సాక్షి, హైదరాబాద్: అసంతృప్తులను చల్లార్చేందుకు బీఆర్‌ఎస్ అధిష్టానం రంగంలోకి దిగింది. ఖమ్మం సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం భేటీ అయ్యారు. గంటకు పైనే ఇద్దరూ చర్చించినట్లు సమాచారం.
పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తుమ్మల టికెట్ ఆశించారు. అయితే ఆ టికెట్‌ను కందాల ఉపేందర్‌రెడ్డికి కేటాయించింది అధిష్టానం. దీంతో తుమ్మల అనుచరులు అసమ్మతి గళం లేవనెత్తారు. నిన్నంతా సమావేశమై పార్టీ నుంచి బయటకు రావాలంటూ తుమ్మలకు సూచించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు తుమ్మల సైతం టికెట్ దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ వైపు ఆయన చూస్తున్నారని చెప్పుకుంటున్నారు.
దీంతో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తుమ్మలతో చర్చించాలని నామా నాగేశ్వరరావును ఆదేశించారు. ఈ క్రమంలోనే ఇవాళ వాళ్ల భేటీ జరిగింది. మరోవైపు తుమ్మల తరహా నేతలు మరికొందరితోనూ చర్చించాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం.
తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానం టీడీపీతో ప్రారంభమైంది. 1983 ఎన్నికల్లో ఓడారాయన. ఆపై సత్తుపల్లి నుంచి 1985, 1994, 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నెగ్గారు. 2009లో ఖమ్మం నుంచి నెగ్గారు. 2014 విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో 6 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారాయన. ఎమ్మెల్సీగా మంత్రి బాధ్యతలు చేపట్టారు కూడా. అప్పటి నుంచి పాలేరు కేంద్రంగా రాజకీయం నడిపిస్తున్నారాయన. 2016లో పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక జరగ్గా.. తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. అయితే.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ దఫా కూడా ఆయన పాలేరు నుంచి టికెట్ ఆశించారు.
Comments
Please login to add a commentAdd a comment