Ktr : గుంజుకునేందుకు అధికారం నోట్ల కట్టలు కాదు | Minister Ktr Fire On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Ktr : గుంజుకునేందుకు అధికారం నోట్ల కట్టలు కాదు

Published Fri, Jul 9 2021 3:16 AM | Last Updated on Fri, Jul 9 2021 3:20 AM

Minister Ktr Fire On Chandrababu Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘అధికారాన్ని గుంజు కుంటాం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటున్నారు. కానీ గుంజుకునేందుకు అధికారం నోట్ల కట్టలలాం టిది కాదు. నోట్ల కట్టలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నంలో చంచల్‌గూడ జైలుకు పోయిన వ్యక్తి అదే తరహాలో పీసీసీ అధ్యక్ష పదవి కొను గోలు చేశాడని నీ సొంత పార్టీ నేతలే చెప్తున్నారు..’ అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. సింగరేణి కార్మిక సంఘం నేత కెంగర్ల మల్లయ్య తన అనుచరులతో కలిసి గురువారం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు.

టీడీపీని వీడినా పాత వాసన పోవడం లేదు
‘నీ స్థాయికి కేసీఆర్‌ పేరును ఉచ్ఛరించే అర్హత కూడా లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో సోనియా గాంధీని బలిదేవత అని వర్ణించిన రేవంత్‌.. ప్రస్తుతం ఆమెను తెలంగాణ తల్లి అని కీర్తిస్తున్నారు. రేపో ఎల్లుండో  చంద్రబాబును తెలంగాణ తండ్రి అని చెప్పే అవకాశం కూడా ఉంది. ఆయన టీడీపీని వీడినా పాత వాసన పోవడం లేదు, ఇప్పటికే టీపీసీసీని టీడీపీసీసీ అని పిలుస్తున్నారు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు, పీసీసీ అధ్యక్ష పదవి దొరకడంతో ప్రధానమంత్రి పదవి వచ్చినంత బిల్డప్‌ ఇస్తున్నాడు. ఓటుకు నోటు కేసులో చిప్పకూడు తిన్న దరిద్రుడు. నోట్ల కట్టలతో కెమెరా ముందు దొరికి నీతి మాటలు చెప్తున్నాడు..’ అని విమర్శించారు.

కేసీఆర్‌తో తలపడాలంటే డైలాగ్‌లు సరిపోవు
‘తెలంగాణలో కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే సత్తా ఎవరికీ లేదు. ఈ నడుమ మార్కెట్‌లోకి వచిన కొందరు కొత్త బిచ్చగాళ్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వేరే రాష్ట్రాలకు సీఎంలు ఉంటారు కానీ మీరు తలపడుతున్నది తెలంగాణ తెచ్చిన సీఎంతో. తెలంగాణ కోసం 20 ఏండ్ల నుంచి రాజీలేని పోరాటం చేసిన నాయకుడు కేసీఆర్‌. అలాంటి నాయకుడితో తలపడాలంటే కేవలం డైలాగ్‌లు సరిపోవు. కేసీఆర్‌ను తిడితే పెద్ద నాయకులం అవుతామనే ఆలోచన మానుకుని, ఆయనకంటే ఎక్కువగా తెలంగాణను ప్రేమిస్తేనే అక్కడో ఇక్కడో రెండు ఓట్లు వస్తయి..’ అని ఎద్దేవా చేశారు. 

తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలి
‘ప్రస్తుతం తెలంగాణలో పోటాపోటీ పాదయాత్రల సీజన్‌ నడుస్తోంది. నలుగురైదుగురు పాదయాత్రలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అసలే కరోనాతో ఆరోగ్యాలు దెబ్బతిన్నయి. పాదయాత్రలతో వారి ఆరోగ్యాలు సెట్‌ అవ్వాలని కోరుకుంటున్నా. పాదయాత్రలో భాగంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రతి పల్లెకూ వెళ్లి అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి రావాలి. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు కేంద్రం ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలి. ఏడేండ్లలో తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో కూడా చెప్పాలి. హుజూరాబాద్‌కు వేయి కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చేలా చూడాలి’ అని కేటీఆర్‌ అన్నారు. 

సమన్వయంతో పనిచేయాలి
‘సింగరేణి కార్మికులకు టీఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం. కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతారు. కాబట్టి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతలు, పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయాలి..’ అని పిలుపునిచ్చారు. సమావేశంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్, విప్‌లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు వెంకట్‌రావు, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement