పజలు మాపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం
సంక్షేమం, దీర్ఘకాలిక అభివృద్ధే ఎజెండా
60 ఏళ్ల పీడకలను మర్చిపోయేలా ఏడాది పాలన
జిల్లాపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి..
పోలీసుల చైతన్యానికి అభినందనలు
రాష్ట్ర అవతరణ తొలి వేడుకల్లో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
పజలు అనుకున్న, ఆశించిన స్థాయిలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తోంది. 60 ఏళ్ల పీడకలను ఏడాది కాలంలోనే మర్చిపోయేలా కేసీఆర్ పాలన సాగిస్తున్నారు. పాలనలో కేసీఆర్‌కు వందకి వెయ్యి మార్కులు వచ్చాయి. అందరి కలలను నెరవేరుస్తాం.
- విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ‘తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభమైనప్పటి నాటి అనుమానాలు, అంతకుముందు అపశ్రుతుల జ్ఞాపకాలు... తెలంగాణ వస్తదా? తెస్తరా? ఎక్కడొదస్తదిలే... అనే భావన నుంచి ఎందుకు రాదు? ఎవరికోసం ఇస్తరు? తెచ్చి తీరుతం.. వచ్చి తీరుతుంది స్వరాష్ట్రం... అని పోరాటం చేశాం. ఇప్పుడు దేశమంతా మనవైపే చూస్తోంది. ఉద్యమాలు చేసిన వారికి పరిపాలన చేయడం వస్తుందా? ఎలా ఉండబోతోంది తెలంగాణ భవిష్యత్? అనే చర్చ దేశ వ్యాప్తంగా జరుగుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని అమలుపరుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ దిశగా ముందుకెళుతున్నాం.
అందులో భాగంగా అన్ని పార్టీలు, ప్రజాప్రతినిధుల సహకారం, ప్రజల భాగస్వామ్యంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం.’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా మంగళవారం ఆయన నల్లగొండలోని పోలీస్‌పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్షేమం, మౌలిక వసతుల కల్పన, దీర్ఘకాలిక అభివృద్ధి అనే మూడు ప్రధాన అంశాల ఎజెండాతో పనిచేస్తున్నామని చెప్పారు. గత 60 ఏళ్లలో పాలకులు చేసిన పొరపాట్లను అధిగమించుకుంటూ ప్రజలందరినీ దారిద్య్ర రేఖ దిగువ నుంచి బయటకు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజలు అనుకున్న, ఆశించిన స్థాయిలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకెళుతోందని, 60 ఏళ్ల పీడకలను ఏడాది కాలంలోనే మర్చిపోయేలా కేసీఆర్ పాలన సాగిస్తున్నారని చెప్పారు.
పాలనలో కేసీఆర్‌కు 100కి వెయ్యి మార్కులు వచ్చాయని ప్రశంసించారు. అనుకున్నదాని కంటే ముందుగానే 6నెలల్లోనే పాలనను గాడిలో పెట్టి ప్రజాసంక్షేమ పాలన సాగిస్తున్నామని, ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులందరూ జిల్లా అభివృద్ధి కోసం సహకరించాలని కోరిన జగదీశ్‌రెడ్డి జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధుల సహకారంతో పాటు ప్రజలందరి భాగస్వామ్యంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, జిల్లా ప్రజల కలలను నెరవేరుస్తామని చెప్పారు. జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, గతంలో ఏ సీఎం రాని విధంగా ఏడాది కాలంలోనే జిల్లాకు 12 సార్లు వచ్చి వెళ్లారని చెప్పారు.
యాదగిరిగుట్ట క్షేత్ర అభివృద్ధి, దామరచర్ల పవర్‌ప్లాంటు ఏర్పాటు, రాచకొండ గుట్టలను పారిశ్రామికంగా అభివృద్ధిచేయడం, జిల్లా ప్రజలందరికీ తాగునీరు అందేలా వాటర్‌గ్రిడ్ ఏర్పాటు, ఆలేరుకు పాములపర్తి రిజర్వాయర్ నుంచి నీరు తె చ్చేలా ప్రణాళికలు రూపొందించడం లాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని, ఈ ఏడాది కాలంలో జిల్లా అభివృద్ధి కోసం కృషి చేసిన అధికారులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. జిల్లా పోలీస్ సిబ్బంది వృత్తి పరంగా చూపిన చైతన్యాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. నలుగురు పోలీసులు ప్రాణాలు పోగొట్టుకుని కూడా మొక్కవోని దీక్షతో ఉగ్రవాదులను మట్టుబెట్టిన పోలీసుల త్యాగాన్ని ప్రతి ఒక్కరూ అభినందించాలని మంత్రి చెప్పారు.
ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలివే...
జిల్లా ప్రజల అవసరాలు తీర్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రి జగదీశ్ చెప్పారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని, దేశంలోనే ఏ రాష్ట్రం ఖర్చు పెట్టని విధంగా ఏడాది రూ.27వేల కోట్ల రూపాయలను సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు పెడుతున్నామని చెప్పారు. జిల్లాలో మొత్తం 4లక్షల మందికి ఆసరా పథకం కింద పింఛన్లు ఇస్తున్నామని, ఇందుకోసం ఏటా 44.88 కోట్లు ఖర్చు పెడుతున్నామని మంత్రి చెప్పారు. చెరువుల్లో జలకళ ఉంటేనే గ్రామాలు కళ కళలాడతాయనే ఆలోచనతో మిషన్ కాకతీయ పథకం ద్వారా జిల్లాలోని 900కు పైగా చెరువుల్లో పూడిక తీయించే కార్యక్రమం కోసం రూ.308 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు చెప్పారు.
గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా వేసవిలో కూడా నిరంతర కరెంటును సరఫరా చేశామని, వచ్చే మార్చి నుంచి రైతులకు పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని చెప్పారు. దామరచర్ల మండలంలో 4వేల మెగావాట్ల విద్యుత్‌ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం ద్వారా అటు విద్యుత్‌కొరతను తీర్చడంతో పాటు ఇటు వేలాది మందికి ఉపాధి కల్పన చేస్తున్నామని చెప్పుకొచ్చారు. జిల్లా వ్యాప్తంగా 5లక్షల మంది రైతులకు 2,534 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశామని, వ్యవసాయ యాంత్రీకరణ, ధాన్యం కొనుగోళ్ల కోసం పెద్దఎత్తున నిధులు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. ఆరోగ్య లక్ష్మి, కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ లాంటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను జిల్లాలో పారదర్శకంగా అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు.
అవార్డుల ప్రదానం
రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ రంగాల నుంచి ఎంపిక చేసిన 30 మంది ప్రముఖులకు మంత్రి జగదీశ్‌రెడ్డి అవార్డులు అందజేశారు. మెమొంటోతో పాటు 51,116 రూపాయల నగదు బహుమతిని ఆయన అందజేశారు. వేడుకల్లో భాగంగా జిల్లా పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రధర్శనతో పాటు జిల్లాకు చెందిన చిన్నారుల ఆటపాటలతో కూడిన విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పోలీస్‌పరేడ్ గ్రౌండ్స్‌లో వేడుకల కంటే ముందు మంత్రి జగదీశ్‌రెడ్డి క్లాక్‌టవర్ సెంటర్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అవతరణ వేడుకల్లో జెడ్పీ చైర్మన్ బాలునాయక్, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి, జేసీ సత్యనారాయణ, డీఐజీ గంగాధర్, ఏఎస్పీ గంగారాం, ఆర్డీఓ వెంకటాచారి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, వెంకటనారాయణగౌడ్ పాల్గొన్నారు.
కలలు నెరవేరుస్తాం
Published Tue, Jun 2 2015 11:49 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement
Advertisement