రాష్ట్రాన్ని అగ్రపథాన నిలుపుతాం | CM KCR Speech In Telangana Formation Day Celebrations | Sakshi
Sakshi News home page

ప్రజల ఆకాంక్షలకు తగ్గట్లుగా పనిచేస్తాం

Published Mon, Jun 3 2019 1:46 AM | Last Updated on Mon, Jun 3 2019 4:53 AM

CM KCR Speech In Telangana Formation Day Celebrations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ దశ, దిశ మార్చే అద్భుత ప్రాజెక్టు కాళేశ్వరం నుంచి వచ్చే నెలాఖరు నాటికి నిత్యం 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ ద్వారా నీటిని ఎత్తిపోస్తామని, వచ్చే ఏడాది నుంచి 3 టీఎంసీలు ఎత్తిపోసేందుకు వీలుగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జనగామ, మహబూబాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, జగిత్యాల, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లోని 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండేందుకు చాలినంత సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టు సిద్ధమవుతోందన్నారు. సముద్ర మట్టానికి 90 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తు దాకా నీళ్లను ఎత్తిపోసే ఇంజనీరింగ్‌ అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు నీటిపారుదలశాఖ సన్నద్ధంగా ఉందన్నారు. భూగర్భాన్ని తొలచి నిర్మించిన సొరంగాల గుండా ప్రవహించే గోదావరి జలాలు తెలంగాణ పొలాలను తడుపుతుంటే రైతుల బతుకులు బాగుపడే రోజు దగ్గరలోనే ఉందని కేసీఆర్‌ వివరించారు.

రాష్ట్రం ఏర్పడ్డ తొలి ఎన్నికల్లో విజయం తర్వాత ప్రణాళికాబద్ధ పనితీరు వల్ల ఎన్నో విజయాలు సాధించామని, వాటిని గమనించి రెండో ఎన్నికల్లో మరింత అద్భుత విజయాన్ని ప్రజలు అందించారని, వారి ఆశలకు తగ్గట్టుగా పనిచేసి తెలంగాణను అగ్రపథాన నిలిపేందుకు పనిచేస్తామని సీఎం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లోని జూబ్లీహాలు ఎదుట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. అమరవీరుల స్థూపం ముందు నివాళులర్పించిన అనంతరం ఉదయం 9 గంటలకు సీఎం కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సుదీర్ఘంగా ప్రసంగించారు. ఐదేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాధించిన విజయాలు, పురోగతి, భవిష్యత్తు తెలంగాణ వంటి అంశాలను ప్రస్తావించారు. కేసీఆర్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.... 

ప్రగతి బాటలో దూసుకెళ్తున్నాం... 
రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన వారు ఐదేళ్ల క్రితం తెలంగాణ వారికి పాలించుకోవటం తెలియదని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే చీకటి తెలంగాణగా మారుతుందని, అసలు ఒక రాష్ట్రంగా ఉండలేదు, మళ్లీ ఆంధ్రతో కలవాల్సిందేనని జోకులు వేసుకున్నారు. కానీ వారి అపనమ్మకాలను తిప్పికొడుతూ ఎక్కడా చిన్న తొట్రుపాటు, తడబాటు లేకుండా అద్భుత పురోగతి దిశలో వేగంగా దూసుకుపోతోందని నిరూపితమైంది. ఈ అద్భుత ప్రగతి తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం ఏకతాటిపై నిలిచి, పట్టుదలతో ప్రయత్నించి సాధించిన సమష్టి విజయం. 

ప్రజల దీవెనలే అండ... 
రాష్ట్ర సాధన కోసం రాజీలేని పోరాటం చేసిన వాళ్లే నూతన రాష్ట్రాన్ని ప్రగతి దారుల్లో నడిపిస్తారని తెలంగాణ ప్రజలు నమ్మి మాకు అధికారం కట్టబెట్టారు. దాన్ని మేం నిజం చేసి చూపుతున్నాం. అభివృద్ధి, సంక్షేమం... ఈ రెంటికి సమ ప్రాధాన్యం ఇస్తూ పునర్నిర్మాణానికి నడుం బిగించాం. మా పనితీరు మెచ్చి ప్రజలు వారి హృదయంలో మాకెంతటి స్థానం ఇచ్చారో గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే తేటతెల్లం చేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల దాకా... అన్నింటా విజయాన్ని కట్టబెడుతూ మాకు తిరుగులేని బలాన్ని అందిస్తున్నారు. ప్రజల దీవెనలే కొండంత అండగా భావిస్తూ తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుతున్నాం. 

తెలంగాణ అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తున్న సీఎం కేసీఆర్‌ 

బలమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ... 
తెలంగాణ ప్రభుత్వం ముందుచూపు, సమర్థవంతమైన ఆర్థిక విధానాలు, రాజకీయ అవినీతికి అవకాశం లేకుండా చేయడం, ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వల్ల తెలంగాణ నేడు ఒక బలమైన ఆర్థిక శక్తిగా, పురోగామి రాష్ట్రంగా నిలదొక్కుకుంది. మన రాష్ట్రం గత ఐదేళ్లలో సగటున 16.5 శాతం ఆదాయ వృద్ధిరేటు సాధించింది. ఈ ధోరణి ఇదే విధంగా కొనసాగి భవిష్యత్తులో రాష్ట్ర ఆదాయం మరిన్ని రెట్లు పెరిగే అవకాశాలు సుస్పష్టంగా కనబడుతున్నాయి. రాష్ట అభివృద్ధిని విçస్తృతం చేసేందుకు ఇది సానుకూల పరిణామం. 

విద్యుత్‌ సమస్యను సంపూర్ణంగా అధిగమించాం... 
అర్ధ శతాబ్దంగా తెలంగాణ ఎదుర్కొంటున్న అనేక జటిల సమస్యలకు ఈ ఐదేళ్లలో శాశ్వత పరిష్కరాలను చూపగలిగాం. అతితక్కువ కాలంలో కరెంటు సమస్యను సంపూర్ణంగా అధిగమించినం. విద్యుత్‌ వ్యవస్థను అధ్వాన స్థితి నుంచి అద్భుతం అనే స్థాయికి తీసుకురాగలిగినం. వ్యవసాయం సహా అన్ని రంగాలకు 24 గంటలపాటు నిరంతరాయ నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ఇది ఇటు వ్యవసాయం, అటు పరిశ్రమలకు నూతనోత్తేజాన్ని కలిగించింది. ఎండాకాలంలో తాగునీటి కష్టాలను మిషన్‌ భగీరథ దూరం చేసింది. ఇప్పటికే 97 శాతం పనులు పూర్తి చేసుకున్న గ్రామీణ మిషన్‌ భగీరథ పనులు జూలై చివరి నాటికి వంద శాతం పూర్తవుతాయి. పట్టణ ప్రాంతాల్లోనూ యుద్ధప్రాతిపదికన సిద్ధం చేయబోతున్నాం. 

నిరుపేద వర్గాలకు చేయూత... 
నిరుపేద వర్గాలకు నిజమైన చేయూత అందించడమే ప్రథమ ప్రాధాన్యతగా నిర్ణయించుకొని ఆసరా పింఛన్లను పెంచి అందిస్తున్నాం. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, నేత, గీత కార్మికులు, వృద్ధ కళాకారులు, బోదకాలు బాధితులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు ఆసరాగా నిలుస్తున్నాం. తెలంగాణ ఏర్పడిన వెంటనే రూ. 200 నుంచి రూ. వెయ్యికి పెంచిన పింఛన్లను మళ్లీ ఇప్పుడు పెంచి అందించనున్నాం. రూ. వెయ్యిగా ఉన్న పింఛన్లను రూ. 2,016కు, వికలాంగుల పింఛన్‌ను రూ. 1,500 నుంచి రూ. 3,016కు, వృద్ధాప్య పింఛన్ల వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 57కు తగ్గిస్తున్నాం. కొత్తగా మరో 6–7 లక్షల మందికి లబ్ధి చేకూర్చబోతున్నాం. కొత్త పింఛన్లు జూలై 1 నుంచి అందుతాయి. 

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అడుగులు... 
గ్రామీణ జీవితంలో మెరుగైన మార్పులు రావాలని ఆశించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా బలమైన అడుగులు వేయగలిగాం. శిథిలమైన చెరువులను పునరుజ్జీవింపచేసేందుకు ప్రారంభించిన మిషన్‌ కాకతీయ పథకం సత్ఫలితాలిచ్చింది. గొర్రెల పంపిణీ, చేపల పెంపకం విస్తరణ వాటిపై ఆధారపడ్డ ప్రజల జీవన స్థితిగతులు పెంచేందుకు బాగా దోహదపడ్డాయి. బతుకమ్మ చీరల తయారీని చేనేత కార్మికులకు అప్పగించి వారికి నిరంతరం పని దొరికేలా చేశాం. ఆలయాల అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఒకటో తేదీనే వేతనాలు అందేలా ఏర్పాటు చేశాం. అట్టడుగు వర్గాలకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందేలా నూతనంగా 608 రెసిడెన్షియల్‌ స్కూళ్లను ఏర్పాటు చేశాం. అంధత్వ నివారణ లక్ష్యంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలను అందించాం. త్వరలో దంత, చెవి, ముక్కు, గొంతు వ్యాధుల నివారణ కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభిస్తున్నాం. సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపి తెలంగాణ ఆరోగ్య సూచిక (హెల్త్‌ ప్రొఫైల్‌) రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 

ఆకుపచ్చ తెలంగాణ దిశగా వేగంగా అడుగులు... 
ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తుండటంతో రాష్ట్రంలో సాగునీటి కష్టాలు దూరం కానున్నాయి. కోటికి పైచిలుకు ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు గోదావరి, కృష్ణా నదులపై ఏకకాలంలో భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నాం. మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలతోపాటు నల్లగొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ ప్రాంతాలను పచ్చగా మార్చే దిశగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించుకుంటున్నాం. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు మొత్తం, మహబూబాబాద్‌ జిల్లాలో కొంత భాగానికి పుష్కలంగా> సాగునీరు లభించే విధంగా సీతారామ ఎత్తిపోతల పథకం యుద్ధప్రాతిపదికన సిద్ధమవుతోంది. జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, జనగామ, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల సాగునీటి అవసరాలు సంపూర్ణంగా తీర్చేందుకు వీలుగా దేవాదుల ప్రాజెక్టు స్థాయిని మరింత పెంచి నిర్మించుకుంటున్నాం. ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత తెలంగాణలో ఏటా రెండు పంటలు పండి, ధాన్యపు రాశులతో రాష్ట్రం అన్నపూర్ణగా అవతరిస్తుంది. 

రాష్ట్ర అవతరణ వేడుకల్లో జెండా వందనం చేస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో సీఎస్‌ ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి 

మరోసారి రూ. లక్ష రుణమాఫీ... 
రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చిన మొదటి దశలోనే రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేసి ఊరటనివ్వగలిగాం. ఇప్పుడు మరోసారి లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయబోతున్నాం. ఎరువులు, విత్తనాల కోసం గతంలో మాదిరిగా రైతులు అగచాట్ల పాలుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని సకాలంలో అందించగలుగుతున్నాం. 24 గంటల ఉచిత విద్యుత్‌తో రైతాంగంలో కొత్త ఆశల్ని కల్పించగలిగాం. రైతుబంధు పథకం ద్వారా అందించే మొత్తాన్ని ఎకరానికి ఏటా రూ. 8 వేల నుంచి రూ. 10 వేలకు పెంచి ఈ సంవత్సరం నుంచే అందించనున్నాం. ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే, అతని కుటుంబం అనాథగా మారకూడదని ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశ పెట్టింది. బీమా ప్రీమియంను పూర్తిగా ప్రభుత్వమే చెల్లించి మరణించిన రైతు కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా మొత్తాన్ని సత్వరమే అందిస్తోంది. 

త్వరలో క్రాప్‌ కాలనీలు... 
వ్యవసాయ కేంద్రిత పథకాల వల్ల పంటలు బాగా పండి భవిష్యత్తులో దిగుబడి పెరిగి కొత్త సమస్య ఏర్పడే అవకాశం ఉంది. ఆ పంటలకు మంచి ధర వచ్చేలా అవసరమైన సమగ్ర విధాన రూపకల్పన చేపట్టాం. రైతులందరూ ఒకే పంట వేయడం వల్ల డిమాండ్‌ తగ్గి గిట్టుబాటు ధర రాకుండా పోయే ప్రమాదాన్ని నివారించేందుకు క్రాప్‌ కాలనీలను ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నేలల రకాలు, వాతావరణ పరిస్థితులకు అనువైన పంటలు వేయించి వాటిని నియంత్రిత పద్ధతిలో మార్కెట్‌కు తరలించేలా సంస్కరణలు తీసుకురాబోతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పి రైతాంగానికి గిట్టుబాట ధర లభించేలా చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. 

ప్రతి గ్రామానికీ రూ. 8 లక్షలు... 
స్థానిక సంస్థల పనితీరును పునర్నిర్వచిస్తూ నూతన పంచాయతీరాజ్‌ చట్టానికి రూపకల్పన చేసిన ఫలితంగా ఊళ్ల తీరు మారనుంది. కేంద్ర ఆర్థిక సంఘం తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 1,229 కోట్లు కేటాయించింది. దానికి సమాన స్థాయి నిధులను రాష్ట్ర ప్రభుత్వం కూడా కేటాయించనున్నందున గ్రామీణ స్థానిక పరిపాలనా సంస్థలకు ఏటా రూ. 2,458 కోట్ల నిధులు అందుతాయి. 500 జనాభాగల చిన్న గ్రామ పంచాయతీకి కూడా ఏటా రూ. 8 లక్షల నిధులు అంది వాటి రూపురేఖలే మారిపోతాయి. నూతన పంచాయతీరాజ్‌ చట్టం పరిధిలో గ్రామ పరిపాలనలో అవినీతికి ఆస్కారం ఉండకూడదు. పంచాయతీరాజ్‌ వ్యవస్థలో పనిచేసే ప్రజాప్రతినిధులు, అధికారులు విధి నిర్వహణలో విఫలమైతే ఈ చట్టం ఉపేక్షించదు, కఠిన శిక్షలు విధిస్తుంది. పదవుల నుంచి తొలగిస్తుంది. ఈ చట్టాన్ని కఠినంగా అమలు పరచడం ద్వారా గ్రామాలన్నీ పరిశుభ్రతకు, పచ్చదనానికి పట్టుగొమ్మలుగా మారి కళకళలాడేలా చేయాలన్నది ప్రభుత్వ ఆశయం. 

నిరాడంబరంగా ఆవిర్భావ వేడుకలు... 
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఏటా సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానం వేదిక అవుతుండగా ప్రజలకు ట్రాఫిక్‌ చిక్కులు ఉండొద్దన్న సీఎం కేసీఆర్‌ ఆదేశంతో ఈసారి వేదికను నాంపల్లికి మార్చారు. అలాగే ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఈసారి పోలీసు కవాతు, విద్యార్థులతో కార్యక్రమాలు లేకుండా ఉదయాన్నే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొత్తంమీద ఈసారి ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి దాదాపు 750 మంది రైతు సమన్వయ కమిటీ సభ్యులు, చైర్మన్లు హాజరయ్యారు. అయితే వేడుకను చూసేందుకు ప్రజలు పబ్లిక్‌ గార్డెన్‌కు వచ్చినప్పటికీ పాస్‌లు ఉన్న వారినే పోలీసులు లోనికి అనుమతించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మడిపల్లి దక్షిణామూర్తి వ్యవహరించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement