ఒకే ఒక్కడు
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని అన్నీ తానై నడిపిస్తున్న సీఎం కేసీఆర్
► ఆసరా, రుణమాఫీ, కల్యాణలక్ష్మి వంటి పథకాలతో పేదల కళ్లలో వెలుగు
► భారీ స్థాయిలో ఫిట్‌మెంట్‌లతో ఉద్యోగుల్లో ఆనందం
► {పతిష్టాత్మకంగా ‘మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్’ పథకాలు
► సమగ్ర కుటుంబ సర్వేతో రికార్డు..
► రాజకీయ అంశాల్లోనూ పైచేయి
మూడున్నర కోట్ల తెలంగాణవాసుల అరవయ్యేళ్ల కల ఫలించి ఏడాది పూర్తవుతోంది. నిధులు, నీళ్లు, నియామకాల కోసం జరిగిన పోరాటం సాధించిన విజయానికి తొలి ఏడాది పూర్తవుతోంది. రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ ఈ ఏడాదిలో ఎన్నో విజయాలు సాధించింది. ఉద్యమ నేతగా కోట్లాది మందిని ముందుండి నడిపించిన కేసీఆర్.. ఇప్పుడు సీఎంగా అన్నీ తానై నిలుస్తున్నారు. సరికొత్త పథకాలు, కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏడాదిగా రాష్ట్రంలో పాలనపై కథనాలు..
వివాదాస్పద నిర్ణయాలు
తొలి ఏడాదిలో టీఆర్‌ఎస్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బలు తగిలాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ‘టీ ఫాస్ట్’గా మార్చే ప్రయత్నానికి హైకోర్టు బ్రేక్ వేసింది. ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా కట్టబెట్టేందుకు ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థనూ కోర్టు తప్పుపట్టింది. వీటికి తోడు సచివాలయం తరలింపు, సీఎం క్యాంపు ఆఫీసుకు స్థలాల వెతుకులాట, ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రి తరలింపు, ఉస్మానియా వర్సిటీ భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తామన్న ప్రకటన వంటివన్నీ వివాదాస్పదంగా మారాయి.
విభజన వివాదాల్లో పైచేయి...
ఏపీతో విభజన వివాదాల్లో గట్టి పట్టుదలతో వ్యవహరించిన తెలంగాణ సర్కారు దాదాపుగా పంతం నెగ్గించుకుంది. టీఎస్‌పీఎస్సీ, ఉన్నత విద్యామండలి, న్యాక్, డాక్టర్ వైఎస్సార్ నిథిమ్, టీఎస్‌ఈఆర్సీ, ఆర్టీసీ.. ఇలాంటి అంశాలన్నింటా పట్టు నిలుపుకొంది. వాహనాల నంబర్ ప్లేట్ల మార్పు, తెలంగాణలోకి ప్రవేశించే ఏపీ వాహనాలకు పన్ను విధింపు వంటి విషయాలు కోర్టు వరకు వెళ్లినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిక్కచ్చిగా వ్యవహరించారు. చర్చలు ముగియకముందే ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడం, వారం రోజుల ఆర్టీసీ సమ్మె అనంతరం కార్మికులు అడిగిన దాని కంటే ఎక్కువగా 44 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడం, విద్యుత్ ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్, సింగరేణి కార్మికులకు బోనస్, డిపెండెంట్లకు ఉద్యోగాలు వంటివన్నీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగ వర్గాలు, కార్మికులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ నిర్ణయాలన్నీ పొరుగు రాష్ట్రాన్ని ఇరుకున పెట్టిన వ్యూహాలుగా రాజకీయంగా టీఆర్‌ఎస్‌కు పేరు తేవడం అదనపు లాభం.
ప్రతిష్టాత్మక పథకాలు కూడా..
ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ ఇచ్చిన ప్రతిష్టాత్మక పథకాలనూ అమల్లోకి తేవడం ప్రారంభించింది. రూ.17 వేల కోట్ల రైతుల రుణాల మాఫీ, నిరుపేద దళిత కుటుంబాలకు మూడెకరాల భూ పంపిణీని చేపట్టింది. అయితే భూపంపిణీని లాంఛనప్రాయంగా మమ అనిపించిన సర్కారు దాన్ని నిరంతర కార్యక్రమంగా సాగదీసింది. ఇక డబుల్ బెడ్ రూం ఇళ్లు, కేజీ టు పీజీ నిర్బంధ ఉచిత విద్య, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాల పథకాలపై మాత్రం దాటవేత ధోరణిని ప్రదర్శించింది.
తిరుమల తరహాలో యాదాద్రి
తిరుమల తరహాలో యాదగిరిగుట్టను అభివృద్ధి చేసేందుకు సీఎం అధ్యక్షతన ఆలయ అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మరెన్నో విభిన్న నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. తెలంగాణ పండుగలకు అధికారిక గుర్తింపు, 350 కోట్ల తో పోలీసు వ్యవస్థ ఆధునీకరణ, గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలని సంకల్పించడం, అధికారికంగా కొమురం భీం వర్ధంతి, అధికారికంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి, పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు, కాళోజీ పేరిట హెల్త్ వర్సిటీ, అధికారికంగా దాశరథి జయంతి, ఇంజనీర్స్‌డేగా నవాబ్‌జంగ్ జయంతి, అధికారికంగా ఈశ్వరీబాయి వర్ధంతి, కాకా వర్ధంతి, జయంతి.. అజ్మీర్ దర్గా వద్ద రూ.5 కోట్లతో వసతి గృహం.. బక్రీద్, రంజాన్, క్రిస్‌మస్‌లకు రెండు రోజుల సెలవు, శబరిమలలో ఐదెకరాల స్థలం, ఎవరెస్ట్ అధిరోహించిన గిరిజన బిడ్డలు పూర్ణ, ఆనంద్‌లకు చెరో 25 లక్షల నగదు ప్రోత్సాహకం, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు ఆర్థిక సాయం, ఎస్టీ, మైనారిటీ వర్గాల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల సారథ్యంలో కమిషన్ల ఏర్పాటుపై దృష్టి సారించింది.
విద్యుత్ విజయం...
తెలంగాణ వస్తే చీకట్లు కమ్ముకుంటాయని కొందరు సమైక్య నేతలు చెప్పిన మాటలను టీఆర్‌ఎస్ సర్కారు పటాపంచలు చేసింది. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ప్రైవేటు ఏజెన్సీల నుంచి విద్యుత్ కొనుగోలు చేసి పంపిణీ చేసింది. తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో భారీగా కొత్త విద్యుత్ ప్రాజెక్టులను చేపడుతోంది. సింగరేణికి చెందిన జైపూర్ ప్లాంట్, భూపాలపల్లి, మణుగూరు, కొత్తగూడెం ఏడో దశతో పాటు నల్లగొండ జిల్లా దామరచర్లలో మెగా విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి నిధుల సమీకరణతో పాటు భూసేకరణను వేగవంతం చేసింది. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సీఎం స్వయంగా వెళ్లి ఒప్పందం చేసుకొని వచ్చారు. ఇక విద్యుత్ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దుచేసుకుని ఏపీ ప్రభుత్వం తెలంగాణను ఇబ్బంది పెట్టింది. కృష్ణపట్నం, సీలేరు విద్యుత్‌ను ఇచ్చేందుకు నిరాకరించింది. ఒకదశలో సుప్రీంకోర్టు వరకు వెళ్లేందుకు సిద్ధపడ్డ తెలంగాణ సర్కారు.. ఇప్పుడు ఏపీ విద్యుత్ ఇచ్చినా మాకు అవసరం లేదని అనగలగడం విశేషం.
పరిశ్రమలపై ఫోకస్
కొత్త రాష్ట్రం కావడంతో ఉపాధి అవకాశాలు పెంచేందుకు పరిశ్రమల స్థాపనపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామనే హామీతో కొత్త పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. 15 రోజుల్లోనే అన్ని అనుమతులు మంజూరు చేసేలా కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకువచ్చింది.
ప్రతిష్టాత్మక పథకాలు కూడా..
ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ ఇచ్చిన ప్రతిష్టాత్మక పథకాలనూ అమల్లోకి తేవడం ప్రారంభించింది. రూ.17 వేల కోట్ల రైతుల రుణాల మాఫీ, నిరుపేద దళిత కుటుంబాలకు మూడెకరాల భూ పంపిణీని చేపట్టింది. అయితే భూపంపిణీని లాంఛనప్రాయంగా మమ అనిపించిన సర్కారు దాన్ని నిరంతర కార్యక్రమంగా సాగదీసింది. ఇక డబుల్ బెడ్ రూం ఇళ్లు, కేజీ టు పీజీ నిర్బంధ ఉచిత విద్య, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాల పథకాలపై మాత్రం దాటవేత ధోరణిని ప్రదర్శించింది.
మేనిఫెస్టోలో లేకున్నా..
మేనిఫెస్టోలో పెట్టకున్నా, ముందుగా హామీ ఇవ్వకున్నా.. భారీ లక్ష్యాలు, బృహత్తర ప్రయోజనాలతో కూడిన రూ.40 వేల కోట్ల వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు, రూ.22 వేల కోట్ల ‘మిషన్ కాకతీయ’ చెరువుల పునరుద్ధరణ పథకాలపై ప్రభుత్వం అమితాసక్తి ప్రదర్శించింది. చెరువుల్లో పూడికతీత పనులు పల్లెపల్లెనా ముమ్మరంగా సాగటంతో క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్‌కు ఉపాధి కల్పించటంతో పాటు, ప్రభుత్వం ఆశించినంత ప్రచారమూ వచ్చింది. రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా నీటిని ఇవ్వకపోతే.. వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని సీఎం కేసీఆర్ సవాలు చేయడం వాటర్‌గ్రిడ్‌పై సర్కారు ప్రాధాన్యాన్ని స్పష్టం చేసింది. కానీ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కార్యాచరణ నత్తనడకన సాగుతోంది. రూ.10 వేల కోట్లతో రోడ్ల అభివృద్ధి, తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళాకారులకు ఉద్యోగాలు, వృద్ధ కళాకారులకు పింఛన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు జీతాల పెంపు, భూముల క్రమబద్ధీకరణ, అమరవీరుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఆర్థిక సాయం ఇవన్నీ టీఆర్‌ఎస్‌కు పేరు తెచ్చిపెట్టాయి.