పక్కా లోకల్‌ ! | Cabinet Has Approved 7 New Zones, CM KCR leaves for Delhi | Sakshi
Sakshi News home page

పక్కా లోకల్‌ !

Published Mon, May 28 2018 1:14 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

Cabinet Has Approved 7 New Zones, CM KCR leaves for Delhi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్తగా ఏర్పాటు చేయనున్న 7 జోన్లు, 2 మల్టీ జోన్ల వ్యవస్థకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జోన్ల వ్యవస్థపై రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని కోరుతూ కేంద్రానికి పంపించే ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది. ఎల్‌ఐసీ ద్వారా రైతులకు జీవిత బీమా కల్పించే పథకానికి అంగీకారం తెలిపింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జోన్ల వ్యవస్థ, రైతులకు జీవితబీమా పథకంపై విస్తృతంగా చర్చ జరిగింది. 

అనంతరం మంత్రివర్గం ఏకగ్రీవంగా ఈ రెండింటిని ఆమోదించింది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటవుతాయి. కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి, యాదాద్రి, చార్మినార్, జోగులాంబ జోన్లుగా ఏర్పడుతాయి. ఒకటో మల్టీ జోన్‌లో కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి జోన్లు, రెండో మల్టీ జోన్‌లో యాదాద్రి, చార్మినార్, జోగులాంబ జోన్లుగా ఉంటాయి. ఉద్యోగుల నియామకానికి జిల్లా, జోన్, మల్టీ జోన్, స్టేట్‌ కేడర్లు ఉంటాయి. స్టేట్‌ కేడర్‌ పోస్టులను కచ్చితంగా పదోన్నతి ద్వారానే భర్తీ చేస్తారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు కనీసం నాలుగు సంవత్సరాలు ఎక్కడ విద్యాభ్యాసం చేస్తారో, ఆ ప్రాంతాన్నే సదరు అభ్యర్థి స్థానిక ప్రాంతం (లోకల్‌ ఏరియా)గా గుర్తిస్తారు. 

అన్ని పోస్టులకు 95 శాతం లోకల్, 5 శాతం ఓపెన్‌ కేటగిరీగా ఉంటుంది. టీఎన్‌జీవోల సంఘం గౌరవాధ్యక్షుడు దేవీ ప్రసాద్, గెజిటెడ్‌ అధికారుల సంఘం గౌరవాధ్యక్షుడు వి.శ్రీనివాస గౌడ్, టీఎన్‌జీవోల సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డిలను ఈ కేబినెట్‌ సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించి ప్రభుత్వ నిర్ణయాన్ని తెలిపారు. జోన్ల వ్యవస్థకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని ప్రధానిని కోరేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేబినెట్‌ సమావేశం అనంతరం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. 

పంద్రాగస్టు నుంచి బీమా పత్రాలు
రాష్ట్రంలోని 18–60 ఏళ్ల వయసున్న ప్రతీ రైతుకు రూ.5 లక్షల జీవిత బీమా వర్తించనుంది. ఎల్‌ఐసీ ద్వారా ఈ బీమా అమలు చేస్తారు. ప్రతీ రైతుకు రూ.2,271 చొప్పున ప్రతీ ఏడాది ప్రభుత్వం ప్రీమియం చెల్లించనుంది. బీమా ప్రీమియానికి సంబంధించిన సొమ్మును బడ్జెట్లోనే కేటాయించనుంది. జూన్‌ 2 నుంచి రైతుల నుంచి నామినీ ప్రతిపాదన పత్రాలు సేకరిస్తారు. ఆగస్టు 15 నుంచి బీమా సర్టిఫికెట్లు అందిస్తారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితికి ఎండీతోపాటు ఇతర సిబ్బందిని నియమిస్తారు. వైద్య ఆరోగ్య శాఖలో టీచింగ్‌ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయో పరిమితిని 58 నుంచి 65 సంవత్సరాలకు పెంచుతారు. 

పదోన్నతులతోనే సూపర్‌ వైజర్‌ గ్రేడ్‌–2 పోస్టుల భర్తీ 
ఐసీడీఎస్‌లో సూపర్‌ వైజర్‌–గ్రేడ్‌ 2 పోస్టులను వందకు వందశాతం పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. అంగన్‌వాడీ టీచర్లలో అనుభవజ్ఞులు, అర్హతలు కలిగిన వారినే సూపర్‌ వైజర్లుగా నియమించాలని చెప్పారు. సూపర్‌ వైజర్ల నియామకానికి సంబంధించి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ముఖ్య కార్యదర్శి శాంతాకుమారి తదితరులతో సీఎం చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో అంగన్‌వాడీ టీచర్లకున్న అనుభవాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement