కల నెరవేరి ఏడాది
హైదరాబాద్ తెలంగాణ ఉద్యమంలో, ఉద్వేగాలతో ప్రజల గుండెల్లో నిలిచిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగానూ తన మార్క్‌ను చాటుకున్నారు. కొత్త రాష్ట్రం, ప్రజల ఆశలు, ఆకాంక్షలు.. అనే ట్యాగ్‌లైన్‌తో ‘బంగారు తెలంగాణ’ స్వప్నాన్ని ఆవిష్కరించారు. మేనిఫెస్టో అమలుపై దృష్టి సారిస్తూనే.. తక్షణ ప్రయోజనం కల్పించే అంశాలనూ అమల్లోకి తీసుకువచ్చారు. ప్రధానంగా సంక్షేమం, వ్యక్తిగత లబ్ధి కార్యక్రమాలతో జనాన్ని ఆకట్టుకునే వ్యూహంతో టీఆర్‌ఎస్ సర్కారు వ్యవహరించింది. పాలనా పగ్గాలు చేపట్టిన తొలిరోజుల్లో రేషన్ కార్డులు, పింఛన్ల ఏరివేత మొదలు సమగ్ర కుటుంబ సర్వే, రైతు రుణాల మాఫీ, టీఫాస్ట్ వంటి అంశాల్లో దూకుడుగా వెళ్లి తడబడిన టీఆర్‌ఎస్ సర్కారు.. అంతే వేగంగా నిలదొక్కుకుంది.
ప్రజలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూర్చే పథకాల్లో వేలు పెట్టి చేతులు కాల్చుకోవడం కంటే వాటినే తమకు అనుకూలంగా మలుచుకోవటమే మంచిదని గుర్తించింది. అప్పట్నుంచీ అందరికీ రేషన్ కార్డులు, ఆరు కిలోల బియ్యం, హాస్టళ్లకు, మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం, 37 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఆసరా పింఛన్లు.. పింఛన్ల మొత్తాన్ని రూ.వెయ్యికి పెంచడం, బీడీ కార్మికులకు జీవనభృతి, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను చేపట్టింది. వీటితోపాటు అంగన్‌వాడీలకు వేతనాల పెంపు, హోంగార్డుల జీతాల పెంపునకు పచ్చజెండా ఊపింది. పల్లెపల్లెనా ఇంటింటా ఆర్థిక ప్రయోజనం కల్పించిన ఈ పథకాలన్నీ టీఆర్‌ఎస్‌పై సానుకూలతలను పెంచాయి.