సాక్షి, హైదరాబాద్ : దశాబ్దాల ఉద్యమ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటికి సరిగ్గా ఆరేళ్లు. నవజాత రాష్ట్రంగా 2014 జూన్ 2న ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆరేళ్ల వ్యవధిలోనే దేశ యవనికపై తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సారథ్యంలోని టీఆర్‌ఎస్ సర్కారు ఈ ఆరేళ్లలో వ్యవసాయం మొదలుకొని ఐటీ, పారిశ్రామిక రంగం దాకా, ఆరోగ్యం, విద్య నుంచి సంక్షేమం దాకా, సాగునీటి ప్రాజెక్టులు మొదలుకొని విద్యుత్ ఉత్పత్తి దాకా అన్ని రంగాల్లోనూ పురోగమిస్తోంది. సాహసోపేత పాలనా సంస్కరణలు, సరికొత్త సంక్షేమ, అభివృద్ధి పథకాలకు చిరునామాగా నిలుస్తోంది. మిషన్ భగీరథ, గ్రామీణ రోడ్లు, జాతీయ రహదారులు, డబుల్ బెడ్రూం ఇళ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనలో దూసుకెళ్తోంది. హరితహారం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పచ్చదనం, పరిశుభ్రత పెంచడం దిశగా అడుగులు వేస్తోంది. ఆరేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం సాగించిన ప్రస్థానంపై అవలోకనం...
వేగంగా పాలనా సంస్కరణలు..
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పాలనను పరుగులు పెట్టించే లక్ష్యంతో 2016లో ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనతో 33 జిల్లాలుగా తెలంగాణ స్వరూపం మార్చుకుంది. వేగంగా జరుగుతున్న పట్టణీకరణను దృష్టిలో పెట్టుకొని కొత్తగా ఏడు కార్పొరేషన్లు, 76 మున్సిపాలిటీలు, 30 రెవెన్యూ డివిజన్లు, 131 మండలాలు ఏర్పాటయ్యాయి. కొత్తగా రూపొందించిన పంచాయతీరాజ్ చట్టం ద్వారా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 4,383 గ్రామ పంచాయతీలతో కలుపుకొని మొత్తంగా పంచాయతీల సంఖ్య 12,751కు చేరింది. తండాలు, గిరిజన గూడేలను గ్రామ పంచాయతీలుగా మారుస్తూ 2018 మార్చి 28న చేసిన చట్టంతో కొత్తగా 1,777 గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. షెడ్యూల్ ఏరియాలో ఉన్న 1,281 గ్రామ పంచాయతీలు ఎస్టీలకు రిజర్వు కాగా జనాభా ప్రాతిపదికన మరో 688 గ్రామ పంచాయతీలు వారికే రిజర్వు అయ్యాయి. సుదీర్ఘకాలంగా ఉన్న హైకోర్టు విభజన జరగడంతో 2019 జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త హైకోర్టు మనుగడలోకి వచ్చింది. శాంతిభద్రతలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత భారీగా పోలీసు సిబ్బంది నియామకాన్ని చేపట్టడంతోపాటు పోలీసు శాఖను పునర్‌వ్యవస్థీకరించింది. దీంతో కొత్తగా ఏడు కమిషనరేట్లతోపాటు 25 పోలీసు సబ్ డివిజన్లు, 31 సర్కిళ్లు, 103 పోలీసుస్టేషన్లు కొత్తగా ఏర్పాటయ్యాయి.
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముస్తాబైన అసెంబ్లీ
ప్రజారోగ్యానికి ప్రాధాన్యత..
ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం ద్వారా ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగడంతోపాటు మాతా, శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది. ప్రభుత్వాసుపత్రుల్లో అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు 25 జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో 20 ఐసీయూలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నవజాత శిశువుల కోసం సిక్ న్యూబార్న్ కేర్ యూనిట్ (ఎస్‌ఎన్‌సీయూ)ల సంఖ్యను 18 నుంచి 42కు పెంచడంతోపాటు గర్భిణులు, బాలింతలకు అత్యవసర సేవల కోసం మెటర్నల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (ఎంఐసీయూ) ఏర్పాటు చేసింది. అంధత్వ రహిత తెలంగాణ నినాదంతో కంటి వెలుగు పథకం ప్రవేశపెట్టి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 1.54 కోట్ల మందికి నేత్ర పరీక్షలు జరిపింది. వారిలో 41 లక్షల మందికి కంటి అద్దాలు, మందులను ప్రభుత్వం ఉచితంగా అందజేసింది. జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో డియాగ్నస్టిక్ హబ్‌ల ఏర్పాటు ద్వారా పేదలు 58 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయించుకొనే వెసులుబాటు కల్పించింది. అమ్మ ఒడి పథకం కింద 102 వాహన సేవలతో గర్భిణులను సురక్షితంగా చేర్చడంతోపాటు 104 ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ వైద్య సేవలను అందిస్తోంది.
బాలికా విద్యకు ప్రోత్సాహం..
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థుల కోసం కొత్తగా 661 రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. బాలికా విద్యను ప్రోత్సహించేందుకు సగం స్కూళ్లను వారికి కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించేందుకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం, యూపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ లాంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసింది. వరంగల్‌లో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటుతోపాటు కొత్తగా ఐదు మెడికల్ కాలేజీలు, బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటైంది. వరంగల్‌లో సైనిక్ స్కూల్‌తోపాటు కొత్తగా 15 కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయి.
రాష్ట్ర ప్రగతికి రెండు కళ్లుగా ఐటీ, పరిశ్రమలు
తెలంగాణ ఏర్పాటు నాటికి రూ. 66,276 కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు 2019–20 నాటికి రూ. 1.28 లక్షల కోట్లకు చేరడం రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి అద్దం పడుతోంది. 2016లో రాష్ట్ర ప్రభుత్వం ఐటీ పాలసీని విడుదల చేయగా ప్రపంచంలోనే ఐదు అగ్రశ్రేణి కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్‌బుక్, సేల్స్‌ఫోర్స్ హైదరాబాద్‌లో వాటి రెండో అతిపెద్ద కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. ఐటీ రంగాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఓవైపు ఫలితాన్ని ఇస్తుండగా టైర్–2, టైర్–3 పట్టణాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్లను నిర్మిస్తోంది. ఐటీ రంగంలో హైదరాబాద్‌ను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు 65 వేల చదరపు అడుగుల్లో నిర్మించిన ఇంక్యుబేషన్ సెంటర్ ‘టీ–హబ్’, ‘వీ–హబ్’ద్వారా స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందిస్తోంది. 2014 నూతన పారిశ్రామిక చట్టం ద్వారా అమల్లోకి వచ్చిన టీఎస్–ఐపాస్ ద్వారా జనవరి 2020 నాటికి రూ. 2,04,000 కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చాయి. ఆన్‌లైన్ విధానం ద్వారా 12,427 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయగా 14 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. రాష్ట్ర పారిశ్రామిక రంగం జాతీయ సగటు కంటే ఎక్కువ వృద్ధిరేటును సాధించింది. టీఎస్–ఐపాస్ ద్వారా పరిశ్రమలు హైదరాబాద్, ఆ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏర్పాటయ్యాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు పెట్టుబడుల ఆకర్షణలో దేశవ్యాప్త సగటు వృద్ధిరేటు 20.8% కాగా తెలంగాణ ఏకంగా 79 శాతం వృద్ధి సాధించింది.
సాంస్కృతిక రంగంపై ప్రత్యేక శ్రద్ధ
సాంస్కృతిక, క్రీడా, పర్యాటక రంగాల అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ఆవిర్భావం నుంచి అనేక కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలుగు ప్రపంచ మహాసభల నిర్వహణ, అన్ని విద్యాసంస్థల్లో ఒక సబ్జెక్టుగా తెలుగు బోధన వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ స్వీయ ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకొని పలు ఆలయాల పునరుద్ధరణ ప్రారంభమవగా యాదగిరిగుట్టను (యాదాద్రి) ప్రభుత్వం గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతోంది. అలాగే వేములవాడ, భద్రాద్రి, కొమురవెల్లి మల్లన్న, కురవి వీరన్న తదితర పుణ్యక్షేత్రాలు, నాగార్జునకొండ వంటి బౌద్ధారామాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. రాష్ట్రంలో బతుకమ్మ, బోనాలు, రంజాన్, క్రిస్మస్ తదితర పండుగలకు ప్రభుత్వం అధికారిక హోదా కల్పించింది. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ హుస్సేన్‌సాగర్ తీరాన 12 ఎకరాల స్థలంలో నిర్మించే అమరవీరుల స్తూపం, స్మృతివనం నిర్మాణ దశలో ఉన్నాయి.
