సాక్షి, ఆదిలాబాద్: ప్రభుత్వం ప్రతి ఏడాది వ్యవసాయ పంట రుణ లక్ష్యాన్ని పెంచుతున్నప్పటికీ రైతుకు మాత్రం పూర్తి స్థాయిలో ప్రయోజనం దక్కడం లేదు. రైతులకు ఈ మేర రుణం లక్ష్యం పెంచుతున్నామని గొప్పగా చెప్పుకోవడమే గానీ రుణం అందించడంలో బ్యాంకర్లు వెనకంజ వేస్తున్నారు. ఏ ఏడాది కూడా లక్ష్యం పూర్తి చేసింది లేదు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉంది.
తాజాగా నాబార్డు ఇటీవల జిల్లా వార్షిక ప్రణాళికను ప్రకటించింది. అందులోనూ 2018–19 కోసం వ్యవసాయ పంట రుణ లక్ష్యం పెంచింది. అదే సమయంలో 2017–18కి సంబంధించి వ్యవసాయ పంట రుణాలు రైతులకు అందించడంలో బ్యాంకర్లు వెనకబడ్డారు.
15 శాతం పెంపు..
2017–18 కంటే 2018–19 వ్యవసాయ పంట రుణ లక్ష్యాన్ని 15 శాతం పెంచింది. హెచ్చింపు ఘనంగా ఉన్నప్పటికీ రైతులకు పంట రుణాలు అందించడంలో బ్యాంకర్లు వెనకబడిపోతున్నారు. ప్రతి ఏడాది ప్రభుత్వం ఖరీఫ్, రబీ కింద వ్యవసాయ పంట రుణాలను ప్రకటిస్తుంది. ఖరీఫ్‌లో బ్యాంకర్లు రైతులకు విరివిగా రుణాలు ఇస్తున్నప్పటికీ రబీకి వచ్చేసరికి చేతులెత్తేస్తున్నారు. దీంతో రబీలో పంట సాగు చేసే రైతులు పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంటోంది.
పంట కాలంపై అప్పులు తీసుకునే రైతులు 20 శాతానికి పైగా వడ్డీ చెల్లిస్తుండడంతో పంటపై లాభం మాటేమో గానీ నష్టం మూటకట్టుకోవాల్సి వస్తోంది. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ప్రభుత్వం రుణ లక్ష్యాన్ని పెంచుతున్నప్పటికీ రైతులకు రెండు పంట కాలాల్లో రుణం అందించలేకపోతోంది. బ్యాంకర్ల చుట్టూ తిరగలేక రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే పంటలపై ఆర్థిక స్వాలంబన సాధించలేని దుస్థితి ఉంది.
రైతుల ఆదాయం పెరిగేదెలా..
రైతుల ఆదాయాన్ని వచ్చే ఐదు సంవత్సరాలలో రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవసాయ రుణాలు, అనుబంధ రంగాల కోసం నాబార్డ్ ద్వారా రుణ లక్ష్యం ప్రకటించినప్పటికీ ఆచరణలో ఎలా ఉంటుందనేది భవిష్యత్తు నిర్ధారిస్తుంది. ప్రధానంగా ప్రతియేడాది ప్రభుత్వం వ్యవసాయ రుణాలను భారీగా ప్రకటిస్తున్నప్పటికీ అవి పూర్తిస్థాయిలో రైతులకు అందడంలేదు. 2017–18లో వ్యవసాయ రుణాల్లో ఇప్పటివరకు 73 శాతం మాత్రమే ఇవ్వడం జరిగింది. మరో నెలన్నరైతే వార్షిక సంవత్సరం ముగుస్తుంది.
వ్యవసాయ అనుబంధ రంగాల కోసం భారీగా రుణాలు ప్రకటిస్తున్నా పంపిణీలో చేతులెత్తేస్తున్నారు. ఈయేడాది లక్ష్యం, సాధించిన ప్రగతి లెక్కలే దీన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇందులో కేవలం 8.45 శాతం లక్ష్యం సాధించారంటే పరిస్థితి ఎలా ఉందో తేటతెల్లం అవుతుంది. ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం వ్యవసాయ రుణాలు, వ్యవసాయ అనుబంధ రంగాల రుణాలు పూర్తి స్థాయిలో అందించినప్పుడే రైతుకు ప్రయోజనం జరిగే అవకాశం ఉంది.
పంట రుణాల పరిస్థితి
రుణ లక్ష్యం(2017–18) రూ. 1328.53 కోట్లు
ఖరీఫ్ రుణ లక్ష్యం రూ. 996.43 కోట్లు
ఖరీఫ్‌లో ఇచ్చింది రూ.910.91 కోట్లు
రబీ రుణ లక్ష్యం రూ.332.10 కోట్లు
రబీలో ఇచ్చింది రూ.56.99 కోట్లు
ఖరీఫ్, రబీ కలిపి ఇచ్చిన రుణం రూ.967.90 కోట్లు
సాధించిన రుణ లక్ష్యం 73 శాతం
2018–19 రుణ లక్ష్యం రూ.1473 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment