సాక్షి, హైదరాబాద్ : తెలంగాణల లోక్‌సభ ఎన్నికల్లో వంద శాతం టీఆర్‌ఎస్ పార్టీ భారీ మెజారిటీతో 16 ఎంపీ సీట్లను గెలుస్తోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మెజారిటీలో మొదక్ మొదటి స్థానంలో, వరంగల్ రెండో స్థానంలో, కరీంనగర్ మూడు లేదా నాలుగో స్థానంలో నిలుస్తాయన్నారు. ఆదివారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజలను ఉత్తేజపరచడానికే తన భావ హరీశ్ రావుతో సరదాగా ఛాలెంజ్ విసిరానని చెప్పారు. మెదక్ సీఎం కేసీఆర్ ఇలాక అని, అక్కడ కచ్చితంగా టీఆర్ఎస్‌కు భారీ మెజారిటీ వస్తుందన్నారు.
ఇక ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ.. ఆ రాష్ట్ర అధికారులను ఎన్నికల సంఘం మారిస్తే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ప్రజల పట్ల నమ్మకం లేకనే ఆయన ఢిల్లీలో వీధినాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా తీర్పును స్వాగతించాలి కానీ చంద్రబాబులా గగ్గోలు పెట్టొద్దన్నారు. గెలిస్తే సాంకేతికత భేష్ అని, లేకపోతే ఈవీఎంల తప్పు అని చంద్రబాబు అనడం సరికాదన్నారు.ఆయన వాదనల్లో విశ్వసనీయత ఉంటే ప్రజలు ఆధరిస్తారని చెప్పారు.40ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న వ్యక్తి ఇంత చిల్లర అరుపులు ఎందుకు అరుస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. వంగి వంగి దండాలు పెట్టినప్పుడే చంద్రబాబు పని అయిపోయిందని అందరికి అర్థమైందన్నారు. రాహుల్ గాంధీ దక్షిణాదిన పోటీ చేసినంత మాత్రాన ఆయన ప్రభావం ఇక్కడ ఉండదన్నారు.
మే 20లోపు లోకల్ బాడీస్ ఎన్నికలు పూర్తి
మే 20 లోపు లోకల్ బాడీస్ ఎన్నికలు పూర్తచేయాలన్నది సీఎం కేసీఆర్ లక్ష్యమని కేటీఆర్ అన్నారు. ఎన్నికలు పూర్తయితే అభివృద్ధిలో ముందుకెళ్లొచ్చునని అభిప్రాయపడ్డారు. కొత్త మున్సిపల్ చట్టం తేవడం, రెవెన్యూ శాఖను ప్రక్షాలన చేయడం సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. లంచం,అవినీతి నిర్మూలించడమే టార్గెట్‌గా పెట్టుకొని తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment