిధులు వస్తాయి. ప్రతి పాదనలకు ముందు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం, త ర్వాత జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ) గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. 2014-15 బీఆర్‌జీఎఫ్ ప్రతిపాదలనకు స్థానిక, సార్వత్రిక ఎన్నికలు ప్రతిబంధకంగా మారాయి.
ఎన్నికల నోటిఫికేషన్, ప్రక్రియ తదితర కారణాలతో ఈ వ్యవహారం డోలాయమానంలో పడింది. కొన్ని జిల్లాలో అప్పుడున్న శాసనసభ్యులు, మంత్రులు అధికారులతో మాట్లాడి హైపవర్ కమిటీకి ప్రతిపాదనలు పంపగా..జిల్లాలో మాత్రం బీఆర్‌జీఎఫ్ ప్రతిపాదనలకు నోచుకోలేదు. జెడ్పీకి కొత్త పాలకవర్గం వచ్చాక సెప్టెంబర్‌లో డీపీసీ ఆమోదంతో రూ.33.80 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపారు. ప్రతిపాదనలు పంపి ఆరు మాసాలు కావస్తున్నా నిధుల ఊసు లేదు.
జూన్‌లో హైపవర్ కమిటీకి చేరి ఉంటే...
వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద చేపట్టే పనులకు ఉన్నతాధికారులు మే నెలలోనే ప్రత్యేక అధికారులనుంచి ప్రతిపాదనలు కోరారు. గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో పనులు గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ అప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యింది. దీంతో ప్రతిపాదనలు కేంద్రానికి పంపకుండా ఆపేశారు.
ఎన్నికల అనంతరం జెడ్పీటీసీలు, ఎంపీపీలు అధికారంలోకి రావడంతో అధికారులు రూపొందించిన ప్రతిపాదనలు మళ్లీ మార్చాల్సి వచ్చింది. ప్రజాప్రతినిధుల సూచనల మేరకు కొత్త ప్రతిపాదనలు రూపొందించి డీపీసీ ఆమోదం పొందే నాటికి పరిస్థితి చేయి దాటిపోయింది. ప్రతిపాదనలు హైపవర్ కమిటీ చేరడం ఆలస్యం కావడంతో ఇప్పటివరకు నిధులు రాకుండా ఆగిపోయాయి.
పంపకాలు సవ్యంగా జరిగేనా...?
గతేడాది ప్రతిపాదనలకు వరుస ఎన్నికలు అడ్డంకిగా నిలిస్తే..ఈ ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ప్రతిబంధకంగా మారింది. 70 రోజుల గడువులోగా ప్రతిపాదనలు పంపడం ఆలస్యమైతే మొదటి విడత జూన్, జులైలో విడుదల కావాల్సిన నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇదిలా ఉంటే గతేడాది జెడ్పీ చైర్మన్ కాంగ్రెస్‌లో ఉన్నారు కాబట్టి వచ్చిన నిధుల్లో పంపకాలు సవ్యంగా సాగాయి. కానీ ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చైర్మన్ టీఆర్‌ఎస్‌లోకి చేరడంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీల వాటాల పంపకంలో వివాదాలు మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే నిధుల పంపకంలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని జెడ్పీటీసీలు గుర్రుగా ఉన్నారు. అలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కొత్త పనుల ప్రతి పాధనులు సకాలంలో చేరుతాయా..?లేదా..? అన్నది వేచిచూడాల్సిందే.