మౌలిక వసతుల మెరుగు...
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి ప్రతి జిల్లా కేంద్రానికి నాలుగు లేన్ల రోడ్లు, జిల్లా కేందం నుంచి మండల కేంద్రానికి డబుల్ లేన్, మండల కేంద్రం నుంచి ప్రతి గ్రామానికి పక్కా రోడ్డు ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఆవిర్భావం నుంచి సర్కారు నిధులు కేటాయిస్తూ వచ్చింది. ఇప్పటివరకు 3,150 కి.మీ. జాతీయ రహదారుల మంజూరుతో తెలంగాణలో మొత్తం 5,677 కి.మీ. మేర జాతీయ రహదారుల నెట్‌వర్క్ ఏర్పడింది. జాతీయ రహదారుల్లో ప్రస్తుతం జాతీయ సగటు 3.81 కిలోమీటర్లయితే తెలంగాణ రాష్ట్రం సగటు 5.02 కిలోమీటర్లు. మిషన్ భగీరథ పథకాన్ని రూ. 43,791 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టి లక్షా 40 వేల కిలోమీటర్ల పైపులైన్ల ద్వారా 2019 జనవరి నాటికి రాష్ట్రంలోని 23,968 ఆవాసాలకు తాగునీటిని అందించింది. నిరుపేదలకు గూడు కల్పించేందుకు 2,72,763 డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తోంది. పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచడంతోపాటు వార్డులవారీగా అవసరాలను గుర్తించి అభివృద్ధికి అవసరమైన వార్షిక, పంచవర్ష ప్రణాళికల కోసం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న పచ్చదనాన్ని 24 శాతం నుంచి 33 శాతానికి పెంచేందుకు చేపట్టిన హరితహారం ద్వారా గణనీయమైన మార్పు చోటుచేసుకుంది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవలి నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా పచ్చదనం పెరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది.
విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న తాత్కాలిక సచివాలయం బీఆర్‌కేఆర్ భవన్
సంక్షేమానికి పెద్దపీట..
నిరుపేద కుటుంబాలకు చెందిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత, బీడీ కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వృద్ధ కళా కారులు తదితరులు సుమారు 32 లక్షల మందికి ప్రతి నెలా ‘ఆసరా’పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం సామాజిక పెన్షన్లు అందజేస్తోంది. వికలాంగులకు రూ. 3,016, ఇతరులకు ప్రతి నెలా రూ. 2,016 చొప్పున సామాజిక పెన్షన్లు చెల్లిస్తోంది. పేదింటి ఆడపిల్లల పెళ్లి ఖర్చుల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ కేటగి రీలకు చెందిన వారికి కల్యాణ లక్ష్మి, మైనారిటీలకు షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ రూ. లక్షా పదహారు వేల చొప్పున అందిస్తోంది. ఆహార భద్రతలో భాగంగా తెల్ల రేషన్‌కార్డు కలిగిన ప్రతి వ్యక్తికీ నెలకు 6 కిలోల చొప్పున బియ్యాన్ని 17 వేలకుపైగా చౌక ధరల దుకాణాల ద్వారా 87.56 లక్షల కుటుంబా ల్లోని 2.80 కోట్ల మందికి పంపిణీ చేస్తోంది. ఎస్సీ, ఎస్టీల సామాజిక అభివృద్ధి కోసం జనాభా నిష్పత్తి మేరకు నిధుల కేటాయింపు, ఖర్చు కోసం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి చట్టం–2017 రూపొందించి వార్షిక బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తోంది.
అన్నదాతకు అండ
రైతు సంక్షేమం లక్ష్యంగా రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఏటా రూ. 10 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తున్న ప్రభుత్వం ప్ర తి రైతుకు రూ. 5 లక్షల జీవిత బీమా కల్పిస్తోంది. జీవిత బీమా ప్రీమియాన్ని కూడా ప్రభుత్వ మే చెల్లిస్తోంది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, ఎరువులు, విత్తనాలపై సబ్సిడీ, నీటి తీరువా రద్దు వంటి నిర్ణయాలు అమలు చేస్తోంది. రైతులను సంఘటిత రంగంలోకి తెస్తూ రైతుబంధు సమితులు ఏర్పాటు చేసింది. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు అమలు చేస్తోంది. నియంత్రిత పద్ధతిలో పంటల సాగును ప్రోత్సహించే దిశగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment