సబ్బండవర్ణాల సంక్షేమపథంలో.. | TRS MLA Solipeta Ramalinga Reddy Write Article On TRS Plenary | Sakshi
Sakshi News home page

సబ్బండవర్ణాల సంక్షేమపథంలో..

Published Fri, Apr 27 2018 12:45 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

TRS MLA Solipeta Ramalinga Reddy Write Article On TRS Plenary - Sakshi

సందర్భం

అంపశయ్య మీదున్న అన్నదాతకు ఊపిర్లు ఊది మళ్లీ పొలం మీదకు పంపే మహా ప్రయోగశాలగా తెలంగాణ నేడు దేశం ముందు నిలబడింది. సంచలనాలకు కేంద్రమైన కాళేశ్వరం ప్రాజెక్టు, దూపగొన్న ప్రతి గొంతును తడిపేందుకు మిషన్‌ భగీరథ, కులవృత్తుల పునర్జీవనం కోసం వివిధ పథకాలు భవిష్యత్తు బంగారు తెలంగాణ ముఖ చిత్రాన్ని ఆవిష్కరిస్తాయని సబ్బండ జాతులు కాంక్షిస్తున్నాయి. సబ్బండ వర్ణాల సంక్షేమ పథంలో ఈ ప్లీనరీ ఒక మేలిమలుపు కాగలదని అందరూ ఆశిస్తున్నారు.

1946 నుంచి 1951 వరకు ఎగసిన తెలంగాణ సాయుధ పోరాటం ప్రభావంతో తెలంగాణ  ప్రజల్లో  స్వీయ సామాజిక– సాంస్కృతిక  స్పృహలు పెరిగాయి. 1956–71 మధ్య  కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఒక వర్గంలో విద్య,  కొద్ది మేర ఆర్థిక కార్యకలాపాలు, మధ్యతరగతి జీవన ప్రమాణాలు పెరుగుతూ వచ్చాయి. మరో వర్గం  తెలంగాణ వనరుల దోపిడీ వ్యతిరేకత,  ఉమ్మడి రాష్ట్రంలో స్థానికేతరుల పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ నక్సలిజం వైపు మళ్లింది. ఈ ఉద్యమంతో తెలంగాణ సమాజం స్వీయ అస్తిత్వం, స్వీయ ఆర్థిక, రాజకీయ స్పృహలు బలపడ్డాయి. పై రెండు∙ఉద్యమాల కారణంగానే  భూస్వామ్య పెత్తందారి  వర్గాలు  గ్రామాలను వదిలిపెట్టి పట్టణాలకు వలస పోయి అక్కడి సురక్షితమైన వ్యాపారాల్లోకి ప్రవేశించారు. 

దొరల పలాయనం పల్లెల్లో చదువులను, చైతన్యాలను పెంచాయి. సామాజిక, రాజకీయ చైతన్యం పురివిప్పుకుంది. ఇవన్నీ కలగలిసి తెలంగాణ ప్రాంతంలో ఒక యువతరం ఉనికిలోకి వచ్చింది. తెలంగాణవాద సోయికి ఇదో పునాది. 1991– 2001 మధ్య కాలం వచ్చేసరికి అనేక కారణాలతో నక్సలిజం బలహీనపడుతూ ఆయుధం పట్టిన యువకుల వలసలు జనజీవన స్రవంతిలోకి మళ్లాయి. కానీ వారిలోని మానసిక అలజడి మాత్రం అలాగే  కొనసాగుతూ వచ్చింది. తొలి నాళ్లలో సాయుధ పోరాట చైతన్యం, ఉనికిలోకి వచ్చిన యువతరం,మాజీ నక్సల్‌ తరం, ఏళ్లకేళ్లుగా దోపిడీకి మగ్గిన తరం అందరూ కలిసి నీళ్లు, నిధులు, నియామకాలను ఒక అనువైన నినాదంగా తీసుకున్నారు. ఈ నినాదాన్ని అందుకొనే కేసీఆర్‌  తెలంగాణ రాష్ట్ర సమితికి పురుడు పోశారు.

ఆ కాల్పులే మహోద్యమానికి నాంది
2001లో సిద్దిపేటలో జరిగిన  డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ జయంతి వేడుకల వేదిక మీద తొలిసారి కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రస్తావన తీసుకు వచ్చారు. అంతకు ముందు బషీర్‌బాగ్‌ వద్ద విద్యుత్తు ధరల తగ్గింపు కోసం ఆందోళన చేస్తున్న రైతులపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాల్పులు జరిపింది. ఈ ఘటనతో తీవ్రంగా చలించిన కేసీఆర్‌ బూరుగుపల్లి సభా వేదిక నుంచే అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి ప్రత్యక్షంగా రాష్ట్ర సాధన ఉద్య మానికి అంకురార్పణ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర ధనికవర్గాల ఆధి పత్యంపై 1950 నుంచి ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. అయితే అటువంటి ఘర్షణలను దోపిడీ పట్ల వ్యతిరేకత అనే ముద్రతోనే చూశారు తప్ప తెలం గాణ జాతి స్పృహగా గుర్తించలేదు. 

1956 నుంచి 2001 వరకు తెలంగాణ ప్రాంతం కోసం, ప్రజల కోసం నిలబడిన నేతలను వేళ్ల మీద లెక్కపెట్ట వచ్చు. అలా నిలబడిన వారు కూడా వ్యక్తులుగానే ఉన్నారు. ఆæక్రమంలో టీఆర్‌ఎస్‌ ఆరంభం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు జీవం పోసింది. అక్కడ మొదలైన రాష్ట్ర ఏర్పాటు పోరాట ప్రస్థానం 13 ఏండ్లకు సాకా రమైంది. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష సిద్ధించింది.  ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన  తెలంగాణ రాష్ట్ర సమితి మరోమారు పార్టీ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నది. గతంలో జరిగిన ప్లీన రీలు పార్టీగా స్వరాష్ట్ర ప్రజలకు ఏం చేయాలన్న దానిపై దిశానిర్దేశం చేసుకునేం దుకు జరిగినవి అయితే, ఇప్పుడు జరుగుతున్న ప్లీనరీలో ప్రజలకు ఏం చేశా మన్న దానిపై సమీక్ష జరుపుకోవాల్సి ఉన్నది.. రైతులకు సాగునీరు, విద్యుత్‌ను అందించేందుకు, వారికి ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు గత నాలుగేళ్లలో జరి గిన నిర్విరామ కృషి బంగారు తెలంగాణ నిర్మాణానికి ఎన గర్రలుగా నిలబ డ్డాయి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఇదే వేగంతో కొనసాగితే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని సబ్బండ వర్ణాలు భావిస్తున్నాయి.

మన పాలన మన  చేతికి వచ్చే నాటికే  వ్యవసాయం, కుల వృత్తుల విధ్వంసం జరిగిపోయింది. తెలంగాణ పల్లెలో ఇప్పటికీ బోర్లు వేస్తే.. 1000 ఫీట్లు లోతుకు వెళ్లినా నీళ్లు రాని దుస్థితి. ఒక బోరు వేసినప్పుడు నీళ్లు రాక పోతే ఇంకో బోరు వేయటం.. ఇలా నీటి చెమ్మ కోసం ఐదు.. పది.. పదిహేను బోర్లు వేసి రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నారు. నల్లగొండ జిల్లా మూసంపల్లిలో బైరా రామిరెడ్డి అనే రైతు 54 బోర్లు వేసి బోర్ల రామిరెడ్డి అయ్యాడని సీఎం కేసీఆర్‌ 2015 సెప్టెంబర్‌ మాసంలో జరిగిన  శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించి  రైతు కన్నీటి నీటి గోస ఎలా ఉందో విడమరిచి  చెప్పారు. కృష్ణా, గోదావరి నదులలో తెలంగాణకు 1257 టీఎంసీల వాటా ఉందని అధికారిక నివేదికలు చెప్తున్నాయి. ఇందులో 954 టీఎంసీలు గోదా వరి నుంచి, 299 టీఎంసీలు కృష్ణానది నుంచి. మేజర్, మీడియం, మైనర్‌ ఇరిగేషన్‌ కలిపి తెలంగాణకు 1071 టీఎంసీల జలాలు ఇచ్చినట్టు ఉమ్మడి రాష్ట్ర పాలకులు నివేదికల్లో పొందుపరిచారు. 

కాళేశ్వరం ఒక సంచలన ప్రయోగశాల
అయితే తెలంగాణలో అందుబాటులో ఉన్న సాగు భూమికి రకరకాల లెక్కలు ఉన్నాయి.  అడవులు, గ్రామ కంఠాలు పోను ఒక కోటీ 11లక్షల ఎకరాల వ్యవ సాయ భూమి ఉంది. మరి 1071 టీఎంసీల కేటాయింపులు చేస్తే కోటి ఎకరాల మాగాణి నీళ్లెందుకు పారలేదనేది బేతాళ ప్రశ్నగా మిగిలిపోయింది. ఇప్పుడు వాటా జలాలను సంపూర్ణంగా మన బీడు భూముల్లోకి మళ్లించు కునే ప్రయత్నం జరుగుతోంది.  గోదావరి, కృష్ణా  నదుల మీద 23  ప్రాజెక్టుల నిర్మాణానికి రూపకల్పన జరిగింది. ఇందుకోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు జరుగుతోంది. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టు, భక్తరామదాస ప్రాజెక్టు, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల, దేవాదుల, ప్రాణహిత, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, జూరాల, కోయిల్‌ సాగర్, ఎస్సా రెస్పీ1,2, ఆర్డీఎస్, ఎస్సెల్బీసీ, ఎల్లంపల్లి, కంతనపల్లి ప్రాజెక్టులకు రూపం వచ్చింది. 

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా రూపం దాల్చకముందే  ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది సందర్శించిన జల ప్రాజెక్టుగా రికార్డు కొట్టింది. తెలంగాణ  రాష్ట్రం ఏర్పడినప్పుడు  5,683 మెగావాట్ల విద్యుత్తు సామ ర్థ్యం ఉంది. అందులో అనేక సాంకేతిక కారణాలతో ఎప్పుడూ 2,500 మెగా వాట్లకు మించి వాడుకోలేని పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో వేసవిలోనైతే వ్యవ సాయానికి 1,000 మెగావాట్లు కూడా అందేది కాదు. నాలుగేళ్ల తర్వాత తిరిగి చూసుకుంటే రూ. 5500 కోట్ల ఖర్చుతో 24 గంటల నాణ్యమైన నిరంతరాయ విద్యుత్తును రైతాంగానికి ప్రభుత్వం అందిస్తోంది. ఒకప్పుడు వ్యవసాయ కరెంటు కోసం రోడ్డెక్కిన రైతులు ఇప్పుడు 24 గంటల కరెంటు వద్దు అనే పరిస్థితిలోకి వచ్చారు. 

భూపాలపల్లి కేటీపీపీ నుంచి 600 మెగావాట్లు, జైపూర్‌ సింగరేణి పవర్‌ ప్రాజెక్టు  నుంచి 1,200 మెగావాట్లు, థర్మల్‌ పవర్‌టెక్‌ ద్వారా 840 మెగావాట్లు, సెంట్రల్‌ జనరేటింగ్‌ సిస్టం ద్వారా 550 మెగావాట్లు, జూరాల హైడ్రోపవర్‌ ప్రాజెక్టు నుంచి  240 మెగావాట్లు, పులిచింతల ప్రాజెక్టు నుంచి 30 మెగావాట్లు, సోలార్‌ పవర్‌  నుంచి 1080 మెగావాట్లు, విండ్‌ పవర్‌ నుంచి 99 మెగావాట్లు మొత్తం కలిపి ఈ నాలుగేళ్లలో మరో 5,039 మెగావాట్ల విద్యుత్తు అదనంగా ప్రభుత్వం అందుబాటులోకి వచ్చింది. 

ఈలోగా రైతులను ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించే సూక్ష్మ ప్రణాళికలు రాష్ట్రంలో అమలు అవుతున్నాయి..  కళ్యాణ లక్ష్మి పథకం అమలు ఇందులో భాగమే. పేదింటి ఆడబిడ్డ సగౌరవంతో అత్తవారింట అడుగు పెట్టేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్‌  అమల్లోకి వచ్చాయి. మొదట దళిత, గిరిజను లకు మాత్రమే పరిమితమైన పథకాన్ని వెనుకబడిన అన్ని వర్గాలకు విస్తరిం చారు. రూ 50001 నుంచి రూ ఒక లక్షా నూట పదహార్లకు పెంచారు. పెళ్లితోనే అయిపోలేదు. తెలంగాణ పల్లెల్లో బిడ్డ మొదటి పురుడు తల్లిగారింట్లోనే జర గాలనే ఆచారం ఉంది. బిడ్డను ప్రయివేటు ఆసుపత్రికి తీసుకొని పోయి కాన్పు చేసుకొని తల్లీబిడ్డను ఇంటికి తీసుకొచ్చుకునేసరికి మరో రూ 40 వేలు ఖర్చు.  

రైతుకు ఈ బాధ తప్పించడానికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రయివేటుకు దీటుగా అధునాతన వైద్య, మిషనరీ సౌకర్యాలు కల్పించారు. తల్లీ బిడ్డలకు రూ 16 వేలను అందిస్తున్న కేసీఆర్‌ కిట్‌ పథకం మాతృ శిశు సంక్షేమం కోరుకుంటోంది. నా నియోజకవర్గం దుబ్బాకలో ఒకప్పుడు తొండలు గుడ్లు పెట్టిన ప్రభుత్వ ఆసు పత్రిలో ఈ రోజు నెలకు కనీసం 40కి పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. ఈ లెక్కన చూస్తే రైతుకు పెళ్లి భారం రూ ఒక లక్షా నూట పదహార్లు, పురుడు రూ 40 వేలు, దానికి వడ్డీ భారం తప్పి, ఇప్పుడు జన్మనిచ్చిన తల్లి చేతికే రూ. 14 వేలు అందుతున్నాయి. 

అన్నదాతలకు సరికొత్త ఊపిరి భగీరథ
ఊట బావులు, చెరువులు, చెలిమెలు తప్ప మరో నీటి వనరు లేని ప్రాంతం తెలంగాణ. అయినా నేలను దున్ని బతకటం తప్ప మరో గత్యంతరం లేదు. అందుకే ముందుగా చెరువులు బాగు చేసే పనులు పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల చెరువులను, కుంటలను పునర్నిర్మాణం చేసే మహా యజ్ఞం చేపట్టారు. మిషన్‌ కాకతీయతో చెరువుల్లో, భూగర్భ జలాలతో కలిపి 500 టీఎంసీల నీళ్లు నిల్వ చేసినట్టే అని జాతీయ పరిశోధక సంస్థలు వెల్ల డించాయి. భూస్వామి ఇంటి ముందే కాదు, దళిత, గిరిజనుల ఇళ్ల ముందూ ట్రాక్టర్లను నిలబెట్టింది. యంత్రలక్ష్మీ పథకం కింద వ్యవసాయ పరికరాలను రైతులకు ఇవ్వడం కోసం గత మూడేళ్ళలో రూ.1,109 కోట్లు సబ్సిడీగా ఇచ్చింది.  రైతుబంధు పథకం ద్వారా  రాష్ట్ర రైతులకు పెట్టుబడిగా ఎకరాకు రూ. 4000 ఇవ్వనుండటం అద్భుతం. 

వచ్చే వానాకాలం నుంచే ఈ పథకం అమలవుతోంది. ఇందుకోసం ముఖ్యమంత్రి బడ్జెట్‌లో రూ. 12,000 కోట్లు కేటాయించారు. మే 10 నుండి వారం రోజులు 58 లక్షల మంది రైతులకు చెక్కులను పంపిణీ చేస్తారు. పట్టెడన్నం పెట్టే అన్నదాత పురుగుల మందు బారిన పడకుండా, అప్పులు తీరి, ఆదాయం పెరిగి, రైతులు ఆత్మాభిమా నంతో బతకాలన్నదే కేసీఆర్‌ ఆలోచన. అంపశయ్య మీదున్న అన్నదాతకు  ఊపిర్లు ఊది మళ్లీ పొలం మీదకు పంపే మహా ప్రయోగశాలగా తెలంగాణ వేదిక అయింది. దూపగొన్న ప్రతి గొంతును తడిపేందుకు మిషన్‌ భగీరథ, కుల వృత్తుల పునర్జీవనం కోసం గొర్రెల పథకం, చేపల పెంపకం, గీత, నేత న్నలకు వరాలు అన్నీ కలిసి భవిష్యత్తు బంగారు తెలంగాణ ముఖచిత్రాన్ని ఆవిష్కరిస్తాయని సబ్బండ జాతులు కాంక్షిస్తున్నాయి.   
(నేడు తెలంగాణ రాష్ట్ర సమితి  ప్లీనరీ  సందర్భంగా)


 -సోలిపేట రామలింగారెడ్డి 
 వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు, దుబ్బాక శాసన సభ్యులు
 మొబైల్‌ : 94403 80141

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement