ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ కె.కేశవరావు. చిత్రంలో నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, కవిత తదితరులు
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.86 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే పార్లమెంట్ సాక్షిగా చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ ఎంపీలు ఖండించారు. దమ్మూ ధైర్యముంటే కేంద్రం ఈ విషయాన్ని నిరూపించాలని వారు డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు వేల కోట్ల రూపాయలు కాదు.. ఒక్క రూపాయి, కనీసం ఒక్క పైసా ఇచ్చినట్లు బీజేపీ నిరూపిస్తే రాజీనామాలు సహా దేనికైనా రెడీ అని సవాల్ విసిరారు. బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే పార్లమెంట్‌ను తప్పుదారి పట్టించారన్న బీఆర్‌ఎస్ ఎంపీలు, ఆయనపై చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చామన్నారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని వారు ఆరోపించారు.
ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో గురువారం మధ్యాహ్నం బీఆర్‌ఎస్ ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్రలు మీడియాతో మాట్లాడుతూ, గత తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ సాయం లేకుండానే తెలంగాణ అభివృద్ధి జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని ఎన్నిసార్లు అడిగినా ఎలాంటి లాభం లేకపోయిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రధాని, హోంమంత్రిని కలిసి విన్నవించారని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో నిర్మించిందన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలో అడిగిన ప్రశ్నోత్తరాల్లోనే ఒప్పుకుందన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు, నవోదయ విద్యాలయాల మంజూరు విషయంలోనూ జరిగిన నష్టాన్ని అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో దేశం దృష్టికి తీసుకెళ్లామన్నారు. అంతేగాక కేంద్రానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పును మాఫీ చేయాలన్నారు. రేవంత్‌రెడ్డి రాజకీయంగా పోరాడాలే తప్ప లిక్కర్, నిక్కర్ అంటూ పిచ్చి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ల గురించి మాట్లాడేటప్పుడు రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment