సిరిసిల్ల: జై కిసాన్.. కాంగ్రెస్, బీజేపీల నినాదమని.. కానీ దానిని ఆచరించి చూపింది కేసీఆర్, టీఆర్‌ఎస్ ప్రభుత్వమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలకేంద్రంలో టీఆర్‌ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా రైతులకు పెట్టుబడి సాయాన్ని రైతు బంధుద్వారా అందించామని, అలాగే రైతులకు రైతు బీమా పథకం ద్వారా భరోసా కల్పించామని వివరించారు. టీఆర్‌ఎస్ అమలు చేస్తున్న పథకాలను ప్రధానమంత్రి కూడా పీఎం కిసాన్ సమ్మాన్ పేరుతో అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. తెలంగాణ విధానాలు దేశానికి ఆదర్శమయ్యాయని కేటీఆర్ పేర్కొన్నారు.
రైతులు ఏ విధంగా మరణించినా వారి కుటుంబాలకు రూ.5 లక్షల బీమా అందిస్తున్న ప్రభుత్వం ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. రాష్ట్రంలో మరోసారి రైతులకు రూ.లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేసేందుకు రూ.24 వేల కోట్లతో ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీనికో సం బడ్జెట్‌లోనూ నిధులను కేటాయించామని స్పష్టం చేశారు. రైతుబంధు పథకం కింద ఇప్పుడు ఏటా ఇ స్తున్న రూ.8 వేలు కాకుండా.. ముందు ముందు ఎకరానికి ఏటా రూ.10 వేలు పెట్టుబడి సాయాన్ని అందిస్తామని వెల్లడించారు. ‘ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి’ అనేది కేసీఆర్ లక్ష్యమని, ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు.
ఇంకా అప్పటి నినాదమేనా?
40 ఏళ్ల కిందటే గరిబీ హఠావో అన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అదే నినాదాన్ని ఇస్తోందని, ‘నాయనమ్మ, తాత, ముత్తాత’ పాలన చూశామని, 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఎక్కువకాలం పాలించిందని, అయితే కాంగ్రెస్, తర్వాత బీజేపీల పాలన బాగుంటే ఇంకా దేశం అభివృద్ధి చెందని దేశంగా ఎందుకుం ద ని ప్రశ్నించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో పొరపాటున కాంగ్రెస్, బీజేపీకి ఓటువేస్తే ఆగం అవుతారన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉందని, ఇంకొకరికి ఓట్లు వేసి ఆగం కావద్దని ప్రజలను కోరా రు. ‘టీఆర్‌ఎస్ 16 ఎంపీ సీట్లు గెలిస్తే.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తుంది. మిషన్ భగీరథకు నిధులొస్తాయి. మిషన్ కాకతీయకు గ్రాంటు వస్తుంది’ అని కేటీఆర్ వివరించారు.
కేంద్రంలో పనిచేసే నీతి ఆయోగ్ సంస్థ సిఫార్సులను కేంద్రం అమ లు చేయలేదని, రూ.24 వేల కోట్లు తెలంగాణకు ఇవ్వాలని ఆ సంస్థ సిఫార్సు చేస్తే.. ప్రధాని నరేంద్ర మోదీ నయాపైసా ఇవ్వలేదని విమర్శించారు. రేపు గులాబీ సైనికులు ఢిల్లీలో ఉంటే తెలంగాణకు మేలు జరుగుతుందన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి అవసరమన్నారు. గుణాత్మక మార్పు కోసం జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని కేటీఆర్ అన్నారు. అయితే టీఆర్‌ఎస్ నుంచి 16 మంది ఎంపీలు గెలిస్తేనే ఇది సాధ్యమన్నారు.
నరేంద్ర మోదీ ఏం మాట్లాడుతున్నారు?
‘తెలంగాణకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఏం మాట్లాడుతున్నారు..? కేసీఆర్‌ను తిడుతున్నారు. తెలంగాణ ప్రజానీకం ఓట్లు వేసి గెలిపిస్తేనే కేసీఆర్ సీఎం అయ్యారు. అలాంటి దమ్మున్న నాయకుడిని తిడితే ఓట్లు వస్తయా..? ఐదేళ్లు ఏం చేశారో చెప్పాలే. మరోసారి అవకాశం ఇస్తే ఏం చేస్తారో చెప్పాలే.. కానీ కేసీఆర్‌ను తిట్టిపోయిండు. ఈ చౌకీదార్.. ఈ టేకేదార్లు మనకు వద్దు. జిమ్మేదార్... ఇమాన్‌దార్.. నాయకుడు కేసీఆర్ వంటివారు మనకు కావాలి’అని కేటీఆర్ స్పష్టం చేశారు. దేశానికి కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని స్పష్టంచేశారు. కాగా, మైనార్టీల సంక్షేమంలో భాగంగా 120 గురుకులాలు ప్రారంభిం చి నాణ్యమైన విద్యను తెలంగాణ ప్రభుత్వం అంది స్తోందని ఆయన ఉర్దూలో ప్రసంగించారు. ఈ సభలో కరీంనగర్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్ నాయకులు బసవరాజు సారయ్య, భానుప్రసాదరావు, గూడూరి ప్రవీణ్, గడ్డం నర్సయ్య, ఆకునూరి శంకరయ్య, దయాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఏ గట్టునుంటారో తేల్చుకోవాలి
పరిగి/చేవెళ్ల/మొయినాబాద్: ‘ఈ గట్టున కారు... ఆ గట్టున బేకార్‌గాళ్లు.. ఏ గట్టునుంటారో.. ఎవరి కి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందో ఓటర్లే తేల్చుకోవాలి’ అని కేటీఆర్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పరిగి, చేవెళ్లలో రోడ్‌షో నిర్వహించారు. చేవెళ్ల రోడ్‌షోలో ఆయన మాట్లాడుతుండగా వర్షం కురవడంతో ఈ వాన మనకు ఆశీర్వాదమని.. విజయానికి సూచన అని అభివర్ణించారు. ఆయా రోడ్‌షోల్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం.. బీజేపీ ఎంపీలు గెలిస్తే మోదీకి లాభం.. టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తే మొత్తం తెలంగాణ ప్రజలకు లాభమన్నారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా కృష్ణా నీళ్లివ్వాలని పరిగిలో పాదయాత్ర డ్రామా ఆడుతున్న కాంగ్రెస్ నాయకులు.. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రాకుండా కోర్టుకు ఎక్కలేదా? అని ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతల నీళ్లు రానీయకుండా పరిగి ప్రాంత ప్రజల నోట్లో మట్టి కొట్టారని ఆరోపించారు.
రెండేళ్లలో పాలమూరు నీళ్లు తెస్తామని హామీనిచ్చారు. కరెం టు అడిగితే కాల్చి చంపిన కాంగ్రెస్‌కు.. అడగకుండానే 24 గంటలు కరెంటు ఇచ్చిన టీఆర్‌ఎస్‌కు మధ్య పోటీ జరుగుతోందన్నారు. దేశంలో కాంగ్రెస్‌కు 100 సీట్లు, బీజేపీకి 150 సీట్లు దాటవన్నారు. పాలమూరులో మీటింగ్ పెట్టిన ప్రధాని మోదీకి పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌కు 16 మంది ఎంపీలనిస్తే దేశ రాజకీయాలను శాసిస్తారన్నారు. కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, కొప్పుల మహేశ్‌రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, టీఆర్‌ఎస్ నేత హరీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment