రైతుబంధే శ్రీరామరక్ష | Farmers Scheme is Useful For TRS in The State | Sakshi
Sakshi News home page

రైతుబంధే శ్రీరామరక్ష

Published Sun, Mar 31 2019 2:28 AM | Last Updated on Sun, Mar 31 2019 7:54 AM

 Farmers Scheme is Useful For TRS in The State - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు రైతు బంధు పథకం ఓట్ల వరదాయినిగా మారింది. గంపగుత్తగా ఓట్లు పడేలా ఇది ఉపయోగపడుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రైతు బంధు పథకమే టీఆర్‌ఎస్‌కు అధికారం కట్టబెట్టిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు. రైతు బంధుతో లబ్ధి పొందిన అన్నదాతలు అనేక మంది ఆ పార్టీని ఆశీర్వదించి ఊహించని విజయాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ ఈ పథకం ఓట్ల వర్షం కురిపిస్తుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. దీంతో ఈ పథకంపై పార్టీ శ్రేణులు పెద్దెత్తున ప్రచారం చేస్తున్నాయి. వచ్చే మే నెలలో మరోసారి ఖరీఫ్‌ పెట్టుబడి సాయం అందుతుందని చెబుతున్నాయి.  

వచ్చే సీజన్‌ నుంచి ఎకరానికి రూ.10 వేలు... 
రైతు బంధు పథకాన్ని ఇతర రాష్ట్రాలే కాక ఐక్యరాజ్యసమితి కూడా గుర్తించి ప్రశంసించిన సంగతి తెలిసిందే. దీంతో దేశంలోని పలు రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేసేందుకు ముందుకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం దీని ఆధారంగా పీఎం–కిసాన్‌ పథకాన్ని ఇటీవల ప్రవేశపెట్టింది. సీజన్‌ ప్రారంభానికి ముందే సాగు ఖర్చు సహా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి పెట్టుబడి సాయం ఇవ్వడమే దీని లక్ష్యం. ఖరీఫ్, రబీలో ఒక్కో సీజన్‌కు ఎకరాకు రూ.4 వేలు ఇచ్చేలా దీన్ని రూపొందించారు. ఈ ప్రకారం రాష్ట్రంలో 2018–19 ఖరీఫ్‌లో 50.91 లక్షల మంది రైతులకు చెక్కులిచ్చి రూ. 5,256 కోట్లు అందజేశారు. రబీ సీజన్‌ కింద 43.60 లక్షల మందికి రూ. 4,724 కోట్లు రైతు బంధు సొమ్ము ఇచ్చారు. రెండు సీజన్‌లు కలిపి దాదాపు రూ. 10 వేల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో చేరాయి. దీంతో రైతులంతా టీఆర్‌ఎస్‌కు ఓట్ల వర్షం కురిపించారు.

ఇదిలా ఉండగా వచ్చే ఖరీఫ్‌ నుంచి ఏడాదికి ఎకరాకు ఇచ్చే మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో రైతుల్లో మరింత ఊపు వచ్చింది. ఇది లోక్‌సభ ఎన్నికల్లోనూ తమకు లాభిస్తుందని అధికార పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. దీంతోపాటు కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం–కిసాన్‌ పథకం కింద ఇప్పటివరకు రాష్ట్రంలో 19.04 లక్షల రైతు కుటుంబాలకు రూ.380.80 కోట్లు బ్యాంకు ఖాతాలకు చేరాయి. ఇంకా 7.25 లక్షల మంది రైతులకు మాత్రం ఎన్నికల కోడ్‌ కారణంగా నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఎన్నికల తర్వాత వారికి రూ.145.04 కోట్లు వస్తాయని అంటున్నారు. రెండు విధాలా లాభం జరుగుతుండటంతో రైతులు టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదిస్తారని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఇది కేంద్ర పథకమైనా రాష్ట్ర అధికారుల ద్వారానే వస్తుండటంతో టీఆర్‌ఎస్‌కే ప్రయోజనం కలుగనుందన్నది వారి వాదన. 

ఒకేవైపు కోటి ఓట్లు... 
రాష్ట్రంలో తాజా లెక్కల మేరకు 2.96 కోట్ల మందికి పైగా ఓటర్లున్నారు. గత ఖరీఫ్‌లో 50.91 లక్షల మంది రైతులు పెట్టుబడి సాయం పొందారు. అంటే భార్యాభర్తలను కలిపి చూసినా రైతు బంధు సాయం అందుకున్నవారివే కోటి ఓట్లు ఉంటాయి. వారి పిల్లలు, వారికి ఓట్లు ఉంటే మరో 25 లక్షల మంది ఉంటారు. అందులో ఇతర పార్టీలకు కొన్ని పోయినా ఒక అంచనా ప్రకారం నికరంగా కోటి ఓట్లు తమకు పడతాయన్నది టీఆర్‌ఎస్‌ వర్గాల ఆశాభావం. పైగా రైతు బంధు ద్వారా లబ్ధిపొందినవారిలో 68 శాతం మంది రైతులు ఐదెకరాల్లోపు వారే. వీరిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులేనని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. పైగా గ్రామీణ ఓటర్లు దాదాపు 40 శాతంపైగా ఉంటారని అంచనా. కాబట్టి 16 లోక్‌సభ సీట్లు కచ్చితంగా తమ ఖాతాలోనే పడతాయని టీఆర్‌ఎస్‌ వర్గాలు నమ్మకంతో ఉన్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement