ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు
సాక్షి, హైదరాబాద్: రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని 25 రోజుల్లో వంద శాతం పూర్తి చేయాలని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. జిల్లాకు ఒకరు చొప్పున మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను ఇన్‌చార్జులుగా నియమిం చాలని నిర్ణయించారు. పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జిల్లాకో ఐఏఎస్ అధికారిని స్పెషలాఫీసర్‌గా నియమించారు. ఈ నెల 24 నుంచి జూన్ 20 వరకు 25 రోజుల పాటు అధి కార యంత్రాంగమంతా ఇదే కార్యక్రమంలో నిమగ్నం కావాలని చెప్పారు. బుధవారం ప్రగతిభవన్‌లో బుక్కులు, చెక్కుల పంపిణీపై సీఎం కేసీఆర్ ఆరు గంటలపాటు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.
స్పీకర్ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ముఖ్య కార్యదర్శులు, అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘‘ఈ రోజు వరకు జరిగిన భూముల అమ్మకం, కొనుగోలు వివరాలన్నీ నమోదు చేయాలి. అన్ని రకాల మ్యుటేషన్లు చేయాలి. వారసత్వ హక్కులు తేల్చాలి. కొత్తగా నమోదైన వివరాలతో పాస్ బుక్కులు ముద్రించి పంపిణీ చేయాలి. ఇప్పటికే జారీ చేసిన పాస్ పుస్తకాల్లో తప్పులుంటే వెంటనే వాటిని సవరించి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలి. గుంట భూమికి కూడా యజమాని ఎవరో తేల్చాలి. జరిగిన ప్రతీ అమ్మకం, కొనుగోలును నమోదు చేయాలి. వారసత్వ హక్కులను తేల్చాలి. భూ యాజమాన్యానికి సంబంధించిన అన్ని మార్పులను నమోదు చేయాలి. పెండింగ్‌లో పెట్టొద్దు. జూన్ 20 నాటికి వివరాల నమోదు కార్యక్రమం పూర్తి కావాలి. ఆ వివరాలను పొందు పరుస్తూ ‘ధరణి’వెబ్‌సైట్ రూపొందించాలి. భూమికి సంబంధించి ఇకపై ఒకటే లెక్క ఉండాలి’’అని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు.
ఆన్‌లైన్ ఫ్రీజింగ్ ఎత్తివేత
భూమి వివరాలను నమోదు చేయడానికి ఆన్‌లైన్ ఫ్రీజింగ్‌ను ఎత్తివేయాలని సీఎం ఆదేశించారు. ఈ నెల 27 నుంచి ఫ్రీజింగ్ ఎత్తివేసి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయడానికి తహసీల్దార్లకు అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. వంద రోజుల పాటు భూరికార్డుల ప్రక్షాళన జరిగినప్పటికీ, కొన్నిచోట్ల రికార్డుల్లో తప్పులు దొర్లడం, అసమగ్ర వివరాలుండటం పట్ల సీఎం అసహనం వ్యక్తం చేశారు. సాంకేతిక కారణాలతోపాటు మానవ తప్పిదాలు కూడా ఉన్నాయని, దీనివల్ల రైతులకు కొంత అసౌకర్యం కలిగిందని, కొందరికి పాస్ పుస్తకాలు అందలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించినప్పుడు కొన్ని సమస్యలు తప్పవని, ఈ పరిస్థితిని సవాల్‌గా తీసుకుని, మరింత ప్రభావవంతంగా పనిచేయాలని సూచించారు. కొత్త జిల్లాలతో కలెక్టర్లకు పర్యవేక్షణ సులభమైందని, దీన్ని సానుకూలాంశంగా తీసుకుని మరింత చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలన్నారు. వచ్చేనెల నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానంతోపాటు రైతులకు జీవిత భీమా పథకం అమల్లోకి వస్తుందని, ఇవి సవ్యంగా సాగాలంటే భూరికార్డులు సరిగా ఉండాలని పేర్కొన్నారు.
ప్రక్షాళన విజయవంతం
భూముల సమస్యలను పరిష్కరించడానికి గత ప్రభుత్వాలు ఎన్నడూ శ్రద్ధ పెట్టలేదని సీఎం అన్నారు. ‘‘ప్రభుత్వ శాఖల మధ్య కూడా భూ వివాదాలున్నాయి. రెవెన్యూ, అటవీ శాఖ మధ్య గొడవలున్నాయి. భూరికార్డులు సరిగా లేకపోవడం వల్ల గ్రామాల్లో గొడవలు, ఘర్షణలు జరుగుతున్నాయి. వీటన్నింటికి చరమగీతం పాడాలనే ఉద్దేశంతోనే భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టాం. దేశంలో మరే రాష్ట్రం కూడా ఈ సాహసానికి పూనుకోలేదు. ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతమైంది. అధికారులు ఎంతో శ్రమకోర్చి రికార్డుల ప్రక్షాళన చేశారు’’అని చెప్పారు.
ప్రతి రైతుకు బీమా పట్టా
ప్రతి రైతుకు బీమా పట్టా అందిస్తామని సీఎం చెప్పారు. ‘‘రైతులు భూమిని నమ్ముకుని బతుకుతున్నారు. చాలామంది చిన్న, సన్నకారు రైతులే. ఒక్క ఎకరం లోపు భూమి ఉన్న రైతులు 18 లక్షల మంది ఉన్నారు. అలాంటి పేద రైతు చనిపోతే వారి కుటుంబం ఉన్నట్టుండి అగాథంలో పడిపోతుంది. కాబట్టి మరణించిన రైతు కుటుంబానికి 5 లక్షల బీమా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్‌ఐíసీ ద్వారా బీమా సౌకర్యం కల్పిస్తాం. రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది. ప్రతి రైతుకు బీమా పట్టా అందిస్తాం. రైతులు కోరుకున్న వారినే నామినీగా చేర్చాలి. బీమా పథకం అమలుకు సంబంధించి ఎల్‌ఐసీ అధికారులతో చర్చలు జరుపుతున్నాం. రైతు చనిపోయిన వెంటనే ఆయన కుటుంబానికి పరిహారం అందేలా రూపకల్పన చేయాలి’’అని అధికారులకు సూచించారు.
కల్యాణలక్ష్మికి కుల ధ్రువీకరణ వద్దు
రంజాన్ పండుగ ఏర్పాట్లు, రాష్ట్రావతరణ వేడుకలు, కల్యాణలక్ష్మి, హరితహారం తదితర కార్యక్రమాలపై సీఎం కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. రంజాన్ సందర్భంగా నియోజకవర్గాల వారీగా ముస్లింలకు దుస్తుల పంపిణీ చేయాలన్నారు. పేదలందరికీ కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తున్నందును కుల ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదని పేర్కొన్నారు. జూన్ 1 నుంచే పాఠశాలల ప్రారంభం అవుతున్నందున జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించాలని సూచించారు.
సీఎం తీసుకున్న కీలక నిర్ణయాలివీ..
– అసైన్డ్ భూములు కొన్న వారు పేదలైతే వారి పేరిటే యాజమాన్య హక్కులు కల్పించాలి. వారికి రైతు బంధు పథకం వర్తింపచేయాలి
– స్వస్థలానికి రాలేకపోతున్న ఎన్నారైలకు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి ప్రత్యేక విధానం అనుసరించాలి
– ఆధార్ నంబరు అనుసంధానం చేయడానికి ముందుకు రాని వారి పాస్ పుస్తకాలను పక్కన పెట్టాలి
– భూమికి సంబంధించిన అన్ని వివరాలతో ‘ధరణి’వెబ్‌సైట్ నిర్వహించాలి
– భూరికార్డులను నిర్వహించే విషయంలో అవినీతికి పాల్పడే వారిపట్ల అత్యంత కఠినంగా ఉండాలి. తప్పులు చేసిన వారిని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి
– పాస్ పుస్తకాల పంపిణీ, చెక్కుల పంపిణీ కార్యక్రమం వంద శాతం పూర్తయ్యే బాధ్యతను కలెక్టర్లతో పాటు మంత్రులు స్వీకరించాలి
– ప్రతీ మండలంలో వందశాతం బుక్కులు, చెక్కుల పంపిణీ కార్యక్రమం పూర్తయ్యే బాధ్యతను ఆయా మండలాల తహసీల్దార్లకు అప్పగించాలి. జిల్లాలో మంత్రి, నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలి.
చెక్కుల పంపిణీకి స్పెషలాఫీసర్లు వీరే..
పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ పర్యవేక్షణకు ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేకంగా నియమించింది. ఆ వివరాలివీ..
ఆదిలాబాద్– వికాస్‌రాజ్, భద్రాద్రి కొత్తగూడెం–అధర్ సిన్హా, జగిత్యాల–సందీప్‌కుమార్ సుల్తానియా, జనగామ–అజయ్‌మిశ్రా, జయశంకర్ భూపాలపల్లి–అరవింద్‌కుమార్, జోగులాంబ గద్వాల–రజత్‌కుమార్ సైనీ, కామారెడ్డి–టి.కె.శ్రీదేవి, కరీంనగర్–స్మితా సబర్వాల్, ఖమ్మం– నీతూకుమారి ప్రసాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్–టి.చిరంజీవులు, మహబూబాబాద్–క్రిస్టినా చోంగ్తు, మహబూబ్‌నగర్–దానకిశోర్, మంచిర్యాల–నవీన్‌మిట్టల్, మెదక్–రంజీవ్ ఆర్.ఆచార్య, మేడ్చల్ మల్కాజ్‌గిరి–జయేశ్ రంజన్, నాగర్ కర్నూల్–వి.అనిల్‌కుమార్, నల్లగొండ–సోమేశ్‌కుమార్, నిర్మల్– శశాంక్ గోయల్, నిజామాబాద్–రామకృష్ణారావు, పెద్దపల్లి–ఎన్.శ్రీధర్, సిరిసిల్ల–సునీల్‌శర్మ, రంగారెడ్డి– శైలజ రామయ్యర్, సంగారెడ్డి–మాణిక్ రాజ్, సిద్దిపేట– చిత్రా రామచంద్రన్, సూర్యపేట– వై.శ్రీలక్ష్మీ, వికారాబాద్–ఎన్.శివశంకర్, వనపర్తి–అనితా రాజేంద్ర, వరంగల్ అర్బన్– ఎం.వీరబ్రహ్మయ్య, వరంగల్ రూరల్– ఎం.జగదీశ్వర్, యాదాద్రి భువనగిరి– శాంతికుమారి.
Comments
Please login to add a commentAdd a comment